అభిప్రాయం: సీబీఐలో అవినీతి... నిన్న, నేడు, రేపు

  • సంజయ్ కపూర్
  • బీబీసీ కోసం
సీబీఐ అవినీతి నిన్న నేడు రేపు

ఫొటో సోర్స్, Getty Images

సీబీఐ ఒక వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని 27 ఏళ్ల క్రితం విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు సమాచారం అందింది.

ఆ డైరీలో రాజకీయ నేతలు, అధికారులు ఇంకా చాలా పెద్ద వారి పేర్లున్నాయి. వాళ్లందరికీ ఒక బడా వ్యాపారవేత్త లంచాలు ఇచ్చారు.

నా చేతికి అందింది కొన్ని వివరాలే, కానీ మెల్లమెల్లగా నేను ఆ డైరీలో ఒక్కో పేజీ తిప్పిచూశాను.

ఆ పేజీల్లో ఎంత పెద్దవాళ్ల పేర్లున్నాయంటే, వాళ్లకు ప్రభుత్వ పనులను దక్కించుకోడానికి కమిషన్లు అందించేవారు.

ఈ జాబితాలో ఒక రాష్ట్రపతి నుంచి మాజీ ప్రధానులు, పెద్దపెద్ద ఉద్యోగులు, నేతలు(ప్రతిపక్ష), చాలామంది ఎంపీల పేర్లు కూడా ఉన్నాయి.

డైరీని చూస్తే, ఆ తెలివైన వ్యాపారి ఎవరినీ వదల్లేదని, చాలా తక్కువ మొత్తం ఖర్చుపెట్టి, దేశ రాజకీయ వ్యవస్థ మొత్తాన్నీ కొనేశాడని అనిపించింది.

అలా, అధికారంలో ఉన్న అందరూ ఒకే వ్యాపారి కోసం పనిచేస్తుంటే, ప్రజాస్వామ్యం సరిగా పనిచేస్తుందా? అనే ప్రశ్నకూడా వచ్చింది.

ఈ రిపోర్ట్ 'ద బ్లిడ్జ్'(ఇప్పుడు మూతపడింది) పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైంది. ఆ తర్వాత దీనిపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దాంతో దేశంలో రాజకీయ ప్రకంపనలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters

సీబీఐ బలమెంత?

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేవారంతా అప్పటి ప్రభుత్వంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కానీ అది జరగలేదు.

ఈ కేసులో ఏదైనా ఫలితం వచ్చుంటే అది డైరీలో ఉన్న ఎల్‌కె అడ్వాణీ, యశ్వంత్ సిన్హా లాంటి ఎంతోమంది నేతలను చాలా బాధించేది.

ఇదే డైరీలో కాంగ్రెస్, జనతాదళ్‌ నేతల పేర్లు కూడా చాలా ఉన్నాయి. వారిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్ కూడా ఉన్నారు.

ఈ కేసులో ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే, ఒక్క దెబ్బతో భారత రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్న అవినీతిపరులైన అందరి గుట్టూ బయటపడేది.

కానీ అలా జరగలేదు. కానీ హవాలా కుంభకోణం కాంగ్రెస్‌ను దెబ్బకొట్టింది. ఆ ప్రభావం తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దాని ఓటమికి కారణమైంది.

భవిష్యత్తులో సీబీఐని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఆపడానికి, ఆ సంస్థ డైరెక్టర్లను తగినవిధంగా ఎంచుకునేందుకు సుప్రీంకోర్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది.

అప్పటి చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ డైరెక్టర్ల నియామకాలు పదవీకాలం ప్రకారం ఉంటే, విచారణ ఏజెన్సీపై రాజకీయ ఒత్తిడి ఉండదని భావించారు.

కానీ ఆ తర్వాత జరిగినవాటిని బట్టి, ఆరోజు జస్టిస్ వర్మ ఆలోచన ఎంత తప్పు అనేది తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Pti

దిద్దుబాటు తర్వాత సీబీఐ ఏమైంది?

సీబీఐ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియలో జరిగిన మార్పులతో అత్యున్నత పదవుల్లో కూచుని లంచాలు పుచ్చుకుంటున్న వారి వివరాలు ఉన్న ఎన్నో డైరీలు సీబీఐ చేతికి దొరికాయి. కానీ ఆ తర్వాత కూడా వాటిపై సీబీఐ చెప్పుకోదగిన విచారణ చేయలేదు.

అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వారందరూ, ఈ రోజుకీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దానివల్ల సీబీఐ సుప్రీకోర్టు నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కోర్టు సీబీఐని "పంజరంలో చిలక"గా కూడా వర్ణించింది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సీబీఐని 'కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్' అనేవి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏజెన్సీ తీరులో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, cbi

దర్యాప్తు అధికారి అమ్ముడుపోవడం సాధ్యమేనా?

