జ్వరం లేకుండానే డెంగీ రావచ్చు... ఇది మరీ ప్రమాదకరం

  • గురుప్రీత్ సైనీ
  • బీబీసీ ప్రతినిధి
డెంగ్యూ

ఫొటో సోర్స్, Getty Images

''డాక్టర్! నా వయసు 50 ఏళ్లు. నేను కొంచెం సేపు పని చేస్తే చాలు అలసిపోతున్నాను. నేను గత 12 ఏళ్లుగా మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నాను'' ఈ ఫిర్యాదుతో ఒక మధ్యవయస్కుడు డాక్టర్ అశుతోష్ బిస్వాస్ వద్దకు వచ్చారు.

దిల్లీలోని ఎయిమ్స్‌లో పని చేసే డాక్టర్ బిస్వాస్‌కు అదొక సాధారణ కేసులాగే అనిపించింది. ఆయనకు మధుమేహ పరీక్ష నిర్వహించినపుడు అది దాదాపు ప్రమాదస్థాయికి చేరినట్లు బిస్వాస్ గుర్తించారు.

వెంటనే ఆయనకు చికిత్స చేయడంతో అది 24 గంటల్లో అదుపులోకి వచ్చింది.

ఆ తర్వాత ఆయన రక్తపరీక్ష చేసినపుడు, ప్లేట్‌లెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

దీంతో డాక్టర్ బిస్వాస్ వెంటనే ఆయనకు డెంగీ చికిత్స చేయిస్తే.. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి.

ఇది చూసి డాక్టర్ బిస్వాస్, ఆయన టీమ్ షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఆ పేషెంట్‌కు ఎన్నడూ జ్వరం రాలేదు.

దీని అర్థం - అది జ్వరం లేని డెంగీ. ఆయనకు ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు.

చివరకు 9 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఆయనకు డెంగీ నయమైంది.

జర్నల్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా పత్రికలో 'ఎ క్యూరియస్ కేస్ ఆఫ్ అఫెబ్రిల్ డెంగీ' అన్న పరిశోధనా పత్రంలో డాక్టర్ బిస్వాస్ దీని గురించి సవిరంగా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

'అఫెబ్రిల్ డెంగీ' అంటే ఏమిటి?

'అఫెబ్రిల్ డెంగీ' అంటే జ్వరం లేకుండా డెంగ్యూ రావడం. సాధారణంగా డెంగీ కేసుల్లో పేషెంట్లకు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఒళ్లంతా నొప్పులు కూడా ఉంటాయి.

కానీ మధుమేహ వ్యాధి ఉన్న పేషెంట్లకు కానీ, వృద్ధులకు కానీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఈ జ్వరం లేని డెంగీ రావచ్చు.

వీళ్లకు జ్వరం రాకున్నా డెంగీలోని ఇతర లక్షణాలన్నీ ఉంటాయి.

''ఇలాంటి డెంగీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే తమకు డెంగీ వచ్చిందని పేషెంట్లకే తెలియదు. అందువల్ల వాళ్లు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు'' అని డాక్టర్ బిస్వాస్ అన్నారు.

ఇలాంటి డెంగీలో చాలా తక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. పరీక్ష చేస్తే ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

జర్నల్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, థాయ్‌ల్యాండ్‌లో ఇలాంటి జ్వరం లేని డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అక్కడ డెంగీ వచ్చిన పిల్లలలో 20 శాతం ఇలాంటి జ్వరం లేని డెంగీనే.

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి డెంగీఎవరికి వస్తుంది?

మ్యాక్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రొమెల్ టికు ప్రకారం, ఇలాంటి డెంగీ..

  • పెద్ద వయసు వారు, యుక్త వయస్కులు
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
  • మధుమేహ రోగులు
  • కేన్సర్ పేషెంట్లు
  • ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారికి రావచ్చు.

వైద్యులు చెప్పేదాని ప్రకారం, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో ఎవరికైనా నొప్పులు, ఊరికే అలసిపోవడం, ఆకలి లేకపోవడం, ఒంటిపై దద్దుర్లు, బీపీ తగ్గడం జరిగి జ్వరం లేకపోతే అది డెంగీ కావచ్చు.

అలాంటి పేషెంట్లు వెంటనే ప్లేట్‌లెట్ల సంఖ్యను పరీక్షించుకోకపోతే అది ప్రమాదానికి దారి తీయవచ్చని డాక్టర్ టికు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇలాంటి డెంగీకి కారణాలేంటి?

దీనికి సమాధానంగా డాక్టర్ టికు, ''చాలాసార్లు డెంగీ దోమ కాటు వల్ల రక్తంలోకి తక్కువ పరిమాణంలో వైరస్ ప్రవేశిస్తుంది. అందువల్లే డెంగీ లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి'' అని తెలిపారు.

డాక్టర్ టికూ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది చాలా తక్కువ డెంగీ కేసులు నమోదయ్యాయి. అందువల్ల ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

నీళ్లే విరుగుడు

నీళ్లు ఎక్కువగా తాగడం డెంగీకు మంచి చికిత్స అని డాక్టర్లు చెబుతున్నారు. డెంగీ తీవ్రంగా ఉన్నా, తక్కువగా ఉన్నా, నీళ్లు ఎక్కువగా తీసుకుంటే అది తొందరగా నయమౌతుంది.

అదే నీళ్లు తక్కువ తీసుకుంటే, డెంగీ మరింత పెరిగే అవకాశం ఉంది. చాలాసార్లు నీళ్లు బాగా తాగి, సరైన విశ్రాంతి తీసుకుంటే డెంగీ తగ్గిపోతుంది.

దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాదిలో ఈ నెల 20 వరకు 1,020 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం ఈసారి డెంగీ వైరస్ తక్కువగా రక్తంలోకి ప్రవేశించి ఉండడం కావచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)