'తెలంగాణలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు?' :ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, vijedra/facebook
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్
తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా పరిగణించిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఫోన్ ట్యాపింగ్‌తోపాటు ఇతర అంశాలపై వివరణ కోరుతూ సంబంధిత వ్యవస్థలకు శుక్రవారం లేఖలు రాసింది. 'ఫోన్ ట్యాపింగ్‌కు విధివిధానాలు ఏమిటి? ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు'' అంటూ డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసింది.
ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మహా కూటమి నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, దిలీప్‌కుమార్ తదితరులు గురువారం సీఈవో రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్, సీఎం-మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో పార్టీ సభలు, రైళ్లలో సీఎం ఫొటోలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూటమి నేతలు ఈసీకి సమర్పించినట్లు తెలిసింది.
సీఎం, మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను అందజేశారు. రైళ్లలో సీఎం చిత్రాలకు సంబంధించిన ఫొటోలు కూడా సమర్పించారు.
ఫోన్ ట్యాపింగ్‌పై తమ అనుమానాలనే ఈసీ వద్ద వ్యక్తం చేశారు. దాంతో, ట్యాపింగ్‌పై స్పష్టత కోసం డీజీపీ వివరణను ఈసీ కోరిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఫొటో సోర్స్, Ram Mohan Naidu Kinjarapu
తుపాను తరువాత ఉద్దానం ప్రాంతంలోని ఒక గ్రామంలో పరిస్థితి
వల చెదిరింది
ఆంధ్రప్రదేశ్‌లో తిత్లీ తుపాను ప్రభావంతో తీరంలో ఉన్న బోట్లు కొన్ని గాలికి ఎగిరి దూరం వెళ్లిపోయాయి.. మరికొన్ని విరిగిపోయాయి.. ఇంకొన్ని సముద్రంలో గల్లంతయ్యాయి. వలలు ఇసుకలో కూరుకుపోయాయి. కొన్ని వలలు బోటుతో పాటే కొట్టుకుపోయాయని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
పెట్టుబడి సమకూరి బోట్లు సిద్ధం చేసి మళ్లీ వేటకు వెళ్లాలంటే కనీసం మరో 60 రోజులు పడుతుందని ఈ లోపు తాము బతికేదెలా అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏటా అక్టోబరు నుంచి జనవరి వరకూ వేటకు వెళ్లేవారికి సముద్రంలో అపారమైన మత్స్యసంపద లభిస్తుంది. మత్స్యకారుల వార్షికాదాయాన్ని చూస్తే ఈ నాలుగు నెలల్లో ఆర్జించేదే ఎక్కువ.
వేట నిషేధ సమయంలోనూ, తక్కువ మత్స్యసంపద లభించే రోజుల్లోనూ వారు ఈ నాలుగు నెలల్లో సంపాదించే మొత్తాన్నే కుటుంబ జీవనానికి సర్దుబాటు చేసుకుంటారు. అయితే సరిగ్గా ఆదాయం వచ్చే సీజన్లోనే తుపాను బీభత్సం సృష్టించడం... వేటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోవడంతో ఎంతో ఆందోళన చెందుతున్నారు.
పూర్తిగా దెబ్బతిన్న, గల్లంతైన చిన్న బోట్లకు ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ప్రకటించింది. ఒక్కోటి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల విలువ చేసే చిన్న బోట్లకు ఈ పరిహారం ఏ మూలకు సరిపోదని భట్టిగొల్లూరుకు చెందిన సూరాడ శ్యాంసుందర్‌రావు వాపోయారు.
మరమ్మతులకు కనీసం రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని మిగతా మొత్తం ఎలా భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా దెబ్బతిన్న పెద్ద బోట్లకు ప్రభుత్వం రూ.6 లక్షలు పరిహారం ప్రకటించిందని రూ.15 లక్షలు విలువ చేసే ఈ బోట్ల మరమ్మతులు చేయాలన్న, కొత్తవి సమకూర్చుకోవాలన్నా అంతకు రెట్టింపు సొమ్ము అవసరమవుతుందని వివరించారు.
