సీబీఐ కేసు: ఎవరీ జస్టిస్ పట్నాయక్?

  • సందీప్ సాహు
  • బీబీసీ కోసం
జస్టిస్ పట్నాయక్

ఫొటో సోర్స్, VIDEO GRAB

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ పట్నాయక్

సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై ఎదురైన అవినీతి ఆరోపణల గురించి విచారించేందుకు సుప్రీంకోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చింది. రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్డి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఈ విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఏకే పట్నాయక్ ఎవరన్నదీ ఆసక్తికరంగా మారింది.

గతంలో దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేసు విచారణకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన బెంచ్‌లోని ఇద్దరు జడ్జిల్లో జస్టిస్ పట్నాయక్ ఒకరు. ఎన్నికల సమయంలో ‘నోటా’ రూపంలో ప్రత్యామ్నాయం కల్పించడం, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశం లాంటి కీలక కేసుల విచారణ సమయంలో జస్టిస్ ఏకే పట్నాయక్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.

ఎమ్మెల్యీ, ఎంపీలు క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలితే వాళ్లు ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పు చెప్పిన ధర్మాసనంలోనూ జస్టిస్ పట్నాయక్ సభ్యుడు.

పదవీ విరమణ పొందిన అనంతరం ఆయన్ని ఒడిశా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉండమని కోరినా, ఆయన తిరస్కరించారు.

దిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ చేసిన పట్నాయక్, కటక్‌లో న్యాయవిద్య అభ్యసించారు.

1974లో ఒడిశా బార్ అసోసియేషన్‌లో ఆయన సభ్యుడిగా చేరారు. 20ఏళ్ల తరువాత 1994లో ఒడిశా హైకోర్టులో అదనపు సెషన్స్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.

తరువాత కొంతకాలానికే గువాహటీ హైకోర్టుకు మారారు. అక్కడ ఏడేళ్ల పాటు జడ్జిగా సేవలందించిన అనంతరం 2002లో సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లారు.

2005లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు జస్టిస్ పట్నాయక్ ప్రధాన న్యాయమూర్తిగా మారారు. అదే ఏడాది అక్టోబర్‌లో మధ్య ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ పట్నాయక్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన పనితీరును నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ చంద్ర లాహోటీ కొనియాడారు.

2009 నవంబర్‌లో పట్నాయక్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఐదేళ్ల తరువాత 2014లో ఆయన పదవీ విరమణ పొందారు.

జస్టిస్ పట్నాయక్ పదవీ కాలంలో జస్టిస్ సౌమిత్ర సేన్‌ కేసు ఎక్కువ చర్చనీయాంశమైంది.

ఫొటో సోర్స్, इमेज कॉपीरइटPTI RS TV

ఫొటో క్యాప్షన్,

జస్టిస్ సౌమిత్ర సేన్

ఏంటీ సౌమిత్ర సేన్ కేసు?

జస్టిస్ సౌమిత్ర సేన్‌ తన పదవీ కాలంలో డబ్బును దుర్వినియోగం చేశారని, వాస్తవాలను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో జస్టిస్ పట్నాయక్ ఒకరు.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మధ్య దాఖలైన కేసులో కోర్టు నియమించిన ‘రిసీవర్’గా ఉన్న సౌమిత్ర సేన్ వాళ్లు చెల్లించిన రూ.32లక్షలను తన దగ్గరే పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.

సౌమిత్ర సేన్ ‘తప్పుగా వ్యవహరించినట్లు’ జస్టిస్ పట్నాయక్ సభ్యుడిగా ఉన్న కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రాకేష్ ఆస్థానా, అలోక్ వర్మ (కూర్చున్న వ్యక్తి)

తరువాత సౌమిత్ర సేన్‌ను తప్పించాలని కోరుతూ సీపీఎం నేత సీతారాం ఏచూరీ రాజ్యసభలో చేసిన ప్రతిపాదనను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ హైకోర్టు జడ్జిపైన అలాంటి తీర్మానం ప్రవేశపెట్టారు.

రాజ్యసభ తరువాత లోక్‌సభలో ఆ తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంది. కానీ, అంతలోనే సౌమిత్ర సేన్ తన పదవికి రాజీనామా చేశారు.

అలాంటి ఎన్నో కేసుల విచారణలో భాగమైన జస్టిస్ ఏకే పట్నాయక్, సుప్రీంకోర్టుకు సేవలందించిన అత్యుత్తమ న్యాయమూర్తుల్లో ఒకరిని ఒడిశాలో ఆయనతో కలిసి పనిచేసిన సీనియర్ న్యాయవాది ఎల్ పంగారీ అంటారు. ఆయన తన పదవీ కాలంలో మైలురాళ్లుగా నిలిచిపోయే అనేక తీర్పులను వెలువరించినట్లు పంగారీ చెబుతారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)