సుప్రీం కోర్టులో అయోధ్య రామమందిరం కేసు విచారణ వాయిదా: మరి ఇప్పటి వరకు ఏం జరిగింది?

బాబ్రీ మసీదు

ఫొటో సోర్స్, Getty Images

రామజన్మ భూమి, బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణను జనవరికి వాయిదా వేసిందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కొత్తగా ఏర్పాటైన ముగ్గురు జడ్జిల ధర్మాసనం విచారించింది.

అంతకు ముందు ఈ కేసులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నాజిర్ వాదనలు విన్నారు.

అయోధ్య వివాదం భారత్‌లో ఒక రాజకీయ అంశంగా మారింది. హిందూ సంస్థల కార్యకర్తలు 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చారు.

హిందూ ఆరాధ్య దైవం శ్రీరాముడు సరిగ్గా అక్కడే జన్మించాడని భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్‌తోపాటు మరికొన్ని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. బాబ్రీ మసీదును నిజానికి ఒక ఆలయం కూల్చి నిర్మించారని వారు చెబుతున్నారు.

బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఆలయ నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని బదిలీ చేయాలని తీవ్రమైన డిమాండ్లు వచ్చాయి.

రామ మందిరం-బాబ్రీ మసీదు అంశంలో వివాదాస్పద భూమి యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

యాజమాన్య హక్కుల కేసు దేశంలోని కోర్టుల్లో 1949 నుంచి నడుస్తోంది. ఈ మొత్తం వివాదం ఎప్పుడు మొదలైంది, ఇప్పటివరకూ ఈ వివాదంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images

 • 1528: అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంగా భావించే ప్రాంతంలో ఒక మసీదు నిర్మించారు.
 • 1853: మొదటి సారి ఈ స్థలం దగ్గర మత ఘర్షణలు జరిగాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ మసీదు నిర్మించారని చెబుతారు. అందుకే దీనికి బాబ్రీ మసీదు అనే పేరొచ్చిందని అంటారు. ఇప్పుడు కొన్ని హిందూ సంస్థలు అక్కడ రామమందిరం నిర్మించాలని భావిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

 • 1859: బ్రిటీష్ పాలకులు వివాదాస్పద స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. లోపల భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థించడానికి అనుమతి ఇచ్చారు.
 • 1949: మసీదులో రాముడి విగ్రహాలు లభించాయి. కొంతమంది హిందువులు ఈ విగ్రహాలను అక్కడ ఉంచారని ఆరోపణలు వచ్చాయి. ముస్లింలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెండు వర్గాలు కోర్టులో కేసు వేశాయి. ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పదంగా ప్రకటించి దానికి తాళాలు వేసింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 1984: కొంతమంది హిందువులు విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో శ్రీరాముడి జన్మస్థలానికి విముక్తి కల్పించి, రామమందిరం నిర్మించడానికి ఒక కమిటీని వేశారు. తర్వాత ఈ ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ ప్రముఖ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ నేతృత్వం వహించారు.
 • 1986: జిల్లా మేజిస్ట్రేట్ హిందువులకు ప్రార్థించడానికి వివాదాస్పద మసీదు తాళం తీయమని ఆదేశించారు. ముస్లింలు దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు పోరాట సమితిని ఏర్పాటు చేశారు.
 • 1989: విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం ఉద్యమం తీవ్రం చేసింది. వివాదాస్పద స్థలం దగ్గర రామమందిరం పునాది వేసింది.

ఫొటో సోర్స్, AFP

 • 1990: విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బాబ్రీ మసీదును స్వల్పంగా ధ్వంసం చేశారు. అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అవి సఫలం కాలేదు.
 • 1992: విశ్వహిందూ పరిషత్, శివసేన, బీజేపీ కార్యకర్తలు డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2 వేల మందికిపైగా మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images

 • 1998: ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 • 2001: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం నిర్వహించడంపై ఉద్రిక్తతలు తలెత్తాయి. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించడమే లక్ష్యమని విశ్వహిందూ పరిషత్ మరోసారి చెప్పింది.
 • 2002 జనవరి: అయోధ్య వివాదం పరిష్కరించేందుకు ప్రధానమంత్రి వాజ్‌పేయి అయోధ్య కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్ నేత శతృఘ్న్ సిన్హాను హిందూ, ముస్లిం నేతలతో చర్చల కోసం నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images

 • 2002 ఫిబ్రవరి: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం అంశాన్ని చేర్చడానికి బీజేపీ నిరాకరించింది. మార్చి 15న రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. వందలాది మంది హిందూ కార్యకర్తలు అయోధ్యకు తరలివచ్చారు. తర్వాత తిరిగి రైల్లో వెళ్తున్న కార్యకర్తలపై గుజరాత్ గోధ్రా దగ్గర దాడి జరిగింది. అందులో 58 మంది కరసేవకులు చనిపోయారు.

