దిల్లీ యూనివర్సిటీ సిలబస్ వివాదం: కంచ ఐలయ్య పుస్తకాలను ఎందుకు తొలగించాలనుకుంటున్నారు?

  • అంజయ్య తవిటి
  • బీబీసీ ప్రతినిధి
కంచ ఐలయ్య Kancha Ilaiah

ఫొటో సోర్స్, Kranti Tekula

రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన మూడు పుస్తకాలను ఎంఏ (పొలిటికల్ సైన్స్) సిలబస్ నుంచి తొలగించాలని దిల్లీ విశ్వవిద్యాలయం స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎంఏ సిలబస్‌ను సమీక్షించిన సందర్భంగా కమిటీ ఈ సూచన చేసింది.

ఆ పుస్తకాలు "హిందుత్వాన్ని కించపరిచే" విధంగా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది. దీనిపై విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ (ఏసీ) నవంబర్ 15 లోగా సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది.

ఆ పుస్తకాల్లోని అంశాలు సమాజంలో విభజన రేఖలు గీసినట్లుగా ఉన్నాయని, వాటిని విశ్వవిద్యాలయంలో బోధించడం సరికాదని స్టాండింగ్ కమిటీ సభ్యురాలు గీతా భట్ అన్నారు.

"సరైన రీతిలో అధ్యయనం చేయకుండానే ఈ పుస్తకాల్లో కొన్ని అంశాలు రాశారు. ఈ పుస్తకాల్లోని విషయాలు సమాజాన్ని విభజించి చూపిస్తున్నాయి. అలాంటి వాటిని విశ్వవిద్యాలయంలో పాఠాలుగా చెప్పడం సరికాదు. ఈ పుస్తకాల్లో చాలావరకు ఐలయ్య సొంత అభిప్రాయాలే ఉన్నాయి. విద్యాపరంగా ఈ పుస్తకాలు బలహీనంగా ఉన్నాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.

తొలగించాలంటున్న పుస్తకాలు... "వై ఐ యాం నాట్ ఏ హిందూ", "గాడ్ యాజ్ పొలిటకల్ ఫిలాసఫర్: బుద్ధాస్ ఛాలెంజ్ టు బ్రాహ్మనిజం", "పోస్ట్-హిందు ఇండియా: ఎ డిస్కోర్స్ ఇన్ దళిత్- బహుజన్ సోషియో- స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రెవల్యూషన్"

స్టాండింగ్ కమిటీ నిర్ణయంపై కంచ ఐలయ్య బీబీసీతో మాట్లాడుతూ... "నా పుస్తకాలను ఎన్నో ఏళ్లుగా దిల్లీ విశ్వవిద్యాలయం, జేఎన్‌యూతో పాటు పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ బోధిస్తున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా తీరును నేను సవాల్ చేశాను. అందుకే ఇప్పుడు దిల్లీ విశ్వవిద్యాలయం స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది" అన్నారు.

ఫొటో సోర్స్, kancha ilaiah

ఐలయ్య ఆరోపణలను ఆ కమిటీలోని మరో సభ్యుడు హన్స్‌రాజ్ సుమన్ తోసిపుచ్చారు. "సిలబస్‌ను సమీక్షించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకానీ, మా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు" అన్నారు.

దిల్లీ విశ్వవిద్యాయం వెబ్‌సైట్ ప్రకారం, 2010-12 ఎం.ఏ సిలబస్‌లో కంచ ఐలయ్య పుస్తకాలను పొందుపరిచారు. 2019 విద్యా సంవత్సరం కోసం ఆ సిలబస్‌ను సమీక్షిస్తున్నారు.

30 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీ సమీక్ష నిర్వహించి మార్పులు చేర్పులను సూచిస్తుంది. దానిపై విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ కౌన్సిల్‌లో 20 మంది సభ్యులుంటారు.

ఫొటో సోర్స్, http://www.du.ac.in/

పుస్తకాలు మాత్రమే ఎందుకు?

సిలబస్‌ను సమీక్షించినప్పుడు కొన్ని పుస్తకాలను తొలగిస్తుంటారు, కొన్నింటిని చేర్చుతుంటారు. అయితే, ఈ సారి సమీక్షలో కేవలం ఐలయ్య పుస్తకాలను మాత్రమే తొలగించాలని విశ్వవిద్యాలయం కమిటీ ఎందుకు అనుకుంది? అన్నది ఓ ప్రశ్న.