దెబ్బతిన్న వాటన్నింటిని తక్షణమే మరమ్మతులు చేయించేలా ప్రభుత్వమే చొరవ చూపించాలని మత్య్సకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల వేళ రూ.లక్ష దాటితే చిక్కే
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఏ స్థాయిలో నిఘా ఏర్పాటు చేసినా నగదు రవాణా జరిగిపోతూనే ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసిందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
రూ. లక్షకు మించి లెక్కలు లేని నగదు తరలిస్తుంటే కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డబ్బు పట్టుబడుతోంది. తమ అవసరాల కోసం నగదు తీసుకువెళ్తున్న సామాన్యులు ఇలాంటి చిక్కుల్లో పడకుండా ఉండాలంటే కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఎన్నికల సీజన్ ముగిసే వరకు సామాన్యులు వీలైనంత వరకు పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్లకపోవడమే ఉత్తమం.
తనిఖీలు, సోదాల నేపథ్యంలో పోలీసులకు రూ. లక్ష లేదా దానిలోపు నగదు లభిస్తే ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అంతకుమించి కనిపిస్తే ఆ మొత్తానికి లెక్కలు అడుగుతారు. అవి చూపించలేని సందర్భంలో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖకు (ఐటీ) అప్పగిస్తారు.
అనుమానాస్పద స్థితిలో ఎవరి వద్దనైనా రూ. లక్ష లభించినా స్వాధీనం చేసుకుని ఐటీ అధికారుల వద్దకు పంపిస్తారు.
అధికారులు తమ విచారణలో సంతృప్తి చెందితే లభించిన మొత్తంపై పన్ను, జరిమానా కట్టించుకున్నాకే మిగిలినవి తిరిగి ఇస్తారు.
తప్పనిసరి పరిస్థితుల్లో నగదు తీసుకువెళ్లాల్సి వస్తే బ్యాంకు స్టేట్మెంట్, డ్రా చేయడానికి ఉపకరించిన పత్రాలను ఉంచుకోవాలని సాక్షి వెల్లడించింది.
ఫొటో సోర్స్, YSR Congress Party
వాంగ్మూలం ఇవ్వని జగన్
వైజాగ్ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు వైఎస్ జగన్ నిరాకరించారని ఈనాడు తెలిపింది.
ఆయన నుంచి వివరాలు తెలుసుకునేందుకు వైజాగ్ నుంచి ప్రత్యేక పోలీస్ బృందం శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకుంది. బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్‌ను కలుసుకుంది. దాడికి పాల్పడిన శ్రీనివాసరావును అరెస్ట్ చేశామని, ఘటనకు సంబంధించిన వివరాలను వాంగ్మూలం రూపంలో ఇవ్వాలని పోలీస్ అధికారులు కోరగా... ప్రస్తుతం తాను వాంగ్మూలం ఇవ్వబోనని చెప్పినట్టు తెలిసింది.
ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులకైతే ఇస్తానని జగన్ తమతో అన్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. దీంతో వైజాగ్ నుంచి వచ్చిన పోలీస్ అధికారులు వెళ్లిపోయారు.
ఈ వాంగ్మూలం వ్యవహారం వివాదస్పదంగా మారింది. ''తమ నేత జగన్ ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు.. ఇదే సమయంలో తెలంగాణ పోలీసులకైతేనే తాను వాంగ్మూలం ఇస్తానంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమవుతున్నది వాస్తవం కాదు... జగన్ అలా అనలేదు..'' అని మాజీ మంత్రి పార్థసారథి తెలిపారు.
జగన్ వాంగ్మూలం కోసం డీఎస్పీ నాగేశ్వరరావును హైదరాబాద్‌కు పంపామని, ఆయన వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారని ఈనాడు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)