తెలంగాణలో గులాబి నోటు మాయం :ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో పెద్దనోటు మాయం
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలు పెద్దనోటును మింగేస్తున్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.
రవాణా చేసేందుకు, దాచిపెట్టేందుకు ఈజీగా ఉండే రూ.2వేల నోటుపైనే రాజకీయ పార్టీలతోపాటు బడావ్యాపారులు దృష్టిపెట్టారు. వీరంతా ఇప్పటికే పెద్దనోటును భారీగా నిల్వ చేయడంతో లావాదేవీలు చాలామటుకు తగ్గిపోయాయి.
మరో 45 రోజుల్లో తెలంగాణ ఎన్నికలు, తర్వాతి ఆర్నెల్లలో.. ఏపీ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రూ.2వేల నోట్ల నిల్వ పెరిగిపోయింది.
ఆర్బీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు రూ.53 వేల కోట్ల విలువైన 2 వేల నోట్లు సరఫరా చేస్తే మొన్నటి సెప్టెంబర్ 30వ తేదీనాటికి రూ.28 వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు బ్లాక్ అయ్యాయి.
ఈ ప్రమాద తీవ్రతను ఆర్బీఐ ముందుగానే పసిగట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.24 వేల కోట్ల విలువైన పెద్దనోట్లను వెనక్కు తీసుకుంది. వచ్చే ఏడాది మే నాటికి దాచిపెట్టిన మొత్తంలో సింహభాగం చలామణిలోకి వస్తుందని రిజర్వు బ్యాంక్ అంచనా వేస్తోంది.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లకు ఈజీగా పంపిణీ చేసే లక్ష్యంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులు వీటిని నిల్వ చేస్తూ ఉండొచ్చని ఆర్బీఐ విజిలెన్స్ అధికారి ఒకరు వెల్లడించారని సాక్షి పేర్కొంది.
ఫొటో సోర్స్, chandrababu/facebook
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ వేదికగా గర్జించారు... ప్రధానమంత్రి మోదీపై సమరశంఖం పూరించారని ఈనాడు పేర్కొంది.
గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తప్పుడు విధానాలతో దేశం సర్వనాశనమై వ్యవస్థలన్నీ కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని తూర్పారబట్టారు.
అందర్నీ సమన్వయం చేసుకుంటూ... విభిన్న వేదికలు... విభిన్నకోణాల్లో దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ఆలోచన రగిలిస్తూ తన ప్రస్థానాన్ని లక్ష్యం దిశగా తీసుకెళ్తానని శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధీమాగా ప్రకటించారు.
ఇది అంతం కాదు.. ఆరంభం అని కుండబద్దలుకొట్టారు. పలువురు నేతలతో ఆయన రాజకీయ చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ, ప్రజాస్వామ్య అనివార్యతలను దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీ మద్దతిచ్చినా తీసుకుంటామన్నారు.
మోదీ ప్రభుత్వానికి దేశ ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే అధికమయ్యాయి. అందుకే అవినీతిపరులను వదిలిపెట్టి, విభేదించిన రాజకీయనాయకులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
''అన్నదాతకు సంతోషం లేదు. నిరుద్యోగులకు నిద్ర లేదు. వ్యవస్థలకు నిబంధనల్లేవు. గుజరాతీలకు హద్దుల్లేవు. సంపూర్ణ మెజార్టీతో నడుస్తున్న మోదీ ప్రభుత్వంలో కంటే మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ హయాంలోనే ఆర్థిక సంస్కరణలవల్ల అధిక మేలు జరిగింది.
సీబీఐలో సంక్షోభానికి ప్రధానే కారణం. దేశానికి ఆయనే సమాధానం చెప్పాలి.'' అని అన్నారు.
ఏక పార్టీ, ఏకపక్ష ప్రభుత్వాల కంటే సంకీర్ణ ప్రభుత్వాల్లోనే దేశానికి ఎక్కువ మేలు జరిగింది. మున్ముందు కూడా సంకీర్ణ ప్రభుత్వాలే దేశానికి మేలుచేస్తాయన్నారని ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, Trs/facebook
'ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలంగాణలో ఏం పని?'
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.
'ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలంగాణలో ఏం పని?. అక్కడి పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ కుట్రలకు వాడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
వారితో సర్వేలు చేయిస్తున్నారని, డబ్బుల పంపిణీకి వాడుకుంటున్నారని ఆరోపించారు. వారిని విడిపించేందుకు ఏపీకి చెందిన డీఎస్పీ బోస్ స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు.
''ఇలాంటి కుట్రల కోసం ఉమ్మడి రాజధానిని వాడుకుంటారా? చిల్లర రాజకీయాలనే చంద్రబాబు కోరుకుంటున్నారా?'' అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు సుమన్, బీబీ పాటిల్, తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తదితరులతో కలిసి శనివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
ఎల్.రమణకు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఏం పని అని ప్రశ్నించారు. అక్కడ ఉంటూ ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు, డీఎస్పీ బోస్‌తో నిరంతరం సమీక్షలు చేస్తున్నారని, వాళ్లంతా రేవంత్ రెడ్డితో కూడా టచ్‌లో ఉన్నారని విమర్శించారు.
ఏపీ ఇంటెలిజెన్స్, చంద్రబాబు మధ్య రమణ, రేవంత్ అనుసంధానకర్తలుగా పని చేస్తున్నారని, దీనిపై పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఫొటో సోర్స్, uttamkumarreddy/facebook
మహాపొత్తు కొలిక్కి
'గెలుపు ముఖ్యం. ఆ ప్రాతిపదికనే సీట్ల సర్దుబాటు ఉండాలి. గెలవని సీట్ల కోసం పంతాలకు పోయి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. సర్దుబాటు ధోరణి ముఖ్యమ'ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సూచించారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటుకు సంబంధించి దిల్లీలో వీరు ముగ్గురూ శనివారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 10.15 గం.ల నుంచి గంటకుపైగా సమావేశం కొనసాగింది.
నామినేషన్లకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల పంపకాలను త్వరగా పూర్తిచేయాలని నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ 91, టీజేఎస్ 8, టీడీపీ 15, సీపీఐ అయిదు సీట్లలో పోటీ చేయాలని అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది.
ఎవరెవరు ఏ ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదని సమాచారం. శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్‌లో ఉత్తమ్, కోదండరాం, రమణల మధ్య జరిగిన చర్చల కొనసాగింపుగానే శనివారం దిల్లీలో చంద్రబాబుతో భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీ గెలిచి.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఎల్.బి.నగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ వంటి సీట్లే ప్రధాన సమస్యగా మారినట్లు తెలిసింది. టీజేఎస్, సీపీఐ సైతం కాంగ్రెస్, టీడీపీలు బలంగా కోరుతున్న కొన్ని సీట్లపై పట్టు వీడకపోవడం ప్రతిష్టంభనకు దారితీస్తున్నట్లు తెలిసింది.
పార్టీ బలం, అక్కడ ఆ పార్టీకి ఉన్న అభ్యర్థి విజయావకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించినట్లు సమాచారం.
చంద్రబాబును ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలవడానికి ముందుగానే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, నారాయణ.. టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. వారితో కలిసి చంద్రబాబు రాత్రి భోజనం చేశారు.
దేశ రాజకీయాలు, ఏపీలో పరిస్థితులే ఎక్కువగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసిందని ఈనాడు పేర్కొంది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)