ధోనీ లేకుండా భారత్ టీ-20 టీమ్

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని గత 12 ఏళ్లలో మొదటిసారి టీ-20 జట్టు నుంచి దూరం పెట్టారు.
శుక్రవారం రాత్రి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ వెస్టిండీస్, తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే టీ-20 మ్యాచులకు భారత జట్టును ప్రకటించింది.
2007లో టీమిండియాను టీ-20 క్రికెట్ విశ్వవిజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ చాలా కాలం నుంచి ఫాంలో లేడు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడు.
టీ-20తోపాటు వెస్టిండీస్‌తో ఆడబోయే మిగతా మూడు వన్డేలకు, తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది.
వెస్టిండీస్‌తో జరిగే టీ-20 సిరీస్ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించారు. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇటీవలే ఆసియా కప్ గెలుచుకుంది.
ఫొటో సోర్స్, Getty Images
2006లో నుంచి జట్టులో ధోనీ
37 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ 2006 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో టీ-20ల్లోకి వచ్చాడు. అప్పటి నుంచి భారత్ మొత్తం 104 టీ-20 మ్యాచులు ఆడింది. వాటిలో 93 మ్యాచుల్లో ధోనీ టీమ్‌లో భాగమయ్యాడు.
ధోనీ 93 టీ-20 మ్యాచుల్లో 127 స్ట్రైక్ రేటుతో 1487 పరుగులు చేశాడు. దానితోపాటు అతడు 54 క్యాచ్‌లు, 33 స్టంపింగ్స్ కూడా చేశాడు. ఫిట్‌గా ఉన్నా ధోనీని టీమ్‌లో ఎంపిక చేయకపోవడం ఇదే మొదటిసారి.
అయితే "ఈ జట్టును చూసి ధోనీ టీ-20 కెరీర్ ముగిసిందనే అంచనాకు రాకూడదని" చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పారు. "స్టంప్స్ వెనక ధోనీకి ప్రత్యామ్నాయం వెతికే ప్రయత్నంలో ఉన్నామని, ఇది అందులో భాగమేనని" అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
టీ-20లో ధోనీ ప్రదర్శన
ఇక టీ-20లో ధోనీ ప్రదర్శన విషయానికి వస్తే, అతడి అత్యధిక స్కోరు 56 పరుగులు. ఈ ఫార్మాట్లో మహి రెండు అర్థ సెంచరీలు చేశాడు. ఇందులో ఒకటి తను ఇదే ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాపై చేశాడు.
అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌ను వదిలేస్తే, ధోనీ కొంత కాలం నుంచీ బ్యాటింగ్‌తో తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఫినిషింగ్ టచ్ అంటే ప్రపంచంలో అందరికీ ధోనీ గుర్తొస్తాడు. కానీ కొంతకాలం నుంచి అది కూడా మాయమైంది.
ధోనీ తన చివరి ఐదు టీ-20 మ్యాచుల్లో 32, 11, 12, 52, 16 పరుగులు చేశాడు.
చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతడు 20, 36, 08, 33, 0 పరుగులు మాత్రమే చేశాడు.
భారత జట్టుతోపాటు ధోనీ టీ-20 లీగ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కె) కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్‌కు, ఏడు సార్లు ఫైనల్‌కు చేరిన ఒకే ఒక జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే.
రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చిన సీఎస్కె ధోనీ కెప్టెన్సీలో మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.
ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో స్పందన
టీ-20 జట్టుకు ఎంపిక చేయలేదనే వార్తలతో సోషల్ మీడియాలో ధోనీ ట్రెండ్ అవుతున్నాడు.
కొంతమంది ధోనీని జట్టు నుంచి తీసేయడంపై విమర్శిస్తే, మరికొందరు ఇది సరైన సమయంలో సరైన నిర్ణయంగా చెప్పారు. దీనితోపాటు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడో, లేదో అనేదానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.
"ఇది ఒకవేళ ఎంఎస్ ధోనీ టీ-20 ప్రయాణం ముగింపే కనుక అయితే... మనం కాసేపు ఆగి, 2007 టీ-20 ప్రపంచకప్ విజయాన్ని భారత క్రికెట్ చరిత్రలో చెరిగిపోని అధ్యాయంగా నిలిపిన ఆ గొప్ప ఆటగాడిని ప్రశంసించాలి" అని క్రికెట్ విశ్లేషకులు హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.
మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా "ధోనీ ఇక ఎప్పటికీ టీ-20 మ్యాచుల్లో కనిపించకపోవచ్చేమో" అన్నారు.
శ్రీధర్ మాహీ "ధోనీ డీఆర్ఎస్ మిమ్మల్ని మిస్ అవుతుంది" అని ట్వీట్ చేశారు. మరికొంతమంది సోషల్ మీడియా యూజర్లు కూడా "ఒక కెప్టెన్ ఎల్బీడబ్ల్యు కోసం ఎప్పుడు డీఆర్ఎస్ తీసుకోవాలనుకున్నా ధోనీని గుర్తు చేసుకుంటారు" అని పోస్టులు పెట్టారు.
"ధోనీ జట్టులో లేనందుకు అందరికీ ఇంత బాధెందుకు. అతడు గొప్ప ఆటగాడే, కానీ తన సమయం ముగిసింది" అని రుషికేశ్ కశ్యప్ అనే యూజర్ అన్నాడు.
వీటన్నిటితోపాటు "ధోనీకి 80 ఏళ్లు వచ్చినా, అప్పుడు కూడా వాళ్లు అతడికి జట్టులో చోటిస్తారు" అన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ మాట కూడా చాలా మందికి గుర్తొస్తోంది.
ఇవికూడా చదవండి:
- ఆపరేషన్ గరుడ: ఏమిటీ వివాదం?
- శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సె
- అభిప్రాయం: సీబీఐలో అవినీతి నిన్న, నేడు, రేపు
- దీపావళి: హరిత టపాసులు అంటే ఏంటి?
- సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టేనా?
- అసద్ పైచేయికి రసాయన ఆయుధాలే కారణమా?
- ట్రంప్ ఫోన్ ట్యాప్ అవుతోందా? ‘మీరు ఐఫోన్‌ను వదిలేసి హువాయి వాడండి’ : చైనా
- అమెరికా పార్శిల్ బాంబుల కేసులో ఒకరి అరెస్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)