అయోధ్య వాసులకు రామ మందిరం అంటే ఆసక్తి ఎందుకుండదు?

  • సమీరాత్మజ్ మిశ్రా
  • అయోధ్య నుంచి, బీబీసీ కోసం
బాబ్రీ

‘సర్, అయోధ్యలో ఏమైనా జరిగిందా? విరాట్ దీపోత్సవ్ కార్యక్రమానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కదా’... అయోధ్యలో ఓ హోటల్ రిసెప్షన్‌లో కుర్రాడు నన్ను అడిగిన ప్రశ్న ఇది.

అయోధ్యకు సంబంధించి బయటి ప్రాంతాల్లో ఉండే హడావుడి అక్కడి వాళ్లలో కనిపించదనడానికి ఆ ప్రశ్నే ఓ ఉదాహరణ.

అయోధ్యలో ఏవైనా సభలు జరిగినప్పుడు స్థానికులు అక్కడి పరిస్థితుల గురించి చర్చిస్తారు. ఇటీవల హిందూ నేత ప్రవీణ్ తొగాడియా కార్యక్రమం గురించి చాలామంది చర్చించారు. కానీ, అక్టోబర్ 29న సుప్రీంకోర్టులో అయోధ్య కేసుపై విచారణ మళ్లీ మొదలైందన్న విషయం మాత్రం చాలామంది స్థానికులకు తెలియదు.

తెలిసినవాళ్లు కూడా ఆ రోజు ఉదయం టీవీల్లో, పత్రికల్లో చూసి దాని గురించి తెలుసుకున్నామని చెప్పారు.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో అయోధ్యలోని మందిరం-మసీదు వివాదానికి సంబంధించిన కేసు విచారణ సోమవారం నుంచి మొదలైంది. కోర్టు ఆ విచారణను జనవరికి వాయిదా వేసింది.

ఆదివారం నుంచే మీడియా ప్రతినిధులు చాలామంది అయోధ్య చేరుకున్నారు. ప్రపంచంలోని అనేక మంది కళ్లు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, అయోధ్య వాసులు మాత్రం ఆ అంశం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు.

ఈ వివాదంలో బాబ్రీ మసీదు తరఫు ప్రతినిధి ఇక్బాల్ అన్సారీ మాట్లాడుతూ... ఈ వివాదం, దాని తాలూకు పర్యవసానాల వల్ల బయటివాళ్లే ఎక్కువ లాభపడతారు, స్థానికులు మాత్రం చాలా నష్టపోతారు అని చెప్పారు.

‘అయోధ్య వివాదానికి సంబంధించి ఏవైనా ఘటనలు జరిగినప్పుడు లేదా ప్రముఖులు వచ్చినప్పుడు... ఆ ప్రభావం స్థానికుల మీద బాగా పడుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. దుకాణాలు మూతబడతాయి. ప్రజల రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది’ అని అన్సారీ చెప్పారు.

అయోధ్యవాసులకు ఈ కేసు గురించి పెద్దగా ఆసక్తి లేదని, ఈ కేసు కారణంగా అక్కడి హిందూ ముస్లింల మధ్య ఎలాంటి వివాదాలూ లేవని ఆయన అంటారు. బయటినుంచి వచ్చిన వారి ప్రేరేపణల వల్ల అప్పుడప్పుడు కొందరు హిందూ-ముస్లింలు ఘర్షణ పడుతుంటారు. కానీ, సాధారణ హిందూ ముస్లింలు చాలా సామరస్యంగా ఉంటారని ఆయన తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

ఇక్బాల్ అన్సారీ

1992లో బాబ్రీ మసీదును ధ్వంసం చేశాక ఆ భూమిని మూడు భాగాలుగా విభజించి పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ, మూడు పక్షాలు... నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్ లీలా విరాజమాన్‌లు ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశాయి.

కేసు కోర్టులో ఉన్నప్పటికీ రాజకీయంగా ఈ వివాదం రాజుకుంటూనే ఉంటుంది. దాని వేడి అయోధ్య వాసులతో పోలిస్తే బయటివారికే ఎక్కువగా తగులుతోంది.

