మానసిక రుగ్మత: పురుషులకు ఉంటే ఇలా వదిలేస్తారా?

మహిళలు, మానసిక రుగ్మతలు

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో మానసిక రుగ్మతలతో బాధపడే మహిళల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, వాళ్లు కుటుంబానికి భారమని భావిస్తూ వాళ్లను వదిలించుకుంటున్నారు. చాలా తరచుగా భారతదేశంలో మానసిక రుగ్మతలను ఒక మచ్చగా భావిస్తున్నారు. అలాంటి సందర్భాలలో ఎక్కువగా నష్టపోతున్నది మహిళలే అని రక్షా కుమార్ అంటున్నారు.

రమ(పేరు మార్చాం)కు ఈ ఏడాది ఆగస్టు 20న 44 ఏళ్లు నిండాయి. తన 'గత జీవితం' గురించి తనకు గుర్తున్న కొన్ని విషయాలలో తన జన్మదినం ఒకటని ఆమె తెలిపారు. ఆమె భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ముంబైలో ఉండేవారు.

''ఎవరైనా.. తాము తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తామని, వాళ్లు లేకుండా జీవించలేమని అంటే నాకు అర్థం కాదు'' అన్నారు రమ.

తన వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని, తన పిల్లలిద్దరూ తన పట్ల ప్రేమగా ఉండేవారు కాదని ఆమె తెలిపారు.

రమకు 30 ఏళ్లు రావడానికి కొద్ది రోజుల ముందు ఆమె భర్త ఆమెను థానెలోని రీజనల్ మెంటల్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. ఆమెకు 'బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్' ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది ఉన్న వారి మానసిక స్థితిలో తీవ్రమైన మార్పులు ఉంటాయి.

''నా భర్త నాకు మందులు తీసుకొస్తానని వెళ్లాడు. అంతే... మళ్లీ తిరిగి రాలేదు'' అని రమ చాలా నిర్వికారంగా తెలిపారు.

భారతదేశంలోని మానసిక ఆరోగ్య వైద్యుల ప్రకారం మహిళలకు మానసిక రుగ్మతలు ఉన్నట్లు తేలితే, వాళ్లను ఇలా వదిలివెళ్లడం చాలా సర్వసాధారణం.

భారతదేశంలో సుమారు 14 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. వారిలో కనీసం 10 శాతం మందికి వెంటనే వైద్యం అందించాల్సి ఉందని 2016లో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ (నిమ్‌హాన్స్) వెలువరించిన ఒక పరిశోధన వెల్లడించింది.

ఫొటో సోర్స్, Cheena Kapoor

ఫొటో క్యాప్షన్,

గ్యాంగ్ రేప్ కారణంగా ఈ యువతి మానసిక రుగ్మతకు గురయ్యారు. తల్లిదండ్రులు ఈమెను ఇంటి నుంచి తరిమేశారు.

20 శాతం మంది భారతీయులకు డిప్రెషన్..

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017లో, 20 శాతం మంది భారతీయులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో డిప్రెషన్‌తో బాధ పడుతుంటారని వెల్లడించింది.

అయితే చాలా కొద్ది మంది మాత్రమే ప్రొఫెషనల్ సాయం తీసుకుంటారు. ఎందుకంటే భారతదేశంలో మానసిక రుగ్మతలను ఒక సామాజిక కళంకంగా భావిస్తారు.

భారతదేశంలో మహిళల మానసిక ఆరోగ్యంపై పరిశోధనలు చేసిన పరిశోధకురాలు రెనీ థామస్ ''పేషెంట్ పురుషుడైతే అతని తల్లో, భార్యో, సోదరో అతన్ని చూసుకోవడానికి అందుబాటులో ఉంటారు. కానీ అదే మహిళ అయితే, వాళ్లు ఇంటి పని చేయడానికి పనికిరారు కాబట్టి, వాళ్లను కుటుంబం ఒక బరువుగా భావిస్తుంది'' అని తెలిపారు.