సీబీఐ దర్యాప్తు అధికారులు ఇప్పుడు కూడా రాజకీయ నేతలు, బడా వ్యాపార సంస్థల ముందు సేవకుల్లా ప్రవర్తిస్తున్నారు. రాజధాని దిల్లీలో పెద్ద వ్యాపార సంస్థల కోసం లాబీయింగ్ చేసే వారు తమ యజమానులపై కేసులను, సీబీఐ అధికారులను మేనేజ్ చేయడంలో రాటుదేలిపోయారు.

హవాలా కుంభకోణం జరిగిన రోజులతో పోలిస్తే ఇప్పుడు అలాంటి వారి ప్రభావం చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఆర్థికవ్యవస్థ పరిణామం పెరగడంతో ప్రైవేటు కంపెనీలకు రిస్క్ కూడా చాలా పెరిగింది. ఈ సిస్టంలో ఇప్పుడు డబ్బు భారీగా ఉంది. ఎలాంటి దర్యాప్తు అధికారైనా ఆ సంస్థలకు అమ్ముడుపోవడం చాలా సులభం.

ఫొటో సోర్స్, Getty Images

సీబీఐ కఠిన దర్యాప్తు ఎందుకు చేయదు?

సీబీఐ అధికారులు తమ మనుగడ కోసం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వ్యాపారవేత్తలపై దర్యాప్తు చేయడంలో అంత వేగం చూపించరు. అలాంటి కేసులను చల్లారిపోయేలా చేసేస్తారు. చాలామందికి అనిల్ అంబానీ గ్రూప్‌పై వచ్చిన ఒక కేసు గుర్తుండే ఉంటుంది. అందులో ఆయన కంపెనీ అధికారులు కొందరు పట్టుబడ్డారు.

అదానీ గ్రూపుపై వేసిన కేసుల్లో కూడా కొత్త విషయాలేవీ బయటికి రాలేదు. హవాలా కుంభకోణం లాంటి ఎన్నో కేసులు ఎప్పుడూ చల్లారిపోతుంటాయి. సీబీఐని స్వతంత్రంగా ఉంచాలని సుప్రీంకోర్టు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఎందుకంటే సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్‌ను కోర్టు సూచించిన ప్రక్రియ ప్రకారమే ఎంచుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా వాళ్లు అవినీతి పరులకు అండగా నిలిచినట్టు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

అంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటుంది. అవినీతిపరులకు దాడుల గురించి ఉప్పందించి, చట్టానికి దొరకనంత దూరంగా దేశం వదిలి వెళ్లిపోయేలా చేశారని సీబీఐ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.

ఇంతకు ముందు కూడా డైరెక్టర్ రంజిత్ సిన్హా పనితీరుపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఆయన బొగ్గు కుంభకోణంలో మధ్యవర్తులకు సాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. సిన్హా గుజరాత్ అల్లర్లలో ప్రమేయం ఉన్న వారికి సాయం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు సాధ్యమేనా?

రాజకీయాల్లోనే నేర ప్రవృత్తి ఉంటే, అలాంటి వారికి వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి విచారణ చేపడుతుంది అనేది మరో పెద్ద ప్రశ్న. ఇలాంటి చర్యలతో కొందరు అధికారంలోకి వస్తారు. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ అల్లర్లు లాంటి కేసులతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందింది, అధికారంలోకి రాగలిగింది.

గుజరాత్ అల్లర్లు, హిందూ సంస్థలపై నమోదైన కేసులు, ఆ తర్వాత జరిగిన హత్యలు, సోహ్రాబుద్దీన్-కౌసర్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసుల దర్యాప్తులో ఫలితాలు వచ్చేలా అప్పటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు సీబీఐకి స్వేచ్ఛ అందించి ఉండాలి.

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత ప్రభుత్వం కూడా సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఇవ్వలేకపోయింది. వారిపని వారు చేయకుండా బలహీనంచేసింది. అప్పట్లో ఏజెన్సీ విభాగంపై ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే అప్పుడు కూడా బలమైనవారు కొందరు సీబీఐపై తమ ప్రభావం చూపించేవారు.

ప్రస్తుత కేసులో సీబీఐ, ప్రభుత్వం మధ్య గొడవలకు కూడా ఒక డైరీనే కారణం. ఆ డైరీలో కూడా రాకేష్ అస్థానాకు లంచం ఆరోపణలతోపాటు అన్ని కేసులూ నమోదై ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

రాకేశ్ అస్థానా గుజరాత్ కేడర్

రాకేశ్ అస్థానా ఎవరో కాదు, 2002 అల్లర్ల విచారణ తర్వాత మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి. ఈయన్ను మోదీ ఫేవరెట్ అధికారిగా చెబుతారు. కానీ డైరెక్టర్ అలోక్ వర్మకు ఆయన నచ్చేవారు కాదు.

అస్థానాపై వచ్చిన కేసులను అలోక్ వర్మ దర్యాప్తు చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రధానమంత్రి అనుమతి కూడా అడిగారు. కానీ ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత డబ్బు సేకరించే రాకెట్ నడిపిస్తున్న వారిపై అలోక్ వర్మ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టులో ఏం జరుగుతోంది?

