అమరావతిలో గూగుల్ ల్యాబ్': ప్రెస్‌రివ్యూ

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్ర ప్రదేశ్‌లో గూగుల్ సంస్థ గూగుల్ కోడ్ ల్యాబ్ పేరుతో నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసినట్టు 'ఈనాడు' కథనం ప్రచురించింది. సంస్థ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిపింది.

అమరావతిలో గూగుల్‌ కోడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో దీనిని నెలకొల్పారు. లక్నోలో మరో ల్యాబ్‌ మంజూరు చేసినా ఇంతవరకు అది పూర్తి కాలేదు. పైగా ఏపీలో ఏర్పాటు చేసిన దానికంటే చిన్నది. గూగుల్‌ సంస్థ ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు గతేడాది గూగుల్‌ ప్రతినిధి జోన్‌లీవ్‌ బెకర్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. ఇవికాకుండా నానోడిగ్రీలకు సంబంధించి ఉడాసిటీ సంస్థ ఇండియా విభాగం ఎండీ ఇషాన్‌ గుప్తాతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డెవలపర్‌ ఫండమెంటల్స్‌ శిక్షణలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రత్యేక చొరవ చూపింది. రాష్ట్రంలోని వంద ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్యమంత్రి ఎక్సలెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది. ఇప్పటిదాకా ఇంజినీరింగ్‌ మూడు, నాలుగు సంవత్సరాలు చదువుతున్న ఆరువేల మంది విద్యార్థులు ఇలా శిక్షణ పొందడం చూసి గూగుల్‌ సంస్థ ఉచితంగా ఈ గూగుల్‌కోడ్‌ ల్యాబ్‌ను మంజూరు చేసిందని ఈనాడు కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

విశాఖకు రైల్వే జోన్ రానట్లే

'రైల్వేజోన్‌ ఇక రానట్లే' అని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం ప్రచురించింది. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ కూడా రాదని చెప్పింది. ఆర్టీఐ ద్వారా రైల్వే జోన్‌పై కేంద్రం నుంచి పరోక్ష సమాధానం లభించిందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి, లోక్‌సభకు ఎన్నికలు జరగడానికి గడువు సమీపిస్తోంది. మార్చిలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉన్నందువల్ల ఏపీలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి ఎక్కువ సమయం లేదు. అయినప్పటికీ కేంద్రం వైఖరి చూస్తుంటే ఈ విషయంలో కర్ర విరగకుండా, పాము చావకుండా వ్యవహరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రైల్వేజోన్‌ విషయంపై 'ఆంధ్రజ్యోతి' ఢిల్లీ ప్రతినిధి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు... ఏ అంతిమ నిర్ణయమూ తీసుకోలేదని, కమిటీ నివేదికను వివరంగా పరిశీలిస్తున్నామని ఈ నెల 22న రైల్వే బోర్డు సమాచారం అందించిందని చెప్పినట్లు పత్రిక కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, AFP

ఎన్నికల ఖర్చు అనుమతికి మించితే అనర్హత వేటు

అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చుపై ఈసీ నిరంతరం నిఘా పెట్టినట్లు'లెక్క తేలాల్సిందే' అంటూ 'నమస్తే తెలంగాణ'ఒక కథనం ప్రచురించింది. మైక్ సెట్ నుంచి కారు వరకూ అన్నిటికీ నిర్దిష్ట ధరలు నిర్ణయించిందని చెప్పింది. వ్యయం వివరాలను షాడో రిజిస్టర్‌లో నమోదు చేస్తారని, అనుమతికి మించితే అనర్హత వేటుకు అవకాశం ఉందని ఈ కథనం తెలిపింది.

ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం అనే ముద్ర పడిపోయింది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కొందరు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరనేది బహిరంగ రహస్యం. అధ్యక్షా.. అని అసెంబ్లీలో గొంతెత్తాలనే కోరిక నెరవేర్చుకునే క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు పలు మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు విచ్చలవిడిగా ధన ప్రవాహానికి దిగుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం.. నియోజకవర్గంలో అభ్యర్థులు తమ ప్రచారానికి గరిష్ఠంగా ఎంత ఖర్చు పెట్టాలో హద్దు నిర్ణయించిందని ఈ కథనంలో వాటి వివరాలను పేర్కొన్నారు.

పోలింగ్ పూర్తయ్యేనాటికి ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు సమర్పించాలని నిబంధన విధించింది. అయితే.. ఆ హద్దును అభ్యర్థులెవరూ పట్టించుకోరు. రూ.కోట్లల్లో ఖర్చుచేసి.. ఈసీకి మాత్రం రూ.లక్షల వ్యయం చూపిస్తుంటారు. ఈ పరిణామాలను గమనించిన ఈసీ.. అభ్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు, నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు సరికొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది అని నమస్తే తెలంగాణ కథనంలో వాటిని వివరించింది..

ఫొటో సోర్స్, iStock

విద్యార్థుల వీపు మోతకు విశ్రాంతి

విద్యార్థుల బరువు తగ్గించడానికి కేంద్రం జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందిస్తోందంటూ 'వీపు మోతకు విశ్రాంతి' పేరుతో 'ఈనాడు' ఒక కథనం ప్రచురించింది. జాతీయ స్థాయిలో పాఠ్యాంశాల రూపకల్పన చేస్తోందని తెలిపింది. దీనిపై తెలంగాణ గత ఏడాదే జీవో జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనితెలిపింది.

విద్యార్థుల బడి సంచి బరువు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఓ విధానాన్ని రూపొందించడంలో నిమగ్నమయింది. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కొద్ది రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ఎస్‌సీఈఆర్‌టీ అధికారులతో కార్యశాలలు నిర్వహిస్తూ అభిప్రాయాలను, సూచనలను స్వీకరిస్తోంది. తెలంగాణలో మాత్రం గత ఏడాదే బడి సంచి బరువు నియంత్రణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలుపై విద్యాశాఖ దృష్టి సారించలేదు అని ఈనాడు కథనం తెలిపింది.

విద్యార్థులు బడి సంచి బరువు అధికంగా ఉంటోందని, దాన్ని తగ్గించాలని, ఒకటి, రెండు తరగతులకు హోంవర్క్‌ ఇవ్వొద్దని మద్రాస్‌ హైకోర్టు మే 30న సీబీఎస్‌ఈని ఆదేశించింది. విద్యార్థుల బడి సంచి బరువుపై కేంద్రం ఓ విధానం తయారు చేసి అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని తీర్పునిచ్చింది. బరువు ఎంత ఉండాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసినందున ఆ రాష్ట్ర విద్యాశాఖతో సంప్రదించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

తెలంగాణలో బరువు పరిమితిని అమలు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే జీఓలు లేకపోవడం గమనార్హం. దాంతో విద్యాశాఖ అధికారులు అమలును గాలికి వదిలేశారన్న విమర్శలున్నాయి. కనీస తనిఖీలూ చేయడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)