లయన్ ఎయిర్ ప్రమాదం: సరికొత్త విమానం ఎందుకు కూలిపోయింది?

బోయింగ్ విమానం

ఇండోనేసియాలో 189 మందితో వెళ్తున్న విమానం సోమవారం సముద్రంలో కూలిపోయింది. దేశ రాజధాని జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే లయన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కుప్పకూలింది.

నిజానికి అది చాలా కొత్త విమానం. ఆ మోడల్ విమానం ఇంత పెద్ద ప్రమాదానికి గురికావడం కూడా ఇదే తొలిసారి. అది ఎందుకు కూలిందనే దానిపైన ఇంకా స్పష్టమైన వివరాలు తెలీలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ విమానం కొత్తది కావడం కూడా ప్రమాదానికి కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వీడియో క్యాప్షన్,

వీడియో: విమానానికి చెందిన వస్తువులు సముద్రం నీటిపై కనిపించాయి

బోయింగ్ 737 మాక్స్ 8 సిరీస్ విమానాలు 2017 నుంచే మానవ రవాణాకు వినియోగంలో ఉన్నాయి.

ఈ విమానాన్ని తొలిసారిగా దేశంలో ప్రవేశపెట్టడం తమకు గర్వకారణమని, 218 యూనిట్లకు ఆర్డర్ ఇచ్చామని లయన్ ఎయిర్ సంస్థ గతంలో తెలిపింది.

సోమవారం ప్రమాదానికి గురైన విమానం ఆగస్టు 15 నుంచే వినియోగంలో ఉంది. ఇప్పటిదాకా 800 గంటలు మాత్రమే ఇది ప్రయాణించిందని ఆ దేశ రవాణా భద్రత కమిషన్ హెడ్ సొర్జాంటో జాజానో తెలిపారు.

టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమాన కెప్టెన్ రేడియోలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల్ని సంప్రదించారని, తిరిగి వెనక్కి రావడానికి అనుమతి ఇవ్వమని కోరారని తెలుస్తోంది.

ఇంతకు ముందు ప్రయాణంలోనే ఆ విమానంలో ‘సాంకేతిక లోపం’ తలెత్తిందని, కానీ పద్ధతి ప్రకారం ఆ సమస్యను పరిష్కరించామని లయన్ ఎయిర్ సీఈవో చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.

లయన్ ఎయిర్ ప్రస్తుతం అదే మోడల్‌కు చెందిన 11 విమానాలను నడిపిస్తోందని, మిగతావాటి వినియోగాన్ని ఆపేసే ఆలోచన తమకు లేదని లయన్ ఎయిర్ సీఈవో చెప్పారు.

‘నిజానికి చాలా పాత విమానాలకే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, మరీ కొత్త వాటిలో కూడా ఆ అవకాశం ఉంది’ అని విమానయాన విశ్లేషకుడు జెర్రీ సోజట్‌మాన్ చెప్పారు.

కొత్త విమానాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే, వాటిని వినియోగించడం మొదలుపెట్టాకే అవి బయటపడతాయని, సాధారణంగా తొలి మూడు నెలల్లోనే అవి పరిష్కృతమవుతాయని ఆయన అన్నారు. కానీ, ప్రమాదానికి గురైన విమానం వినియోగంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కాలేదు.

‘‘కొత్త విమానాలకు ‘మెయిన్‌టెన్స్ హాలిడే’ ఉంటుంది, అందులో అన్నీ కొత్త విడి భాగాలే ఉంటాయి కదా’’ అని ఆస్ట్రోవిర్ అనే మరో విశ్లేషకుడు తెలిపారు. కొత్తల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, కానీ అవి విమాన భద్రతను ప్రమాదంలో పడేసే స్థాయిలో ఉండవని ఆయన అన్నారు.

ప్రమాదానికి గురైన విమానంలో సమస్య ఎక్కడుందో అంత త్వరగా అంచనా వేయడం సరికాదని వారిద్దరూ అన్నారు.

‘అది సాంకేతిక సమస్యే కావొచ్చు. కానీ, మరింత సమాచారం సేకరించాకే విషయం రూఢీ అవుతుంది’ అని వాళ్లు చెప్పారు.

తమ సంస్థ చరిత్రలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న విమానాలు 737 మాక్స్ సిరీస్‌వేనని, దాదాపు 4,700 ఆర్డర్లను తాము అందుకున్నామని బోయింగ్ సంస్థ చెబుతోంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటడ్ ఎయిర్‌లైన్స్, ఫ్లై దుబాయి లాంటి సంస్థలు కూడా మాక్స్ 8 విమానాలకు ఆర్డరిచ్చాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)