నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- డా.రొంపిచెర్ల భార్గవి
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
హాచ్..! అని పెద్దగా తుమ్మి భయంభయంగా భర్తవంక చూసింది కమల. ఆమె భయానికి తగ్గట్టే అతను ఆమె వైపు చిరాకుగా చూస్తూ "ఇప్పటికిది అరవయ్యో సారి నువు తుమ్మడం. శుభమా అంటూ ఏ పనైనా మొదలు పెడదామంటే తుసుక్కున తుమ్ముతావుగదా.. అన్నాడు కంప్యూటర్ ముందు నుండి లేస్తూ.
"నేనేం చేయనండీ, తుమ్మడం నాకేమన్నా సరదానా? పండగ దగ్గరకొస్తోందిగదా అని బూజు దులిపీ ఇంటిని శుభ్రం చేశాను. డస్ట్ అలర్జీ కదా అందుకే అప్పటినుండీ వరసగా ఒకటే తుమ్ములు’’ అంది ఎర్రటి కళ్లతో, ఎర్రబడ్డ ముక్కుతో.
‘‘ఏమో మీ ఆడవాళ్లందరూ ఎప్పుడూ ఏదో ఒక అలర్జీ అంటూ ఉంటారు"అన్నాడు కమల భర్త.
ఇంతలో పక్కింటావిడ హడావుడిగా పరుగెత్తుకొచ్చింది. వాళ్లమ్మ ఏదో ఒంటి నొప్పుల మాత్ర వేసుకుంటే ఒళ్లంతా దద్దుర్లు, ఆయాసం వచ్చాయట. ఇద్దరూ కలిసి ఆవిడను మోసుకుని దగ్గరే వున్న హాస్పిటల్‌కి తీసుకు వెళ్లారు.
అప్పుడే భోజనానికి వెళ్లబోతున్న డాక్టర్.. పరిస్థితి తీవ్రత గమనించి వెంటనే స్పందించింది. బీపీ, రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా వున్నాయని చెప్పి, ఇదంతా ఆమె వేసుకున్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్‌కి వచ్చిన అలర్జిక్ రియాక్షన్ అని చెప్పి, వెంటనే చేయవలసిన ఇంజక్షన్లు చేసి, ఆక్సిజన్ పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంది.
వీరికి కేటాయించిన గదిలోకి మారుతుండగా "డాక్టర్ గారూ సీరియస్ కేస్" అని నర్స్ పరుగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ని తీసికెళ్లింది. స్పృహలో లేని ఒక నడివయసు మహిళను చేతులమీద మోసుకొచ్చారు.
"ఏం జరిగిందని అనడిగితే బాత్ రూం క్లీన్ చేస్తూ కళ్లు తిరిగి పడిపోయిందన్నారు. బాత్ రూం కడగడానికి యాసిడూ, బ్లీచింగ్ పౌడరూ కలిపి వాడిందన్నారు. దాంతో ఘాటైన పొగలొచ్చి, ఊపిరాడక ఆయాసంతో పడిపోయిందట!
ఇదంతా చూస్తున్న కమలకు, "మీ ఆడవాళ్లకు ఎప్పుడూ ఏదో ఒక అలర్జీ" అన్న తర భర్త మాటలు గుర్తొచ్చాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఆ మర్నాడు పక్కింటి పెద్దావిడను డిశ్చార్జ్ చేస్తున్నపుడు, డాక్టర్ కాస్త తీరికగా ఉన్నట్లు కనిపిస్తే ఆమెతో మాట్లాడింది కమల.
"డాక్టర్ గారూ అలర్జీ అంటే ఏమిటీ? అలర్జీలు ఆడవాళ్లకే ఎక్కువగా వస్తాయా?" అని అడిగింది. అందుకు డాక్టరు..
"మన ఒంటికి పడని పదార్థమేదయినా తీసుకున్నా, స్పృశించినా మన శరీరంలో కనపడే లక్షణాలన్నిటినీ కలిపి అలర్జీ అంటారు. అంటే మన శరీరం మనం తీసుకున్న పదార్థాన్ని శత్రువుగా పరిగణించి రక్షణచర్యగా కొన్ని పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది వాటివలన కళ్లు, ముఖం ఎర్రగా అవడం, విపరీతంగా దగ్గు, తుమ్ములు రావడం, ఒంటి మీద దద్దుర్లు రావడం, ఊపిరందకపోవడం, ఆయాసం, చివరికి ప్రాణాలక్కూడా ముప్పు రావచ్చు.’’ అని చెప్పడం ప్రారంభించారు డాక్టర్.
‘‘నిజం చెప్పాలంటే అలర్జీలు ఆడవాళ్లలో, మగ వాళ్లలో సమానమే. అయితే ఆడవాళ్లు అలర్జీ కలిగించే పరిస్థితులకు ఎక్కువగా గురవుతారు. అంటే.. ఇంట్లో బూజు, దుమ్ము దులపడం, ఊడవడం, డిటర్జెంట్ పౌడర్లు ఉపయోగించి బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, బాత్రూం శుభ్రం చేసేందుకు రసాయనాలను వాడటం ఈ పనులన్నీ సాధారణంగా ఆడవారే కదా చేస్తారు! అందుకని.. మహిళలకే అలర్జీ ఎక్కువ అనిపిస్తుంది.’’