కొందరు మహిళలను మానసిక రుగ్మతల కారణంగా వదిలించుకుంటే, పట్టించుకునే వారు లేకపోవడం, వాళ్లు వీధుల్లో బతకాల్సి రావడం వల్ల కొందరు మహిళల్లో మానసిక రుగ్మత లక్షణాలు పెంపొందుతాయి.

''ఇలాంటి కథల్లో కుటుంబసభ్యులే విలన్లు అని ఖచ్చితంగా చెప్పలేం'' అని డాక్టర్ కేవీ కిశోర్ కుమార్ అన్నారు. దీనిలో కుటుంబాలతో పాటు ప్రభుత్వాల బాధ్యత కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మానసిక రుగ్మతలతో బాధపడుతూ, కుటుంబాలు దూరమైన మహిళల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలో కేవీ కిశోర్ పని చేస్తున్నారు. నివాసం, ఉపాధి అవకాశాలు, మానసిక ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉన్నపుడే అలాంటి వారికి కుటుంబం నుంచి సహకారం అందుతుందని ఆయన తెలిపారు.

2016లో జాతీయ మహిళా కమిషన్ వెలువరించిన నివేదిక ప్రకారం, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న మహిళలను సామాజిక కళంకంగా భావించి వాళ్లను వదిలించుకుంటున్నారు. ఇళ్లలో తగినంత స్థలం లేకపోవడం, వృద్ధాప్యంలో వాళ్లను చూసుకునేవాళ్లు లేకపోవడం, అలాంటి మహిళల భద్రత గురించి భయాలు వాళ్లను వదిలించుకోవడానికి ఇతర కారణాలు.

అయితే పురుషులు, మహిళల విషయంలో ఇవన్నీ వేర్వేరు అని రెనీ తెలిపారు. ఇలాంటి మానసిక రుగ్మతల విషయంలో పురుషులను చాలా తక్కువగా పునరావాస కేంద్రాలలో ఉంచుతారని ఆమె వెల్లడించారు.

''మహిళలను ఇలాంటి పునరావాస కేంద్రాలలో వదిలినపుడు తమ మానసిక రుగ్మతలకు తోడు వాళ్లు అనేక రకాల అవమానాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉండదు. వాళ్లను సరిగా పట్టించుకోరు. కొన్ని సార్లు కొడతారు కూడా'' అని 2014లో హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Cheena Kapoor

ఫొటో క్యాప్షన్,

బాయ్‌ఫ్రెండ్ వదిలిపెట్టడంతో ఈ అమ్మాయి అసహజంగా ప్రవర్తించడం ప్రారంభించింది

మగవాళ్లు వాళ్ల బాగోగులు వాళ్లే చూసుకుంటారు, కానీ..

మానసిక రుగ్మతలున్న వారి కోసం బెంగళూరులో ప్రభుత్వం నిర్మించిన రెండు ఆవాస కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కేవలం 220 మందికి మాత్రమే చోటు కల్పించవచ్చు. అయితే వీటిలో సుమారు 300 మంది ఉంటున్నారు.

అయితే అలాంటి రుగ్మతలతో ఉన్న వారిని చూసుకునేందుకు తగిన శిక్షణ ఈ కేంద్రం నిర్వాహకులకు లేదు.

డాక్టర్ కిశోర్ కుమార్ అంచనా ప్రకారం మానసిక రుగ్మతలు ఉన్నవారిలో సుమారు 40 శాతం తమకై తామే చికిత్స కోసం వస్తారు. మిగిలిన వారు వీధుల్లో తిరుగుతూ కనిపించినపుడు, పోలీసులు వాళ్లను 'ప్రమాదకరం'గా భావిస్తే డాక్టర్ల వద్దకు తీసుకువస్తారు.

