‘సిబిఐ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు’ : అభిప్రాయం

  • అదితి ఫడ్నిస్
  • బీబీసీ కోసం
మోదీ, గోగోయ్, అలోక్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్య అధికారుల మధ్య వివాదం ఎప్పుడూ చిన్న విషయం కాదు. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆయన డిప్యుటీ రాకేష్ కుమార్ ఆస్థానా మధ్య చెలరేగిన గొడవ అలాంటిదే. ఈ గొడవ నేరుగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని వెలువరించడంతో పాటు ప్రభుత్వ వైఖరి పట్ల చెంపపెట్టులానూ నిలిచింది.

సీబీఐ విచారిస్తున్న ఓ కేసు విషయంలో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని రాకేష్ ఆస్థానా ఆరోపించారు. ఆ విషయంలో ఆస్థానాపై చర్య తీసుకున్నందుకు తనను సెలవుపై వెళ్లమని ప్రభుత్వం కోరిందని చెబుతూ, దాన్ని సవాలు చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మాంసం ఎగుమతిదారు మోయిన్ ఖురేషీతో పాటు మరెందరో సంపన్నులు, శక్తిమంతుల కేసులను సీబీఐ విచారిస్తోంది. ఇంకా నిర్ధారణ కానప్పటికీ, సీబీఐలో ఏ కేసును ఎవరు ఎటు వైపు తీసుకెళ్తున్నారో గుర్తించేలోపే డైరెక్టర్ అలోక్ వర్మను బయటకు పంపేందుకు అవసరమైన కుట్ర జరిగిందని తెలుస్తోంది.

దీని వెనుక చాలా పాత కథ దాగుంది. రాకేష్ ఆస్థానా గుజరాత్ క్యాడర్‌కు చెందిన అధికారి. అనేక వివాదాస్పద పోలీసు కేసులను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడ కరసేవకులు ప్రయాణిస్తున్న రైల్వే కోచ్‌కు నిప్పంటించిన ఘటనే భారీ అల్లర్లకు పునాది వేసింది. ఆ కేసు విచారణలోనూ రాకేష్ ఆస్థానా పాత్ర ఉంది.

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాకేష్ ఆస్థానాను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. అలోక్ వర్మ సీబీఐ డెరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనను కాదని ప్రభుత్వ పెద్దల మద్దతుతో రాకేష్ ఆస్థానా సీబీఐ సూపర్ బాస్‌లా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారని వర్మ గ్రహించారు.

ఫొటో సోర్స్, Getty Images

సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించాలి. సాక్ష్యం ఉన్న సందర్భాల్లో కోర్టుకు జవాబుదారీగా ఉండాలి. ఇది విమర్శ కానప్పటికీ... సీబీఐ విచారణలో నిరూపితమైన నేరాల రేటు కనీసం 3 శాతం కూడా లేదు. 13 ఏళ్ల ఆరుషి తల్వార్ హత్య కేసు నుంచి ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ అవినీతి ఆరోపణల కేసు వరకు... అనేక కీలకమైన కేసుల్లో సీబీఐ విచారణ దోషులను గుర్తించి శిక్షించడానికి సాయపడింది.

కానీ, వ్యాపం కుంభకోణం (మధ్య ప్రదేశ్ ప్రభుత్వోద్యోగాలకు సంబంధించిన కుంభకోణం... ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా ఇందులో వినిపిస్తోంది) లాంటి కొన్ని కేసుల్లో సీబీఐ విచారణ మందకొడిగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ, సీబీఐకు అత్యంత విశ్వసనీయ సంస్థగా గుర్తింపు ఉంది. అందుకే చాలా కేసుల్లో స్థానిక పోలీసుల మీద నమ్మకం లేని వాళ్లు సీబీఐ విచారణను కోరుకుంటారు.

ప్రస్తుతం సీబీఐ ఉన్నతాధికారులు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకున్న కేసులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అలోక్ వర్మతో పాటు ఆస్థానాను కూడా సెలవుపై పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. సాక్ష్యాన్ని ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయంతో ఇంకొందరు అధికారులనూ సెలవుపై పంపించింది.