చాలామంది రాజకీయ నాయకులకు ఈ వివాదాన్ని పరిష్కరించే ఉద్దేశం ఉండదని, ఒకవేళ దీన్ని పరిష్కరిస్తే వాళ్లు మరో సమస్యను వెతుక్కోవాల్సి వస్తుందని సీనియర్ పాత్రికేయులు మహేంద్ర త్రిపాఠీ చెప్పారు.

అయోధ్య ఓ ధార్మిక నగరం కాబట్టి అక్కడ తరచూ వాతావరణం వేడెక్కడం సహజమని విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి శరద్ శర్మ చెప్పారు. కానీ, ‘ఎన్నికల సమయంలోనే అలా ఎందుకు జరుగుతుంది?’ అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.

మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, సుప్రీం కోర్టు తీర్పు లేదా ప్రభుత్వం ‘నిర్ణయాత్మక ముందడుగు’ వేసేదాకా ఎదురుచూస్తామని ఆయన చెప్పారు.

మరోపక్క మందిరం నిర్మాణం కోసం రాళ్లను తయారు చేస్తున్న వర్క్ షాప్ బయట ఓ కిల్లీ కొట్టును నడిపిస్తున్న మహిళ మాట్లాడుతూ, ఇక్కడ ఓ విషయం అందరికీ తెలుసనీ, కానీ బయటకు ఎవరూ చెప్పరనీ అన్నారు.

‘మందిరం నిర్మించడాన్ని ఎవరూ ఇష్టపడరు. బయటివాళ్లు రాజకీయం చేస్తారు. అక్కడ రామమందిరం నిర్మిస్తే తమ దేవాలయాల ప్రాముఖ్యత తగ్గిపోతుందని సాధువులు భయపడతారు’ అని ఆమె చెప్పారు.

ఆగ్రాకు అందరూ తాజ్‌మహల్ చూడ్డానికే వెళ్తారు. మిగతా ప్రాంతాలతో వాళ్లకు పనిలేదు. ఇక్కడ కూడా మందిరాన్ని నిర్మిస్తే అదే ప్రధాన ఆకర్షణగా మారిపోతుంది. మిగతా దేవాలయాలకు ఎవరూ రారు అని ఆమె అన్నారు.

కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావాలని కోరుతూ అక్టోబర్ 28న కొందరు యాగం చేశారు. ఆ కార్యక్రమానికి ముస్లిం సముదాయానికి చెందిన వాళ్లు కూడా కొందరు హాజరయ్యారు.

అయోధ్యలో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం స్వాతంత్ర్యం రావడానికి ముందు నుంచే ఉంది. కానీ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చేశాక, కేంద్ర ప్రభుత్వం ఆ చుట్టపక్కల 67ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకుంది. అందులో కోట్ రామ చంద్ర్, అవధ్ ఖాస్, జల్వాన్ పూర్ గ్రామాలకు చెందిన భూములున్నాయి.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లిం పక్షాలు కోర్టుకెళ్లాయి. కానీ కోర్టు ఆ కేసును కొట్టేసింది.

2010 సెప్టెంబర్ 20న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ వివాదంలో ప్రధానంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా చేసింది. వివాదాస్పద స్థలంలో ఉన్న మూడు గుమ్మటాల్లో మధ్య భాగం రామ్‌లీలా విరాజమాన్, మిగతా రెండు భాగాలు నిర్మోహి అఖాడా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు చెందుతాయని చెప్పింది.

కానీ, ఆ తీర్పును మూడు పక్షాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2011లో మేలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేసింది. అక్కడ యథాతథ స్థితి కొనసాగాలని చెప్పింది. ఈ కేసుపైనే మళ్లీ సెప్టెంబరు 29న విచారణ మొదలైంది.

విచారణతో నిమిత్తం లేకుండా గత నెలరోజులుగా క్రమంగా అయోధ్యలో వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వం తలపెట్టనున్న విరాట్ దీపోత్సవ్ కార్యక్రమంతో పాటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాక కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటే... స్థానికులు మాత్రం ఆ విషయంలో పెద్దగా నమ్మకంగా లేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)