దీనికి ప్రొఫెసర్ గీతా భట్ సమాధానం ఇస్తూ... "ఫ్రెంచ్ రచయిత క్రిష్టఫర్ రాసిన 'ది మిలీషియా ఆఫ్ హిందుత్వ' అనే పుస్తకాన్ని కూడా సిలబస్ నుంచి తొలగించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు కమిటీ సభ్యులందరూ అంగీకరించారు. ఆ పుస్తకంలో మతపరమైన తీవ్రవాదం గురించి రాశారు. కానీ, ఇతర మతాలకు సంబంధించిన అంశాలేవీ సిలబస్‌లో లేకుండా చేసినప్పుడు, హిందూ మతానికి సంబంధించిన అంశాలను కూడా తొలగించాల్సి ఉంటుందన్న వాదన వచ్చింది" అన్నారు.

ఈ పుస్తకాలను తొలగించాలని విద్యార్థుల నుంచి కూడా సూచనలు వచ్చాయని ఆమె అన్నారు.

అయితే, ఐలయ్య పుస్తకాలను సిలబస్ నుంచి తొలగించాలనడం సరికాదని దిల్లీ విశ్వవిద్యాలయంలోని 'సావిత్రి అంబేడ్కర్ పెరియార్ ఫెమినిస్ట్ సర్కిల్‌' అనే విద్యార్థి బృందం సభ్యురాలు తేజశ్విని తబహ్నే అన్నారు.

"విశ్వవిద్యాలయాల్లో ప్రతి అంశంపైనా చర్చించే అవకాశం విద్యార్థులకు కల్పించాలి. అప్పుడే విద్యార్థులు అన్ని కోణాల్లో అంశాలను అర్థం చేసుకుంటారు. ఏకపక్షంగా, ఒక రచయితకు చెందిన పుస్తకాలను తొలగించడం మంచిదికాదు. యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం ఉండాలి" అని తేజస్విని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, kancha Ilaiah

ఆ పుస్తకాల్లో 'దళిత్' పదాన్ని వాడటం పట్ల కూడా అభ్యంతరాలు ఉన్నాయని ప్రొఫెసర్ హన్స్‌రాజ్ సుమన్ అన్నారు.

"కోర్సులో ఎక్కడ దళిత్ అన్న పదం ఉన్నా నేను అభ్యంతరం చెబుతా. దానికి బదులుగా మరేదైనా పదాన్ని వాడితే పరవాలేదు. దళిత ఉద్యమం బదులుగా, అంబేడ్కర్ వాదులు, బహుజనులు అనే పదాలు వాడాలి. కంచ ఐలయ్య అంబేడ్కర్ మార్గాన్ని అనుసరించడంలేదు, తన సొంత అభిప్రాయాలను చెబుతున్నారు. అంబేడ్కర్ దేశానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఐలయ్య తన పుస్తకాల్లో హిందువులు మాంసం తినడం గురించే ఎక్కువగా రాశారు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి మాత్రం చర్చించలేదు. మీ ఆలోచనలను సమాజం మీద రుద్దాలనుకోవడం సరికాదు" అని హన్స్‌రాజ్ వ్యాఖ్యానించారు.

ఇక నుంచి 'దళిత్' అనే పదాన్ని వాడకూదని ఈ సెప్టెంబర్‌లో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖ మీడియాకు సూచించింది. దళిత్‌కు బదులుగా షెడ్యూల్డ్ కులం అనాలని తెలిపింది.

నా పుస్తకాల్లో ఉత్పత్తి జ్ఞానం ఉంది: ఐలయ్య

ఆ పుస్తకాల రచయిత, రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య బీబీసీతో మాట్లాడుతూ, తన పుస్తకాల్లో ఉత్పత్తి కులాల ఉత్పత్తి జ్ఞానం గురించి వివరించానని, అది హిందుత్వాన్ని కించపరచడం కాదని అన్నారు.

"ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని కులాల ఉత్పత్తి జ్ఞానాన్ని భావి తరాలకు నేర్పించాలనే ఆలోచన ఆ కమిటీలోని ప్రొఫెసర్లకు లేదు. అందుకే వాళ్లు నా పుస్తకాలను సిలబస్ నుంచి తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.

"శూద్రులు, రెడ్లు , గొల్ల కురమలు, గౌడలు, కుమ్మరి, జాట్లు, పటేళ్లు, మరాఠాలు, ఇలా అనేక కులాలవారు గ్రామీణ ప్రాంతాల్లో చేసే పనులను, అందులోని సైన్స్‌ను నా పుస్తకాల్లో వివరించాను.

ఆ జ్ఞానాన్ని భావితరాలకు అందించకుంటే దేశంలో అజ్ఞానం పెరిగిపోతుంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఉత్పత్తి జ్ఞానం గురించి చెబితే, హిందుత్వాన్ని కించపరచడం ఎలా అవుతుంది?

ఆ జ్ఞానాన్ని భావితరాలకు అందించకుంటే దేశంలో అజ్ఞానమే మిగులుతుంది. దాంతో చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా లొంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

నాగలితో దున్నడం, పశువులను మేపడం, కుండలు చేయడం అన్నింటిలోనూ సైన్స్ ఉంది. కృష్ణుడు కూడా పశువుల కాపరే కదా. ఆ ఉత్పత్తి జ్ఞానం గురించే నా పుస్తకాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ జ్ఞానాన్ని భావితరాలకు అందించాలన్న ఆలోచన బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లకు చెందిన ఆ కమిటీలోని ప్రొఫెసర్లకు లేదు.

వాళ్లకు ఇలాంటి పుస్తకాలు రాసే అలవాటు లేదు. వాళ్లు కేవలం సావర్కర్ లాంటి వారి ప్రసంగాలను మాత్రమే పుస్తకాలుగా రాసుకుంటారు. వేదాలు, పురాణాలు చెబితే చాలనుకుంటారు. వాళ్లకు గ్రామాల్లోని పరిస్థితులు, గ్రామీణుల ఉత్పత్తి జ్ఞానం గురించి ఏమీ తెలియదు. నేను ఊర్లలో తిరిగి శ్రమజీవుల ఉత్పత్తి జ్ఞానాన్ని నా పుస్తకాల్లో చెప్పాను.

చైనా, పాకిస్తాన్‌‌లతో యుద్ధం వస్తే సమర్థంగా తిప్పికొట్టాలంటే భారతీయులు మాంసాహారం తినాలని నేను చెబుతున్నాను. వాళ్లేమో శాకాహారమే తినాలని అంటున్నారు.

వాళ్లు ఒక సమావేశం ఏర్పాటు చేసి పిలిస్తే వెళ్లి ఈ విషయాలన్నింటిపైనా చర్చించేందుకు నేను సిద్ధం" అని ఐలయ్య అన్నారు.

ఫొటో సోర్స్, http://www.du.ac.in/

దిల్లీ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న జెస్సికా మాట్లాడుతూ.. "మనం ఏం చదువుతున్నామో అలాగే మన నిజజీవితంలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తాం. ఒక పుస్తకం ఏదైనా మతానికి అనుకూలంగా లేదా విమర్శనాత్మక అంశాలను ప్రస్తావిస్తే అది మన ఆలోచనా తీరును కొంతమేర మార్చుతుంది. అయితే, ఒక మతాన్ని కించపరచడం వల్ల ఆగ్రహావేశాలు పుట్టుకొస్తాయి" అన్నారు.

ప్రతి అంశంపైనా అనుకూల వాదనలతో పాటు విమర్శలు కూడా అవసరమని దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన మరో విద్యార్థి పునీత్ అభిప్రాయపడ్డారు.

"విషయం ఏదైనా కావచ్చు దానికి అనుకూలంగానే కాదు, విమర్శకులు కూడా ఎంతో అవసరం. అలాంటప్పుడే ఎవరైనా రెండు కోణాల్లోనూ అర్థం చేసుకుని ఒక అవగాహనకు వస్తారు. లేదంటే ఒకే అభిప్రాయం ఉండిపోతుంది. అన్ని అంశాలనూ చర్చించే వేదికలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలి" అని పునీత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)