ఫొటో సోర్స్, AFP

 • 13 మార్చి 2002: సుప్రీంకోర్టు తన తీర్పులో అయోధ్యలో యథాతథ స్థితి కొనసాగిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం స్వాధీనంలో ఉన్న భూమిలో ఎవరినీ అనుమతించకూడదని చెప్పింది. కేంద్రం కూడా సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తామని చెప్పింది.
 • 15 మార్చి 2002: మందిర పరిసరాలకు బయటే రాతి స్తంభాలను అప్పగిస్తామని విశ్వహిందూ పరిషత్, ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం వీహెచ్‌పీ నేతలు, దాదాపు 800 మంది కార్యకర్తలు ప్రభుత్వ అధికారులకు తాము మందిరం కోసం తీసుకొచ్చిన రాతి స్తంభాలను అందించారు.
 • 22 జూన్, 2002: రామ మందిర నిర్మాణం కోసం వివాదాస్పద భూమిని అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 2003 జనవరి : వివాదాస్పద రామ మందిరం-బాబ్రీ మసీదు పరిసరాల కింద ఏదైనా ప్రాచీన భవనాల అవశేషాలు ఉన్నాయా అనేది తెలుసుకోడానికి రేడియో తరంగాల ద్వారా పరిశోధనలు జరిగాయి. కచ్చితమైన ఆధారాలు ఏవీ దొరకలేదు.
 • 2003 మార్చి : వివాదాస్పద స్థలంలో పూజలు చేసుకోడానికి అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కోర్టు దానిని తోసిపుచ్చింది.
 • 2003 ఏప్రిల్: అలహాబాద్ హైకోర్టు నిర్దేశాల ప్రకారం వివాదిత స్థలంలో పురాతత్వ శాఖ తవ్వకాలు ప్రారంభించింది. జూన్ వరకూ ఇవి సాగాయి. తర్వాత రిపోర్టులో మందిరాన్ని పోలిన కొన్ని అవశేషాలు లభించాయని తెలిపారు.
 • 2003 మే: ‘1992 బాబ్రీ మసీదు కూల్చివేత’ కేసులో అప్పటి ఉపప్రధాని అడ్వాణీసహా 8 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది.
 • 2003 జూన్: కంచి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి కేసు పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించారు. జులై లోపు అయోధ్య అంశం పూర్తిగా పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images

 • 2003 ఆగస్టు: రామమందిర నిర్మాణం కోసం ప్రత్యేక బిల్లు తేవాలని కోరిన వీహెచ్‌పీ డిమాండును బీజేపీ నేతలు, ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ తోసిపుచ్చారు.
 • 2004 ఏప్రిల్ : అడ్వాణీ అయోధ్యలోని తాత్కాలిక రామమందిరంలో పూజలు చేశారు. కచ్చితంగా ఆలయం నిర్మిస్తామని తెలిపారు.
 • 2004 జులై: శివసేన చీఫ్ బాల్ ఠాకరే అయోధ్య వివాదాస్పద స్థలంలో మంగల్ పాండే పేరుతో ఏదైనా జాతీయ స్మారకం రూపొందించాలని సలహా ఇచ్చారు.
 • 2005 జనవరి: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 2005 జులై: ఐదుగురు సాయుధ మిలిటెంట్లు వివాదాస్పద స్థలం దగ్గర దాడికి దిగారు. మిలిటెంట్లను భద్రతా దళాలు బయటే కాల్చిచంపాయి. ఈ దాడిలో ఒక భారత పౌరుడు చనిపోయారు.
 • 6 జులై, 2005: బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో ఉద్రేక పూరిత ప్రసంగం ఇచ్చిన కేసులో అడ్వాణీని కూడా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది.
 • 28 జులై 2005: ఈ కేసులో అడ్వాణీ రాయ్ బరేలీలోని ఒక కోర్టుకు హాజరయ్యారు.
 • 4 ఆగస్టు 2005: ఫైజాబాద్ కోర్టు ఈ కేసులో నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 20 ఏప్రిల్ 2006: లిబ్రహాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేత ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలిపింది. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్, శివసేన చేతులు కలిపాయని చెప్పింది.
 • 2006 జులై: వివాదాస్పద స్థలంలో ఉన్న తాత్కాలిక ఆలయం భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో కంచె ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. దీనిని ముస్లిం సంస్థలు వ్యతిరేకించాయి. ఇది కోర్టు ఆదేశాలకు వ్యతిరేకం అని చెప్పాయి.

