‘దేశంలో పదిలో ఐదుగురు వైద్యులు ఆదాయ పన్ను కట్టలేదు’

గ్రాఫిక్

గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య 3.79కోట్ల నుంచి 6.85కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 80శాతం పెరగిందన్నమాట. అలాగని వృత్తి నిపుణులందరూ సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారనడానికి లేదు.

సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) తాజా డైరెక్ట్ ట్యాక్స్ గణాంకాల ప్రకారం 2017-18లో ప్రతి పదిమంది వైద్యుల్లో ఐదుగురు పన్ను కట్టలేదు. అంకెల్ని బట్టి చూస్తే పన్ను చెల్లింపుదార్ల జాబితాలో 4,21,920 మంది వైద్య నిపుణులు ఉన్నారు. కానీ, దేశంలో 9లక్షలమందికి పైగానే వైద్యులు ఉన్నారు. అంటే, దాదాపు సగం మంది పన్ను చెల్లింపుదార్ల జాబితాలో లేరు.

దేశంలో ఎక్కడ చూసినా చాలా నర్సింగ్ హోంలు కనిపిస్తుంటాయి. కానీ, 13,005 నర్సింగ్ హోంల నుంచి మాత్రమే పన్నులు వసూలయ్యాయి. మరోపక్క దాదాపు 12వేల మంది ఫ్యాషన్ డిజైనర్లు పన్నులు చెల్లించారు.

పన్నులు చెల్లించిన ఛార్టర్డ్ అకౌంటెంట్‌లు, లాయర్ల సంఖ్య కూడా తక్కువగా ఉందని సీబీడీటీ నివేదిక చెబుతోంది. పన్ను చెల్లింపుదార్ల జాబితాలో 1,03,049 సీఏలు/ ఆడిటర్లు ఉన్నారు. కానీ, దేశంలో అంతకు రెండింతలు సీఏలు / ఆడిటర్లు ఉన్నారు.

లాయర్ల విషయంలో ఆ అంకెలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. 13లక్షల మంది లాయర్లలో కేవలం 2.6లక్షల మంది మాత్రమే ఆదాయ పన్నులు చెల్లించారు. అంటే, దేశంలో 75శాతం కంటే ఎక్కువమంది లాయర్లు పన్నులు చెల్లించట్లేదు.

జీతం అందుకుంటున్న వృత్తి నిపుణులు, అందుకోని వృత్తి నిపుణుల మధ్య తేడాను కూడా ఈ నివేదిక చూపిస్తోంది. మూడేళ్ల కాలంలో ఉద్యోగం చేస్తున్న నిపుణుల్లో పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య 1.7కోట్ల నుంచి 2.33 కోట్లకు చేరింది. పన్నులో వారి వాటా కూడా 19శాతం పెరిగింది.

జీతం తీసుకోని పన్ను చెల్లింపుదార్ల సంఖ్య కూడా 1.95కోట్ల నుంచి 2.33కోట్లకు పెరిగింది. కానీ, ఆ పెరుగుదలను గమనిస్తే ఉద్యోగం చేయని వారితో పోలిస్తే చేస్తున్న వృత్తి నిపుణులపైనే పన్నుల భారం ఎక్కువగా పడుతున్నట్లు కనిపిస్తుంది.

ఈ మూడేళ్లలో దేశంలో కోటీశ్వరుల సంఖ్య కూడా బాగా పెరిగింది. 2013-14లో 48,416 మంది తమ ఆదాయం కోటికి పైగా ఉందని నివేదించారు. ఇప్పుడా సంఖ్య 81,344కు చేరింది.

రాష్ట్రాలవారీగా చూస్తే 2017-18లో మహారాష్ట్ర అత్యధికంగా 3,84,277 కోట్ల రూపాయల పన్నులను వసూలు చేసింది. ఆ తరువాత 1,35,934 కోట్లతో దిల్లీ రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది.

సులువుగా చెప్పాలంటే, దేశంలో మొత్తం రూ.100 వసూలైతే... అందులో 39 రూపాయలు మహారాష్ట్ర, 13 రూపాయలు దిల్లీ చెల్లించాయి. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్ ప్రదేశ్ కేవలం రూ.2.52 చెల్లించింది.

ఉత్తర్ ప్రదేశ్‌లో 2016-17లో రూ.29,409కోట్లు వసూలైతే, 2017-18లో అది 23,515 కోట్లకు పడిపోయింది. పన్నుల వసూళ్లలో మిజోరమ్ చిట్టచివరన ఉంది. 2016-17లో వసూలైన పన్నుల సంఖ్య అక్కడ 46శాతం పడిపోయింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)