కానీ, ఒక్క దెబ్బతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయాలను కొట్టేసింది. అక్టోబర్ 23న నియిమితులైనప్పటి నుంచి ఏమేం నిర్ణయాలు తీసుకున్నారో వివరిస్తూ, వాటిని సీల్డు కవర్‌లో కోర్టుకు అందించాలని తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావును కోరింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మ (కూర్చున్న వ్యక్తి)

అలోక్ వర్మ, ఆస్థానాలపై ఆరోపణలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదులుగా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌తో విచారణ చేయించాలని, అది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే పట్నాయిక్ ఆధ్వర్యంలో జరగాలని కోర్టు ఆదేశించింది. సీవీసీ రెండు వారాల్లోగా తన నివేదికను అందించాలి. మళ్లీ నవంబర్ 12న కేసు విచారణకు వస్తుంది. అంటే అటు వర్మకు, ఇటు ఆస్థానాకు ప్రశాంతమైన దీపావళి ఉండదన్నదమాట!

రిటైర్డ్ జడ్జికి సీవీసీ రిపోర్టు చేయాలని సూచించడం ద్వారా ఈ కేసులో పూర్తిగా ప్రభుత్వ అజమాయషీకి సుప్రీం స్వస్థి పలికింది. ఇప్పటివరకు కోర్టులో సీబీఐ గెలిచిన కేసుల విషయంలో కూడా లంచాలు, రాజకీయ ఒత్తిళ్ల ప్రమేయం ఉందా అనేదానిపై న్యాయపరమైన విచారణ కోరేందుకు ఇప్పుడు ఆస్కారం ఏర్పడింది.

ఉదాహరణకు, సీబీఐ వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి సంబంధంచిన మనీ లాండరింగ్ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులకు సంబంధించిన కేసులు కూడా సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. కానీ, అవన్నీ రాజకీయ ఒత్తిళ్లతో బనాయించిన కేసులని లాలూ ఆరోపించే అవకాశం ఇప్పుడుంది. గతంలో అయితే ఈ ఆరోపణలకు అంత విలువ ఉండేది కాదేమో. కానీ, ఇప్పుడు అసలు సంస్థలోనే లుకలుకలు బయటపడ్డ తరుణంలో ఎలాంటి ఆరోపణలనైనా ఖండించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images

రఫేల్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికే ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌ను ‘ఇరికించి’ సెలవుపై పంపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ, విషయం అంతకంటే పెద్దదిగా అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం అధికార వినియోగ అప్రయోజకత్వాన్ని సూచిస్తుంది.

కొన్ని నెలల క్రితం నలుగురు జడ్జిలు, నాటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై ‘తిరుగుబాటు’ చేసిన అనంతరం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా వెళ్లి జస్టిస్ దీపక్ మిశ్రాకు గ్రీటింగ్ కార్డు అందించే ప్రయత్నం చేశారు. పైకి అవి మామూలు శుభాకాంక్షల్లా కనిపించినా, ఆ సున్నిత సందర్భంలో ఆయనకు ధైర్యాన్నిచ్చేందుకే ప్రధాన కార్యదర్శిని పంపారని చెప్పొచ్చు. కానీ, ప్రధాన కార్యదర్శి నృపేంద్రను జస్టిస్ దీపక్ మిశ్రా తలుపు దగ్గరి నుంచే వెనక్కు పంపారు. ఆయన్ను కలవడానికి నిరాకరించారు. అలా చేస్తే తాను ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడనే అభిప్రాయం నెలకొంటుందని ఆయన భావించారు.

ప్రస్తుత తీర్పు ద్వారా ప్రభుత్వ పరిమితులను కోర్టు మరోసారి గుర్తుచేసింది. ఈ సందేహాలన్నీ సరైనవో కాదో తెలియాలంటే నవంబర్ 12 వరకు ఆగాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)