ఫొటో సోర్స్, Getty Images

 • 19 మార్చి 2007: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ప్రధాని అయితే బాబ్రీ మసీదు కూలి ఉండదన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్పందనలు వచ్చాయి.
 • 30 జూన్ 2009: బాబ్రీ మసీదు కూల్చిన కేసులో విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబ్రహాన్ కమిటీ 17 ఏళ్ల తర్వాత తన రిపోర్ట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు అప్పగించింది.
 • 7 జులై 2009: అయోధ్య వివాదానికి సంబంధించిన 23 కీలక ఫైళ్లు సెక్రటేరియట్ నుంచి మాయమయ్యాయని యూపీ ప్రభుత్వం ఒక అఫిడవిట్‌లో అంగీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 24 నవంబర్ 2009: లిబ్రహాన్ రిపోర్ట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. అందులో లిబ్రహన్ కమిటీ అటల్ బిహారీ వాజ్ పేయి, మీడియాను దోషిగా పేర్కొంది. నరసింహరావుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
 • 20 మే, 2010: బాబ్రీ విధ్వంసం కేసులో అడ్వాణీ, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
 • 26 జులై 2010: రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో వాదనలు పూర్తి.
 • 8 సెప్టెంబర్ 2010: కోర్టు అయోధ్య వివాదంలో సెప్టంబర్ 24న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది.
 • 17 సెప్టెంబర్ 2010: తీర్పును ఆపాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది..

ఫొటో సోర్స్, AFP

 • 30 సెప్టెంబర్ 2010: అయోధ్య వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్ట్ లక్నో ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. ఆ భూమిని మూడు భాగాలుగా విభజించింది.
 • 9 మే 2011: సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. విచారణ సమయంలో హైకోర్టు తీర్పు అమలు కాకుండా స్టే ఉంటుందని చెప్పింది. వివాదాస్పద స్థలంపై 1993 జనవరి 7 నాటి యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పింది.
 • 26 ఫిబ్రవరి 2016: రామ మందిర నిర్మాణం గురించి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 • 20 జులై 2016: బాబ్రీ మసీదు రామజన్మభూమి కేసులో వాది హషీమ్ అన్సారీ 96 ఏళ్ల వయసులో అయోధ్యలో మృతి చెందారు.
 • 21మార్చి 2017: అయోధ్య వివాదం కేసును పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జె.ఎస్.ఖెహర్ సూచించారు. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దీనిని చాలా మంది నేతలు స్వాగతించారు.
 • 07 ఆగస్టు 2017: సుప్రీంకోర్టు 1994లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఇస్మాయిల్ ఫారూఖీ తీర్పును సవాలు చేస్తు వచ్చిన పిటిషన్‌పై విచారణకు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఏర్పాటు చేసింది.
 • 08 ఆగస్టు 2017: యూపీ వక్ఫ్ బోర్డు అయోధ్య వివాదాస్పద భూమి నుంచి కాస్త దూరంలో ముస్లింలు ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టుకు చెప్పింది.
 • 11 సెప్టెంబర్ 2017: సుప్రీంకోర్టు అయోధ్య రామజన్మభూమిపై నిఘా కోసం 10 రోజుల లోపు ఇద్దరు జడ్జిల పర్యవేక్షకులను నియమించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది.
 • 20 నవంబర్ 2017: యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టుతో అయోధ్యలో మందిరం, లక్నోలో మసీదు నిర్మించవచ్చని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 01 డిసెంబర్ 2017: 32మంది కార్యకర్తలు అలాహాబాద్ హైకోర్టులో 2010 తీర్పును సవాలు చేస్తూ ఇంటర్వెన్షన్ అప్లికేషన్ ఇచ్చారు. కార్యకర్తల్లో అపర్ణా సేన్, శ్యామ్ బెనగల్, తీస్తా శీతల్వాద్, సుబ్రమణ్య స్వామి కూడా ఉన్నారు.
 • 08 ఫిబ్రవరి 2018: సుప్రీంకోర్టులో సివిల్ కేసులో విచారణలు ప్రారంభం
 • 14 మార్చి 2018: సుప్రీంకోర్టు స్వామిసహా అందరి మధ్యంతర పిటిషన్లను కొట్టివేసింది.
 • 06 ఏప్రిల్ 2018: 1994 తీర్పును పునఃపరిశీలించాలని ఈ కేసును ధర్మాసనానికి ఇవ్వాలని ముస్లిం పక్షాల తరపున సీనియర్ వకీలు రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 • 06 జులై 2018: కొన్ని ముస్లిం సంస్థలు 1994 తీర్పును పునఃపరిశీలించాలంటూ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

 • 13 జులై 2018: ఈ కేసులో జులై 20 నుంచి విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 • 20 జులై 2018: సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
 • 27 సెప్టంబర్ 2018: రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు సంబంధించిన 1994 నాటి తీర్పును పునఃపరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది. దానితోపాటు ఇస్మాయిల్ ఫారూఖీ కేసును రాజ్యాంగ ధర్మాసనం దగ్గరకు పంపడానికి కూడా అంగీకరించలేదు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)