భీమా కోరెగావ్ కేసు: మళ్ళీ కస్టడీలోకి మానవ హక్కుల ఉద్యమకారులు

  • మయూరేష్ కొన్నూర్
  • బీబీసీ ప్రతినిధి
తిరిగి కస్టడీలోకి ఉద్యమకారులు
ఫొటో క్యాప్షన్,

వర్నెన్ గొంజాల్వెజ్‌ను(మధ్యలో వ్యక్తి) పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు

పుణె పోలీసులు భీమా కోరెగావ్ హింస కేసులో వర్నెన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాను శుక్రవారం ముంబైలో మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. అంతకు ముందు పుణెలోని ఒక కోర్టు వారి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.

కోర్టు ఈ కేసులో అరెస్టైన సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించిందని గొంజాల్వెజ్ న్యాయవాది రాహుల్ దేశ్‌ముఖ్ బీబీసీకి తెలిపారు.

వార్త ప్రచురించేవరకు సుధా భరద్వాజ్ దిల్లీ సమీపంలోని తన ఇంట్లోనే ఉన్నారు. ఈ ఆదేశాల గురించి తమకు స్పష్టంగా తెలీదని సుధా భరద్వాజ్ కుమార్తె బీబీసీకి చెప్పారు.

పేరు రాయకూడదనే షరతుతో ఒక లాయర్ "సుధా భరద్వాజ్‌ను పుణె తీసుకురావడానికి పోలీసులు కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందాల్సి ఉంటుంది. వారు శనివారం దాని కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. పోలీసులు చీకటి పడిన తర్వాత మహిళలను అరెస్ట్ చేయకూడదు" అని చెప్పారు.

కానీ అర్థరాత్రి తర్వాత పోలీసులు సుధా భరద్వాజ్ ఇంటి దగ్గరకు కూడా చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.

భీమా కోరెగావ్‌లో జనవరి 1న జరిగిన హింస కేసులో పోలీసులు ఆగస్టులో ఫెరీరా, గొంజాల్వెజ్, భరద్వాజ్‌తోపాటు తెలుగు కవి వరవరరావు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాను కూడా అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ముగిసిన గృహనిర్బంధం గడువు

నిందితులు అగ్ర మావోయిస్టు నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తమకు ఈమెయిల్స్ లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. తర్వాత దిల్లీ హైకోర్టు ఆదేశాలతో పోలీసులు గౌతమ్ నవ్‌లఖాను తమ కస్టడీ నుంచి విడుదల చేయాల్సి వచ్చింది.

56 ఏళ్ల సుధా భరద్వాజ్ గత 30 ఏళ్లకు పైగా ఆదివాసుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నారు.

78 ఏళ్ల వరవరరావు విరసం నేత, గౌతమ్ నవ్‌లఖా ప్రముఖ యాక్టివిస్ట్. ఆయన పౌరహక్కులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల అంశాలపై పనిచేస్తున్నారు. అరుణ్ ఫెరీరా, వర్నెన్ గొంజాల్వెజ్ ఇద్దరూ న్యాయవాదులు

ఐదుగురు కార్యకర్తల అరెస్టును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కోర్టు ఈ ఐదుగురిని అక్టోబర్ 25 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

గౌతమ్ నవ్‌లఖా తనపై నడుస్తున్నకేసులపై బాంబే హైకోర్టులో అపీల్ చేశారు. ఈ కేసులు నవంబర్ 1న విచారణకు రానున్నాయి. ఇటు వరవరరావు కేసులో ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆయనను మరో మూడు వారాలు గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC

పోలీసులు తొందరపడుతున్నారా?

వీరందరూ వామపక్షవాదులు, మావోయిస్టు సానుభూతిపరులుగా భావిస్తున్నారు. వీరు ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని చాలా అంశాల్లో వ్యతిరేకిస్తున్నారు. వీరిలో ఫెరీరా, వరవరరావులను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అంతకు ముందు కూడా అరెస్టు చేశారు.

మావోయిస్టులు కూడా కష్టాల్లో ఉన్న ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు.

ఐదుగురి గృహనిర్బంధం గడువు శుక్రవారంతో ముగిసింది. ఫెరీరా, గొంజాల్వెజ్, భరద్వాజ్ తమ గృహనిర్బంధం సమయం పొడిగించాలని అనుకుంటున్నారు.

"అరెస్టు నుంచి కాపాడుకోడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రత్యామ్నాయం చాలా దారుణమైన జోక్" అని పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్(పీయూడీఆర్) సభ్యుడు హరీష్ ధవన్ బీబీసీతో అన్నారు.

"ఒక వైపు పోలీసులు అరెస్టు కోసం తొందరపడుతున్నారు. 90 రోజుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయలేకపోవడంతో సమయం పొడిగిస్తూనే ఉన్నారు" అని ధవన్ అన్నారు.

పుణె కోర్టు తరఫున ఇచ్చిన 90 రోజుల కాల పరిమితిని ఉద్దేశిస్తూ ధవన్ మాట్లాడారు. ఎల్గార్ పరిషద్ కేసులో ఈ ఐదుగురు యాక్టివిస్టులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో జూన్ 6న అరెస్టు చేశారు.

ఈ ఐదుగురితోపాటు రిపబ్లికన్ పాంథర్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన సుధీర్ ధావ్లే, ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, యాక్టివిస్ట్ రోనా విల్సన్, మహేష్ రావుత్, నాగపూర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సోమా సేన్‌లను కూడా అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్,

సీనియర్ జర్నలిస్ట్, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లఖా

వీరిని ఎందుకు అరెస్టు చేశారు?

2017 డిసెంబర్ 31న పుణె సిటీలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. దళితులపై అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.

1818లో దళితులు బ్రిటిష్ సెటిల్మెంట్లలో కలిసి వారికి అగ్రవర్ణాల హిందూ పాలకులపై విజయం అందించారు. ఈ ర్యాలీని మితవాదకూటమి వ్యతిరేకించింది. తర్వాత రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. వీటిలో ఒకరు మరణించారు.

పోలీసులు ర్యాలీ నిర్వహకులపై దర్యాప్తు చేశారు. ర్యాలీలో రెచ్చగొట్టేలా ప్రసంగించడం వల్లే హింస చెలరేగిందని చెప్పారు. ఇదే కేసులో సురేంద్ర గోడ్లింగ్, సోమా సేన్, రోనా విల్సన్, మహేష్ రావుత్, సుధీర్ ధావ్లే అనే మరో ఐదుగురు యాక్టివిస్టులను అరెస్టు చేశారు.

అయితే ఈ అరెస్టుల గురించి మీడియాలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తలేదు. వీరికి సంబంధించిన అనుమానాస్పద లేఖలు, పత్రాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. అయితే అవతలి పక్షం మాత్రం పోలీసుల ఆరోపణలను కొట్టిపారేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)