దిల్లీ హైకోర్టుకు వెళ్లిన ఆస్థానా న్యాయవాది ఆయనకు అరెస్ట్ నుంచి ఉపశమనం ఇవ్వాలని కోరారు. అస్థానాకు వ్యతిరేకంగా సీబీఐ నకిలీ సాక్ష్యాలు రూపొందించిందని చెప్పారు. దాంతో కోర్టు అస్థానాను సీబీఐ అరెస్టు చేయకుండా ఆపింది.

ఈ కేసులో డైరెక్టర్ అలోక్ వర్మ మరింత ముందుకెళ్లకుండా ప్రధాని మోదీ.. డైరెక్టర్ వర్మ, అస్థానా ఇద్దరినీ తొలగించారు. ఇక్కడ ముఖ్యంగా డీవోపీటీ బాధ్యతలు మోదీ దగ్గరే ఉన్న విషయం చెప్పుకోవాలి. తర్వాత సీబీఐ డైరెక్టర్ కార్యాలయం కూడా సీల్ చేశారు. ఇది ఎవరూ ఊహించని విషయం.

తర్వాత అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పదవీకాలం పూర్తికాక ముందే ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించకూడదనే ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం అమలు చేస్తుందని ఆశించారు.

భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థకు గడ్డుకాలం

సుప్రీంకోర్టు అలోక్ వర్మ పక్షంలో తీర్పు ఇస్తే అధి ప్రధానమంత్రి అధికారాలను అణచివేసినట్టు అవుతుంది.

ప్రభుత్వ నైతిక విధానాల్లో అస్థిరతను తీసుకువస్తుంది.

సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌కు అధికార పక్షం అంటే అంత నచ్చదని చెబుతారు. ముందు ముందు ఈ అంశం మరింత ఆసక్తిని కలిగించబోతోంది.

రపేల్ విమానాల కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధమైన సమయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని డైరెక్టర్ అలోక్ వర్మను తొలగించారనే వదంతులు కూడా వస్తున్నాయి.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షించనున్నారు.

కాగా, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు ఈలోపు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని, ఆయన సాధారణ (రొటీన్) కార్యకలాపాలు మాత్రమే చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాల వివరాలను సీల్డు కవరులో తమకు అందించాలని ఆదేశించింది.

ఈ కేసుపై తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.

సామాన్యుడు కోరుకునేదేంటి?

అలాంటప్పుడు దేశంలోని ఏ పౌరుడూ సీబీఐ లాంటి ఒక స్వతంత్ర సంస్థ ఉన్నత పదవుల్లో ఉన్న వారికి వ్యతిరేకంగా దర్యాప్తు చేయగలదని అనుకోలేడు.

దేశంలో బోఫోర్స్ ఒప్పందం కేసు నుంచీ లోక్‌పాల్ ఏర్పాటు కోసం ఎన్నో ఆందోళనలు జరిగాయి. కానీ వీటిలో చాలా ఆందోళనలు రాజకీయ ప్రేరితం, అధికార పార్టీకి వ్యతిరేకంగా జరిగినవి.

ఇక్కడ అవినీతి కేవలం ఒక సాకు మాత్రమే. అందరూ ఊహించనట్టే ఆ ఆందోళనల తర్వాత ఏం జరగలేదు.

విచారణ ఏజెన్సీ లేదా కోర్టులను సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే, అవి కొన్ని విజయాలు సాధించేలా చేయడం ఒక సమర్థమైన పద్ధతి. ఇటీవల బ్రెజిల్, పాకిస్తాన్, ఇజ్రాయెల్‌లో జరిగినట్లే అధికారంలో ఉన్నవారు ఎంతటివారైనా అవినీతికి పాల్పడితే, వారిని జైలుకు పంపాలి.

అలా జరిగినప్పుడు రాజ్యాంగంపై ప్రజల నమ్మకం బలపడుతుంది. రాజకీయాల్లోకి వచ్చాక తప్పుడు పనులతో డబ్బు వెనకేసుకోవచ్చని భావించే రాజకీయ నాయకుల ఆశలకు తెరపడుతుంది.

అంతేకాదు, ప్రజాస్వామ్య సంస్థల్లో ఇప్పుడు చూస్తున్నట్టు, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించి సమాజంలో అస్థిరత తీసుకురావచ్చనుకునే రాజకీయ నాయకుల ఆలోచనలకు కూడా బ్రేక్ పడుతుంది.

సామాన్యుడు కార్పొరేట్ రంగాన్ని ఎదురొడ్డి నిలిచే బలమైన శక్తిగా ప్రజాస్వామ్యాన్ని చూసేవరకూ ఇది నెరవేరుతుందనే ఆశలు మిణుకుమిణుకుమంటూనే ఉంటాయి.

(ఈ వ్యాసంలో విషయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగత అభిప్రాయం)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)