ఆపరేషన్ గరుడ: ఏమిటీ వివాదం?

నటుడు శివాజీ

ఫొటో సోర్స్, Facebook/Sivaji

ఫొటో క్యాప్షన్,

నటుడు శివాజీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిపై గురువారం జరిగిన కత్తి దాడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగానూ అలజడి రేపింది. విపక్ష నేతపై జరిగిన ఈ దాడిని ఎవరికివారు ఇతర పార్టీల కుట్రగా ఆరోపిస్తున్నారు.

దాడిపై గురువారమే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పరిణామాలన్నీ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయని, కొద్దినెలల కిందట నటుడు శివాజీ ఇలా జరగొచ్చని చెప్పారని.. ఆయన అన్నట్లుగానే జరిగిందని చంద్రబాబు అన్నారు.

కాగా నటుడు శివాజీ మార్చిలో ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. 'ఆపరేషన్ గరుడ' పేరుతో ఒక జాతీయ పార్టీ ఏపీలోని కొన్ని పార్టీలతో కుమ్మక్కై కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచి అధికారంలోకి వచ్చేలా పన్నాగం పన్నిందని చెబుతూ అందులో భాగంగా ఏమేం జరగబోతున్నాయన్నది తాను భావిస్తున్నారో ఆ వివరాలను ఆ వీడియోలో వివరించారు.

ఆపరేషన్ గరుడను వివరిస్తున్న శివాజీ

ఫొటో సోర్స్, Youtube

ఇంతకీ ఈ ఆపరేషన్ గరుడ ఏమిటి?

ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణ భారతాన్ని జయించడానికి జాతీయ పార్టీ కుట్ర చేస్తోందంటూ సినీ నటుడు శివాజీ ఏడు నెలల కిందట ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో శివాజీ చెప్పిన విషయాలు..

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలను హస్తగతం చేసుకునే వ్యూహానికి ఆపరేషన్ గరుడ అని.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల కోసం ఆపరేషన్ రావణ, కర్నాటకను హస్తగతం చేసుకునేందుకు ఆపరేషన్ కుమార పేర్లతో బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ వీడియోలో శివాజీ ఆరోపించారు.

జాతీయ పార్టీ చేస్తున్న ఈ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని దిల్లీలోని తన మిత్రుల ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. తన దృష్టికి వచ్చిన విషయాన్ని రాష్ట్రప్రయోజనాల కోసమే బహిరంగపరుస్తున్నానని అన్నారు.

ఈ ఆపరేషన్ గరుడలో ప్రధానమైన వ్యక్తిని 'గురు' అని పిలుచుకుంటారని, ఆయన ఆదేశాలను రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని కొందరు వ్యక్తులు అమలు చేస్తారని శివాజీ అన్నారు.

ఆపరేషన్ గరుడలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీని ఇబ్బందులకు గురిచేయడం జాతీయ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. దశలవారీగా తమ పథకాన్ని అమలు చేస్తారని.. అప్పటికే అది మొదలైందని చెప్పారు.

మొదటి అంశం:

''అధికార పార్టీకి చెందినవారిపై ఉన్న సీబీఐ కేసులను తిరగతోడడం, పార్టీకి సంబంధించినవారి వ్యాపార సంస్థలను, వ్యక్తులను ఆర్థికంగా దెబ్బతీయటం, పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడం జాతీయ పార్టీ వ్యూహం.

రెండో అంశం:

రాష్ట్రంలో కొత్తగా పార్టీ స్థాపించిన ఓ కొత్త నాయకుడు కూడా జాతీయ పార్టీ పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఈ కొత్త నాయకుడికి నిర్దేశించిన లక్ష్యం.

అందులో భాగంగానే సదరు కొత్త నాయకుడు రాష్ట్ర పరిస్థితులపై ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తారని, అందులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ఒక సీనియర్ పాత్రికేయుడు ఉంటారు. వీరే దిల్లీలో కూర్చుని, అధికార పార్టీవారిపై ఉన్న సీబీఐ కేసులను రీఓపెన్ చేసే పనిలో ఉన్నారు.

కత్తి దాడిలో గాయపడిన జగన్

ఫొటో సోర్స్, Chandrakant

మూడో అంశం:

రాష్ట్రంలోని మరో ముఖ్యమైన రాజకీయ పార్టీ కూడా జాతీయ పార్టీ పన్నిన ఉచ్చులో చిక్కుకుంది. అందులో భాగంగానే పార్టీ నేతపై ప్రాణ హాని జరగకుండా ఒక దాడి చేయడానికి గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారు. ఆ దాడి వల్ల రాష్ట్రంలో అలజడి జరుగుతుంది. ఆ గొడవల వల్ల సదరు వ్యక్తికి కొన్ని విషయాల్లో ఊరట లభిస్తుంది. ఇదంతా దిల్లీలోని జాతీయ పార్టీ చేయిస్తుంది. కానీ ఆ దాడి నెపాన్ని రాయలసీమలోని ఒక ముఖ్యమైన కుటుంబంపైన నెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ నిందను ప్రజలు నమ్మకపోతే, రెండో ప్రణాళికను అమలు చేస్తారు. అదే.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం.

బిహార్, ఒడిశా నుంచి వచ్చిన స్లీపర్ సెల్స్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తాయి. ఈ గొడవల వల్ల అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న పార్టీకి ఈ గొడవల వల్ల మానసికంగా కూడా ఎదురుదెబ్బ తగులుతుంది.