ఫొటో సోర్స్, Getty Images
‘‘అంట్లు తోమే వాళ్లు, బట్టలు ఉతికే వాళ్ల చేతులన్నీ పుండ్లు పడిపోయి, ఎర్రగా వాచి దురదలు రావడం జరుగుతుంది. ఇంకొందరికి పూజ సమయాల్లో వాడే పసుపూ, కుంకుమను తాకినా అలర్జీ వస్తుంది.’’
‘‘సాధారణంగా కలిగే అలర్జీలు.. ఆహారం వలన, మందుల వలన వస్తాయి. ఆహార విషయాల్లో.. పాలు, వేరుశెనగలు, గుడ్డు, గోధుమలు కొందరికి అలర్జీని కలగిస్తాయి. కొందరికి ఆకుకూరలు, పచ్చిమిర్చి, ములగ కూడా ప్రాణాల మీదకు తెస్తాయని ‘మా’ జర్నల్స్‌లో రాశారు.’’
‘‘ఇక ఔషధాల విషయానికి వస్తే.. నొప్పిని తగ్గించే మాత్రలు, కొన్ని రకాల యాంటీబయాటిక్స్, ఇంకా చెప్పాలంటే ఎలాంటి మందుకయినా అలర్జీ రావచ్చు. పెన్సిలిన్కి రియాక్షన్ వస్తుందనేది అందరికీ తెలిసిందేగా. ఇవి కాకుండా వాతావరణ మార్పుల కారణంగా, అంటే..
చల్లటిగాలి, గాలిలో తేలి వచ్చే కొన్ని రకాల పుప్పొడులు, కొన్ని పిచ్చిమొక్కలు కూడా అలర్జీ కలిగిస్తాయి. ఇక కీటకాల విషయానికి వస్తే, తేనెటీగలు కుట్టడం, వడ్ల చిలకలు, ఇతర కీటకాలు ఒంటిపై పాకినా దద్దుర్లూ, అలర్జీలు వస్తాయి.’’
‘‘కొన్ని రకాల బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా అలర్జీని కలగజేస్తాయి. నిజం చెప్పాలంటే ఒక్కో మనిషికి ఒక్కో పదార్థం పడదు. ఈ విషయంలో తమ ఒంటికి ఏది పడుతుంది, ఏది పడదు.. అన్న విషయాన్ని ఎవరికివారే తెలుసుకుని, ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి’’ అన్నారు డాక్టర్.
ఫొటో సోర్స్, Getty Images
మరి పరిష్కారం ఏమిటి?
ఇదంతా వింటున్న కమల.. ''డాక్టర్ గారూ మన ఒళ్లుకు ఒకసారి పడని పదార్థం ఇక ఎప్పటికీ పడనట్లేనా? దానికి దూరంగా వుండాల్సిందేనా?'' అనడిగింది.
''అవునమ్మా ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే.. ఒక పదార్థం వల్ల కలిగే అలర్జీ తీవ్రత మొదటిసారి తక్కువగా వుంటుంది. మళ్లీ అదే పదార్థం మిమ్మల్ని సమీపించినప్పుడల్లా ఆ తీవ్రత మరింత పెరిగిపోయి, చివరకు ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ప్రాణలకు ముప్పు తెచ్చే రియాక్షన్‌ను 'అనాఫైలాక్టాయిడ్ రియాక్షన్' అంటారు'' అని చెప్పడం ప్రారంభించారు.
‘‘మొదట చర్మం మీద దద్దుర్లు, దురదలు, మచ్చలుగా మొదలయి, తర్వాత పిల్లికూతలు, ఆయాసం కూడా రావచ్చు. చివరి స్టేజ్‌లో వచ్చే రియాక్షన్లో గొంతు లోపలి భాగంలో వాపు వచ్చి, కనీసం గాలి పీల్చుకునే సందు కూడా వుండదు. దానినే 'లారింజియల్ ఎడీమా' అంటారు.’’
‘‘అలర్జిక్ రైనైటిస్, అటోపిక్ డెర్మటైటిస్, కాంటాక్ట్ డెర్మటైటిస్, ఉబ్బసం, అనాఫైలాక్సిస్ ఇవన్నీ అలర్జీకున్న మరో రూపాలు’’ అని డాక్టర్ అన్నారు.
''డాక్టర్ గారూ! మరి ఇందుకు నివారణ ఏమిటి?'' అని అడిగింది కమల.
''అలర్జీ కలగజేసే పదార్థాలకు దూరంగా వుండటం, రియాక్షన్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. మహిళలు ఒక విషయం గ్రహించాలమ్మా.. తమ ఒంటికి పడని డిటర్జెంట్లు, యాసిడ్లకు దూరంగా వుండాలి. పసుపు, కుంకుమల పట్ల కూడా సెంటిమెంట్ వదిలి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలి'' అని డాక్టర్ వివరించారు.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- యూరిన్ థెరపీ: వాళ్ల మూత్రం వాళ్లే తాగుతున్నారు. మంచిదేనా?
- ‘అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?’
- వెనెజ్వేలా: పోషించే శక్తి లేక పిల్లల్ని అమ్మేస్తున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)