సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్‌ అలోక్‌ వర్మ తొలగింపునకు.. రఫేల్‌ విచారణకు సంబంధముందా?

  • 25 అక్టోబర్ 2018
సీబీఐ, రఫేల్, అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా, నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు Image copyright Getty Images

తనను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పిస్తూ ప్రధాని కార్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. దీంతో ఈ అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన సమస్యగా మారిపోయింది.

గత కొన్నాళ్లుగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

రాకేశ్ ఆస్థానా లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో సీబీఐ స్వయంగా తన సిబ్బంది అయిన డీఎస్‌పీ దేవేంద్ర కుమార్‌ను అరెస్ట్ చేసింది.

అరెస్టును తప్పించుకోవడానికి రాకేష్ ఆస్థానా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వం అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా.. ఇద్దరినీ సెలవుపై పంపింది. ఆస్థానాపై కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి బస్సీని పోర్ట్ బ్లెయిర్‌కు బదిలీ చేసింది.

తనను తప్పించడాన్ని సవాలు చేస్తూ అలోక్ వర్మ సుప్రీంను ఆశ్రయించారు.

అయితే ప్రభుత్వం సీబీఐ చీఫ్‌ను ఇలా సెలవుపై పంపడం సబబేనా? ఒకవేళ ప్రభుత్వం ఆయనను తొలగించాలని భావిస్తే తగిన ప్రొసీజర్‌ను అనుసరించిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మ (కూర్చున్న వ్యక్తి)

వర్మ ఎందుకు మోదీకి వ్యతిరేకులయ్యారు?

అలోక్ వర్మ పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ఆ తర్వాత కూడా ఆయనలాంటి అధికారులకు అనేక కమిషన్లలో స్థానం కల్పించడానికి అవకాశాలున్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు?

అలోక్ వర్మ వివాదాలకు దూరంగా ఉంటారన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మోదీ ప్రభుత్వంతో ఆయనకు ఉన్న సంబంధాల గురించి మాట్లాడాల్సి వస్తే, దిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ వివాదాన్ని వివాదాన్ని సరిగా హ్యాండిల్ చేయలేదన్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వమే ఆయనను దిల్లీ కమిషనర్‌గా నియమించింది.

ఆ తర్వాత వర్మను సీబీఐ డైరెక్టర్‌గా నియమించారు.

ఇలాంటి పరిస్థితుల్లో వర్మకు, మోదీ ప్రభుత్వానికి ఎక్కడ బెడిసి కొట్టిందన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా

ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సమాధానమిస్తూ.. ''రఫేల్ విమానాల విషయంలో మేం అలోక్ వర్మను కలిసినప్పుడు ఆయన చాలా శ్రద్ధగా మేం చెప్పిన విషయాలను విన్నారు. ఈ కేసులో ఆయన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు విచారణ చేపట్టే అవకాశం ఉండింది'' అని తెలిపారు.

''ప్రభుత్వానికి రఫేల్ విషయంలో ఎలాంటి విచారణా జరగడం ఇష్టం లేదు. అందుకే అలోక్ వర్మను తొలగించారు. దాని వల్ల రఫేల్ విచారణా జరగదు. రాకేశ్ ఆస్థానాపై విచారణ కూడా నిలిచిపోతుంది. ప్రభుత్వం కోరుకున్నది ఇదే'' అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

రఫేల్‌పై విచారణ చేపట్టి మోదీ ప్రభుత్వంతో ఎందుకు తన సంబంధాలను చెడగొట్టుకోవాలని అలోక్ వర్మ భావించారు? ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రశాంత్ భూషణ్, ''ఒక నిజాయితీపరుడైన అధికారి ఏం చేస్తాడో, అలోక్ వర్మ కూడా అదే పని చేశారు'' అని తెలిపారు.

Image copyright Getty Images

మసకబారిన ప్రభుత్వ ప్రతిష్ట

తనను పదవి నుంచి తొలగించడానికి వ్యతిరేకంగా అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తన పిటిషన్‌లో వర్మ, సీబీఐను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) పరిధి నుంచి తొలగించాలని కోరారు. సీబీఐ స్వతంత్రంగా పని చేయడానికి డీఓపీటీ అవరోధంగా మారుతోందన్నారు. డీఓపీటీ ప్రధాని కార్యాలయం పరిధి కిందకు వస్తుంది.

సీబీఐ స్వతంత్రంగా పని చేయాలని అంటూనే, ఎవరైనా ఉన్నతస్థానంలో ఉన్నవారిని విచారించాల్సి వచ్చినపుడు మాత్రం ప్రభుత్వం ఆ పనిని చేయనీయడం లేదన్నారు.

అలోక్ వర్మ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వ విశ్వసనీతపైనే సందేహాలు రేకెత్తించేలా ఉన్నాయి.

సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు పరంజయ్ గుహ థాకుర్తా మాట్లాడుతూ.. సామాన్యులు ఇప్పటివరకు సీబీఐ విచారణను నమ్మేవారిని, ప్రస్తుత సంఘటనతో వారికి సీబీఐ మీద నమ్మకం పోయిందని అన్నారు.

''ఇప్పటికే సీబీఐ మీద విశ్వసనీయత చాలా తగ్గిపోయింది. ఈ సంఘటనతో అది మరింత దిగజారింది. మోదీ ప్రభుత్వ ప్రతిష్ట కూడా మసకబారింది'' అన్నారు.

ఈ వివాదంలో తర్వాత ఏం జరుగుతుంది?

సీబీఐ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రఫేల్ వివాదంపై విచారణకు దూరంగా ఉంచడానికే సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని ట్వీట్ చేశారు.

అయితే అరుణ్ జైట్లీ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. ఈ విషయం ప్రస్తుతం సీవీసీ పరిధిలో ఉందని, సీబీఐ ప్రతిష్టను కాపాడడానికే అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను సెలవుపై పంపడం జరిగిందన్నారు.

అలోక్ వర్మ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో తీర్పు అలోక్ వర్మకు అనుకూలంగా వస్తే, అది ప్రస్తుత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. తద్వారా పరిపాలనాపరంగా, రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

యుద్ధభూమిలో అమ్మానాన్న మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా

‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్’ - ప్రెస్ రివ్యూ

సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్‌'

ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్

బీబీసీ 100 వుమన్: ఈ జాబితాలో భారతీయులు ఎంత మంది?

అయోధ్య కేసులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు