‘తెలంగాణ ఎన్నికల్లో ఏపీ పోలీసులు వద్దు’ - ప్రెస్ రివ్యూ

పెరేడ్ చేస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకోకూడదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఆంధ్రా పోలీసులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగటానికి అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసులను బందోబస్తుకు నియమించడం సాధారణంగా జరిగేదే.

కానీ జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొన్ని రోజుల క్రితం ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనను సీరియ్‌స్‌గా తీసుకున్న ఈసీ తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం, ఓటర్లను ప్రలోభపెట్టడంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు.

''70 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి బలగాలను రప్పిస్తామని, ఏపీ పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించం'' అని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ విలేఖరుల సమావేశంలో మాట్లాడినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

‘వారిపై నమ్మకం లేదు’

జగన్‌పై జరిగిన దాడిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైసీపీ కోరిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

సోమవారం ఉదయం వైసీపీ బృందం రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసింది. 40 నిమిషాలకు పైగా వైసీపీ నేతలు హోం మంత్రితో భేటీ అయ్యారు.

అనంతరం వారు విలేఖరులతో మాట్లాడారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఘటన చోటు చేసుకున్న ప్రాంతం సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలో ఉందని, తమకు సంబంధం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినందున కేంద్ర ప్రభుత్వమే విచారణ చేయించాలని కోరామన్నారు.

వైసీపీ నేతలు మాట్లాడుతూ..

‘‘ఘటనలో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, డీజీపీ, ఉన్నత స్థాయి వ్యక్తులు భాగస్వాములుగా తాము అనుమానిస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. డీజీపీ ఘటన జరిగిన గంటలోపే ప్రచారం, సానుభూతి కోసం చేశారని ప్రకటించినందున వారిపై నమ్మకం లేదని, ఏపీ పోలీసులు లేకుండా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశాం’’ అన్నారు.

అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని, మంత్రి హామీ ఇచ్చినట్లు ఈనాడు దినపత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ అడవి వారిదే..!

మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు మన్యం విడిచి వెళ్లాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టులు బ్యానర్లు కట్టారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

పాడేరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఈ బ్యానర్లు కట్టి, కరపత్రాలను విడిచిపెట్టారు. ఆదివాసీ గిరిజనులను నాశనం చేసేందుకు అధికార పార్టీ నేతలు పూనుకుంటున్నారని వాటిలో పేర్కొన్నారు.

అడవిపై సర్వాధికారం ఆదివాసులదేనని, జీకే వీధి కాఫీ తోటలు ఆదివాసీలకే చెందుతాయని, కాఫీ తోటల జోలికి వస్తే సహించేది లేదని వాటిలో పేర్కొన్నారు.

1/70 చట్టం ప్రకారం ఆదివాసీ గిరిజనులకు కాఫీ తోటలు చెందుతాయని, కాఫీతోటలు వదిలి ఏపీఎఫ్‌డీసీ అధికారులు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని బ్యానర్లు, కరపత్రాల్లో పేర్కొన్నట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

హైటెక్ పోలీసింగ్

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఏపీ పోలీస్‌ 'హైటెక్‌'గా అవతరిస్తోంది. లాఠీలకు స్వస్తి చెప్పి టెక్నాలజీని సమకూర్చుకుంటోంది. పాత పోలీసింగ్‌ నుంచి అమెరికా స్థాయి పోలీసు వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది.

ఆందోళనకారులపై 'డ్రోన్లు' ప్రయోగించనుంది. వాదించే వారిని సైతం గౌరవిస్తూనే, యూనిఫామ్‌కు అమర్చే కెమెరాలతో బుక్‌ చేయబోతోంది. థర్డ్‌ డిగ్రీల స్థానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది.

రాష్ట్రంలోని పోలీసు వాహనాల కోసం 50 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, దీంతో 500 వాహనాలు కొనుగోలు చేసి వాటిలో అధునాతన పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసే ఆందోళనకారులను సాక్ష్యాధారాలతో సహా గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నారు. మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలు, ఏజెన్సీలో గంజాయి సాగుపైనా డ్రోన్ల ద్వారా కన్నేస్తారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)