CBI vs CBI: కాకినాడ సానా సతీశ్ బాబు ఫిర్యాదు ఎందుకు సంచలనమైంది?

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తన భవనంలో తానే తనిఖీలు చేసింది. ఆ సంస్థ డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ను అరెస్ట్ చేసింది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేసు పెట్టింది.

సీబీఐలో ఇన్ని సంచలనాలు జరగుతోంటే ఒకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనే సతీశ్ బాబు సానా.

2018 అక్టోబర్ 15వ తేదీన సతీశ్ బాబు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు మేరకే సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా, తదితర అధికారులపై కేసు నమోదు చేశామని సీబీఐ తెలిపింది.

ఇంతకీ ఫిర్యాదులో ఏముంది?

మెయిన్ అక్తర్ ఖురేషి కేసులో సీబీఐ పెట్టిన చార్జ్‌షీట్‌లో సతీశ్ బాబు పేరు మినహాయించేందుకు ఇద్దరు మధ్యవర్తులు సోమేశ్ కుమార్, మనోజ్ ప్రసాద్‌లకు రూ.ఐదు కోట్లు ఇచ్చినట్లు సతీశ్ బాబు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.అయిదు కోట్లు ఇవ్వక ముందు ఈ కేసుకు సంబంధించి అనేక సార్లు సీబీఐ కార్యాలయానికి హాజరయినట్లు సతీశ్ బాబు తెలిపారు.

అప్పుడు సీబీఐ అధికారి దేవేందర్ కుమార్ తనను పలుసార్లు విచారించారని చెప్పారు.

ఖురేషికి సంబంధించిన గ్రేట్ హైట్ ఇన్‌ఫ్రా సంస్థలో తాను రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని అదంతా ఇన్‌కం టాక్స్ రిటర్న్స్‌లోనూ చూపించానని సతీశ్ బాబు తెలిపారు.

ఇదే కేసులో 2017 నవంబర్ 1న తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా తనతో పాటు సీబీఐ విచారణకు హాజరయ్యారని తెలిపారు.

‘‘ఖురేషి కేసులో చార్జిషీటు నుంచి నా పేరు మినహాయించేందుకు సాయం చేస్తామని దుబాయిలో వ్యాపారం చేసే సోమేశ్‌ కుమార్, మనోజ్‌కుమార్‌లు చెప్పారు. వాళ్లు తమకు సీబీఐ అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. రూ.5 కోట్లు ఇస్తే ఖురేషి కేసు నుంచి బయటపడేస్తామని హామీ ఇచ్చారు'' అని సతీశ్ బాబు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

''విడతల వారీగా సోమేశ్ కుమార్, మనోజ్ కుమార్‌లకు డబ్బులు పంపినప్పటికీ దర్యాప్తు అధికారి దేవేంద్రకుమార్ నుంచి కొన్నాళ్ల విరామం తర్వాత నాకు నోటీసులు వచ్చాయి. దీంతో నేను ఆ విషయాన్ని సోమేశ్ కుమార్‌కు తెలిపాను. ఆయన మళ్లీ కొంత డబ్బు పంపాలని సూచించారు. ఇలా చాలా సార్లు జరిగింది. కానీ, నాకు నోటీసులు వస్తూనే ఉన్నాయి. దీనిపై మరోసారి వారిని సంప్రదించగా, సీబీఐలోని ఒక అధికారితో వారు మాట్లాడారు. ఆ అధికారి వాట్సాప్ డీపీని చూపించారు. ఆయన పేరు రాకేశ్ ఆస్థానాగా పేర్కొన్నారు. గూగుల్‌లో ఆయన గురించి సెర్చ్ చేశాను. వారు మాట్లాడింది రాకేశ్ ఆస్థానాతోనేనని నిర్ధరించుకున్నాను'' అని సతీశ్ బాబు ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images

మెయిన్ అక్తర్ ఖురేషి కేసు ఏంటి?

మొయిన్‌ అక్తర్ ఖురేషీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాంసం వ్యాపారి. దుబాయ్‌, యూరప్‌లోని పలు దేశాలకు మనీలాండరింగ్‌ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

మెయిన్ అక్తర్ ఖురేషి కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటయింది.

దేవేంద్ర కుమార్ ఈ ఎస్ఐటీలో దర్యాప్తు అధికారిగా పనిచేశారు.

ఈ కేసులో సతీశ్‌ బాబుకూ సంబంధం ఉందని భావించి దేంద్రకుమార్ ఆయన్ను పలుమార్లు విచారించారు.

ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి మధ్యవర్తులు సోమేశ్, మనోజ్‌లను ఆశ్రయించినట్లు సతీశ్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

దీంతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా, దేవేందర్ కుమార్, మధ్యవర్తులు మనోజ ప్రసాద్, సోమేశ్ ప్రసాద్‌లపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

లుక్ అవుట్ నోటీస్

''నా కుమారుడితో ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి రాగా అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సీబీఐ తనపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిందని చెప్పారు. దీంతో నేను షాక్‌కు గురయ్యాను..’’ అని సతీశ్ తన ఫిర్యాదులో తెలిపారు.

అంతకు ముందు వరకూ తన పేరుని ఆ కేసు నుంచి బయటపడేశారన్న భ్రమలో ఉన్నానని భావించినట్లు సతీశ్ చెప్పారు.

సీబీఐకి సంబంధించి మధ్యవర్తులతో జరిపిన లావాదేవీలు, వాట్సాప్ కాల్స్ వివరాలు తన దగ్గర ఉన్నాయని, అవసరమనుకుంటే వాటిని విచారణ అధికారులకు అందిస్తానని సతీశ్ ఫిర్యాదులో వివరించారు.

ఇంతకీ సతీశ్ ఎవరు?

సతీశ్ బాబు సానా మొదట్లో కాకినాడలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు.

అక్కడ క్రికెట్ అసోసియేషన్స్ తో పరిచయాలు ఏర్పడి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించారు.

ఆ తర్వాత ఉద్యోగం మానేసి హైదరాబాదక్‌కు మకాం మార్చారు.

గచ్చిబౌలిలో ఉన్న హిల్ రిడ్జెస్ విల్లాలో ఉంటున్నారు.

ప్రస్తుతం ఆయన నాలుగు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు.

ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మాట్రిక్స్ నేచురల్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఆర్ఏఎస్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, ministry of corporate affairs

గతంలో వాన్‌పిక్‌ డైరెక్టర్‌లలో ఒకరు

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ 2011లో ఒక అభియోగ పత్రం పెట్టింది.

ఇందులో మాట్రిక్స్ సంస్థ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ పేరును మూడో నిందితుడిగా చేర్చింది.

వాన్‌పిక్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థకు నిమ్మగడ్డ ప్రసాద్ డైరెక్టర్‌గా ఉన్నారు.

సతీశ్ బాబు సానాకు కూడా ఈ సంస్థతో సంబంధం ఉండేది.

2009 నుంచి 2014 వరకు వాన్‌పిక్ సంస్థ డైరెక్టర్‌లలో ఒకరిగా సతీశ్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)