విరాట్ కోహ్లీ: మా 'గేమ్ ఫ్లాన్' ఫెయిలైంది

భారత్ ఓటమి

ఫొటో సోర్స్, Reuters

పుణెలో జరిగిన మూడో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మరపురాని సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, వెస్టిండీస్ విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. "గేమ్ ప్లాన్‌ను జట్టు సమర్థంగా అమలు చేయలేకపోయింది" అన్నాడు.

ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మూడో వన్డేలో వెస్టిండీస్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో 1-1గా సమం చేయగలిగింది.

గౌహతిలో ఆడిన తొలి వన్డే భారత్ గెలిస్తే, విశాఖపట్నంలో ఆడిన రెండో వన్డే టై అయ్యింది.

పుణెలో విజయం కోసం భారత్ 284 పరుగులు చేయాల్సొచ్చింది. "ఇది అసాధ్యమైన లక్ష్యం కాదు" అని కోహ్లీ చెప్పాడు.

"మాకు భాగస్వామ్యాల అవసరం ఉంది. కానీ అవి చేయలేకపోయాం. ఇలా ప్రతిసారీ జరగదు. ఈరోజు మాకు బాగోలేదంతే. మేం మా ప్లాన్‌ అమలు చేయలేకపోయాం" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ ఒంటరి పోరాటం

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో వెస్టిండీస్ లక్ష్యాన్ని అద్భుతంగా చేజ్ చేసింది.

పుణె వన్డేలో కోహ్లీ నిర్ణయం వెనుక కారణం అదే అనుకుంటున్నారు. కానీ ఈసారీ భారత బ్యాట్స్‌మెన్లు టార్గెట్ చేజ్ చేయడంలో చతికిలబడ్డారు.

రో హోప్ 95 పరుగులు సాయంతో వెస్టిండీస్ నిర్ధారిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. సమాధానంగా టీమిండియా 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే జట్టు ప్లాన్ ప్రకారం ఆడాడు. 107 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇది వన్డే క్రికెట్‌లో కోహ్లీకి 38వ సెంచరీ. ఈ వెస్టిండీస్‌ సిరీస్‌లో వరసగా మూడో శతకం.

పుణె వన్డేలో కోహ్లీ మరో రికార్డ్ సాధించాడు. వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌ అయ్యాడు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో అతడి సెంచరీ ఇన్నింగ్స్ వృథా అయ్యింది.

ఫొటో సోర్స్, AFP

సత్తా చూపని బ్యాట్స్‌మెన్స్

టీమిండియా మిగతా బ్యాట్స్‌మెన్స్ అందరూ వెస్టిండీస్ బౌలర్ల ముందు తడబడ్డారు. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులే చేస్తే, శిఖర్ ధవన్ 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ట్వంటీ-20 టీమ్‌కు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీకి ఈ మ్యాచ్లో సెలక్టర్ల నిర్ణయం తప్పు అని నిరూపించడానికి మంచి అవకాశం దొరికింది. కానీ తను ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు.

విరాట్ కోహ్లీ 42వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పుడు భారత్ స్కోరు 220 పరుగులు. టీమ్ విజయం కోసం పోరాడుతోంది. కానీ కోహ్లీ అవుటైన తర్వాత వెస్టిండీస్ గెలుపు మరింత సులభమైంది.

వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, ఏష్లే నర్స్, ఓసీ మెకాయ్ రెండేసి వికెట్లు తీశారు. నర్స్ 22 బంతుల్లో 40 పరుగులు కూడా చేశాడు. ఆల్‌రౌంట్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అందుకున్నాడు.

విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ భారత్‌కు గట్టిపోటీ ఇచ్చింది. ఆతిథ్య టీమ్ చివరికి మ్యాచ్‌ టై చేయగలిగింది.

మూడో వన్డే కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్‌కు అవకాశం ఇచ్చింది. బుమ్రా నాలుగు వికెట్లు తీసి తన సెలక్షన్ కరెక్టేనని నిరూపించాడు. కెప్టెన్ కోహ్లీ బౌలర్లను ప్రశంసించాడు. కానీ బ్యాట్స్‌మెన్స్ ఆశించిన ఆటతీరు చూపించలేకపోయారన్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)