ఇలా పోలీసులు డాక్టర్ల వద్దకు తీసుకువచ్చే వారిలో ఎక్కువ మంది మహిళలు లేదా యువతులే ఉంటారు. దీనికి కారణం మానసిక రుగ్మతలున్న మగవాళ్లు వాళ్ల బాగోగులు వాళ్లే చూసుకోగలరు అనే నమ్మకం, లేదా వాళ్లకు వీధుల్లో ప్రమాదం ఉండదనే నమ్మకం.

కానీ మహిళలకు రక్షణ అవసరమనే అభిప్రాయంతో వాళ్లను బలవంతంగా షెల్టర్ హోమ్‌లకు తీసుకువస్తారని రెనీ థామస్ తెలిపారు. చాలా సందర్భాలలో ఇది నిజం కూడా అని ఆమె అన్నారు.

భారత ప్రభుత్వం 2017లో మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎవరైనా వ్యక్తులు తమకు తాము లేదా ఇతరులకు హాని కలుగజేస్తారనే అనుమానం ఉన్నప్పుడు వాళ్లను బలవంతంగా బంధించవచ్చు.

కానీ నిమ్‌హాన్స్‌కు చెందిన డాక్టర్ ప్రతిమా మూర్తి మాత్రం, ఇలాంటి నిర్బంధం మహిళలకు ప్రమాదకరమని అన్నారు.

''మానసిక ఆరోగ్య కేంద్రాలకు చాలా మంది మహిళలు తమ కుటుంబాలతో కలిసి తమంతట తాముగా వస్తారు. కానీ వాళ్లు ఇష్టపూర్వకంగా ఇన్-పేషెంట్‌గా ఉండాలనుకోరు'' అని ఆమె తెలిపారు.

అలాంటి మహిళలకు తగిన వైద్య చికిత్స అందిస్తే, చాలా మంది కోలుకుంటారు. అయితే కోలుకున్నా, అలాంటి మహిళలు ధైర్యంగా బయటి ప్రపంచంలోకి వెళ్లాలంటే జంకుతారు.

అలాంటి వారి కోసం వారి కుటుంబసభ్యులు రాకపోతే వాళ్లను ఏవైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆవాస కేంద్రాలకు తరలించడం మినహా నిమ్‌హాన్స్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు.

ఫొటో సోర్స్, Cheena Kapoor

ఫొటో క్యాప్షన్,

మానసిక రుగ్మతలు ఉన్న మహిళలను వాళ్ల కుటుంబం పట్టించుకోకపోవడానికి సామాజిక కళంకం ఒక కారణం

రమ కూడా నిమ్‌హాన్స్ నుంచి విడుదలై షెల్టర్ హోమ్‌కు వెళ్లాల్సి వచ్చినపుడు ఆమె బెంగళూరులోని ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే స్నేహితురాలిని ఆశ్రయించారు. స్నేహితురాలి ఫ్యాక్టరీలోనే ఆమెకు ఉద్యోగం దొరికింది.

ఆ క్షణం తనకు పునర్జన్మ లభించినట్లయిందని రమ అన్నారు. ప్రస్తుతం ఆమె తన ఖర్చులకు సరిపోయేంత జీతాన్ని సంపాదిస్తూ, బెంగళూరులోనే ఒక సింగిల్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన వద్ద డబ్బు మిగిలినపుడు ఆమె దానితో మిఠాయిలు కొని తన పరిసరాలలోని పిల్లలకు పంచి పెడతారు.

''నా భర్త అనుమతించి ఉంటే నా పిల్లలు నా దగ్గరకు వచ్చేవాళ్లేమో'' అంటారామె. ''నాకేమీ నా పిల్లల మీద ద్వేషం లేదు.''

('ఇంటర్నేషనల్ వుమెన్స్ మీడియా రిపోర్టింగ్ గ్రాంట్స్ ఫర్ వుమెన్ స్టోరీస్' సహకారంతో..)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)