అనంతరం జరిగే ఎన్నికల తర్వాత ప్రధాన పార్టీ నేత తనపై ఉన్న కేసుల్లో జైలుకు వెళ్తారు. కొత్త నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కేంద్ర మంత్రి పదవి ఇస్తామని జాతీయ పార్టీ చెబుతుంది. కానీ అందుకు ఆయన ఒప్పుకోకుండా అలిగి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని మరో తెలుగువాడికి అప్పజెబుతారు'' అని, ఈ ఏడాది మార్చి నెలలో శివాజీ విడుదల చేసిన వీడియోలో వివరించారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/andhrapradeshCM

చంద్రబాబుదీ అదే మాటా?

''ఆపరేషన్ గరుడను నేను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడి చేసి, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తారని కొన్ని నెలల క్రితమే శివాజీ చెప్పారు. అల్లర్లు జరపడానికి అవసరమైతే బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తెప్పిస్తారని కూడా శివాజీ చెప్పారు'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

శివాజీ చెబుతున్న ఆపరేషన్ గరుడపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబరులోనూ ఒకసారి మాట్లాడారు.

''శివాజీ ఆపరేషన్ గరుడ అంటున్నారు.. వాళ్లకు అధికారం ఉంది. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖల ద్వారా తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై దాడులు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడులలో అలాగే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ అలాగే చేస్తారు'' అని సెప్టెంబరులో అన్నారు.

జగన్‌పై దాడి జరిగాక ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, మొత్తం ఐటీ శాఖను రాష్ట్రానికి పంపారని, తెలుగు దేశం పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మరోవైపు.. ఆపరేషన్ గరుడ గురించి ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ గరుడ నిజమైతే అది బయటపెట్టిన శివాజీని మొదట ఎందుకు విచారించకూడదు? అని ప్రశ్నిస్తున్నారు.

బీబీసీ తెలుగు ఫేస్‌బుక్ పేజ్‌లోని 'మాటకు మాట' శీర్షికలో చాలా మంది యూజర్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రఘురాం

ఫొటో సోర్స్, facebook/RaghuramPurighalla

రాష్ట్ర ప్రభుత్వం తీరే అనుమానాస్పదంగా ఉంది: బీజేపీ నేత రఘురాం పురిఘళ్ల

జగన్‌పై దాడి అనంతరం ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలు 'ఆపరేషన్ గరుడ' పేరుతో చేస్తున్న ఆరోపణలపై 'దిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త' రఘురాం పురిఘళ్ల స్పందించారు. 'బీబీసీ'తో మాట్లాడిన ఆయన.. శివాజీపై ఎంక్వైరీ వేయాలని అన్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ దీనిపై ఫిర్యాదు చేసిందని చెప్పారు.

''ఇదంతా శివాజీకి ఎవరు చెప్పారు? అసలు ఆయనే కుట్ర చేస్తున్నారా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఆయన ద్వారా ఎవరో చేస్తున్నట్లు చెప్పిస్తోందా.. దీనిపై ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కేంద్రం స్థాయిలో ఎంక్వయిరీ చేయిస్తాం.

జగన్‌పై దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. కానీ, దాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోవడమే. తెలుగుదేశం ఎమ్మెల్యేలకే భద్రత లేదు.

ఒక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమారిస్తే ఇంతవరకు అరెస్టులు లేవు.

ఏపీలో ప్రభుత్వం, పాలన రెండూ లేవు. శాంతిభద్రతలే కాదు, అన్ని రంగాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఆరోగ్యానికి ప్రత్యేకంగా మంత్రి లేరు, అదీ ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలతో గిరిజనులు చనిపోతున్నారు. మరోవైపు అవినీతి పెరిగిపోయింది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు దిల్లీ వెళ్లి గవర్నరు మీద, మోదీ మీద బురద చల్లడం పనిగా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే.

విపక్ష నేత, ఒక పార్టీకి అధ్యక్షుడిపై కత్తితో దాడి చేస్తే ప్రభుత్వం ఇలాగే స్పందిస్తుందా? దాడికి పాల్పడిన వ్యక్తి జగన్ అభిమానేనని డీజీపీ అర్ధగంటలోనే ప్రకటించారు. దర్యాప్తు లేకుండానే ఆయన ఎలా నిర్ధారణకు వచ్చారు? ఇదంతా చూస్తుంటే డీజీపీకి కూడా ఈ కుట్ర అంతా తెలిసే గమ్మున ఉన్నారన్న అనుమానం కలుగుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి కదలికా అనుమానాస్పదంగానే ఉంది.

దాడికి పాల్పడిన యువకుడు పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని టీడీపీ మద్దతుదారు అంటున్నారు. ఆ కోణంలో ఎందుకు విచారణ చేయరు? ఇంతవరకు ఆయన్ను విచారించిన దాఖలా లేదు. అంతేకాదు.. దాడి చేసిన యువకుడిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నప్పుడు ఆయన వద్ద వారికి కత్తి తప్ప ఇంకేమీ దొరకలేదు. మరి రాష్ట్ర పోలీసులకు ఆయన వద్ద పది పేజీల లేఖ ఎలా దొరికింది? ఇదంతా అనుమానాలకు తావిస్తోంది. విమానశ్రయం కేంద్రం పరిధిలోనిదంటున్నారు.. విపక్ష నేత భద్రత రాష్ట్రం పరిధిలోని అంశం కాదా? ఇలాంటివి ఎన్నో అనుమానాలున్నాయి.

ఏం జరిగిందో దర్యాప్తు చేయకుండా ఇదంతా డ్రామా, ఆపరేషన్ గరుడ అంటూ ఏవేవో చెబితే ప్రజలు నమ్మరు'' అని రఘురాం పురిఘళ్ల అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)