తెలంగాణ ఎన్నికలు: వేడెక్కిన వేదికలు... ఆన్‌లైన్ సమరాలు

తెలంగాణ మ్యాప్

ఫొటో సోర్స్, Telangana.gov.in

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. రాజకీయంగా, సాంస్కృతికంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకున్న ప్రజల కల సిద్ధించింది.

అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నేతృత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పాటై కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

3.5 కోట్ల జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్న తెలంగాణ ఇప్పుడు రెండవ దఫా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో అనివార్యమైన ఈ ముందస్తు ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిని రాజేశాయి.

జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌... ఉమ్మడి రాష్ట్రం కాలం నాటి నుంచి ఉన్న తెలుగుదేశం(టీడీపీ), తెలంగాణ రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎంతో పాటు కొత్త పార్టీ తెలంగాణ జన సమితి ఓటరు తీర్పును కోరుతూ ఎన్నికల సమరాంగణంలో నిలుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం తెలంగాణలో 2,73,18,603 మంది ఓటర్లు ఉండగా వారి మనసు గెలుచుకోవడానికి అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. పాలక పార్టీ తమ పథకాలతో కలిగిన లబ్ధిని ప్రచారం చేసుకుంటుంగా.. పాలక పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ మిగతా పార్టీలూ జనంలోకి వెళ్తున్నాయి.

మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి ఎన్నికల సంగ్రామం ఆన్‌లైన్ వేదికలపైనా భీకరంగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్, యూట్యూబ్‌ వేదికగా అన్ని పార్టీలూ ఓటరును చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల మొబైల్ ఫోన్లకు తాకిడి పెరిగింది.

నేతల ప్రత్యక్ష ప్రచారం, పార్టీల సోషల్‌మీడియా సైన్యాల ఆన్‌లైన్ ప్రచారం అన్నిటినీ అవలోకిస్తూ తెలంగాణ ఓటరు తన తీర్పును గుండెల్లో గుంభనంగా దాచుకుని ఓటేసే రోజైన డిసెంబరు 7 కోసం ఎదురుచూస్తున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

తొలి ఎన్నికల్లో..

119 నియోజకవర్గాలున్న తెలంగాణ అసెంబ్లీలో 2014లో టీఆర్‌ఎస్ 63 సీట్లు సాధించగా, కాంగ్రెస్ పార్టీ 21, టీడీపీ 15, ఏఐఎంఐఎం 7, బీజేపీ 5, వైసీపీ 3, బీఎస్పీ 2, వామపక్షాలు 2 స్థానాలు గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో పార్టీల బలాబలాలూ మారాయి.

ఈసారి..

మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న ఎన్నికల అసలు ప్రక్రియ కోసం అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ విడుదల: నవంబరు 12, 2018

నామినేషన్ల ఘట్టం: నవంబరు 12 నుంచి 19 వరకు

ఉపసంహరణ గడువు: నవంబరు 22

పోలింగ్: డిసెంబరు 7

ఫలితాలు: డిసెంబరు 11, 2018

పార్టీల సన్నద్ధత

పాలక టీఆర్‌ఎస్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తొలి విడతగా 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. జాతీయ పార్టీ బీజేపీ కూడా ఇప్పటికే తొలి జాబితాలో 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అయితే, ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు, వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నవారు ప్రజాక్షేత్రంలో తమ ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఓటరు బలం

మొత్తం ఓటర్లు: 2,73,18,603

పురుషులు: 1,37,87,920

మహిళలు: 1,35,28,020

గత ఎన్నికల తరువాత ఈసారి కొత్తగా 11.81 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోగా అందులో 6.61 లక్షల మంది మహిళలే.

పది జిల్లాల్లో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడంతో అక్కడ మహిళలే నిర్ణేతలు కానున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)