తెలంగాణ ఎన్నికలు: ఇందిరాగాంధీ అప్పట్లో మెదక్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
- ప్రవీణ్ కాసం
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, JAIPALREDDY
''నా సొంత ప్రాంతమైన రాయ్‌బరేలీలో ఏడు వేల మెజార్టీనే తెచ్చుకున్నా, మెదక్ వాసులు మాత్రం నన్ను రెండు లక్షల మెజార్టీతో గెలిపించారు. ఇకపై వాళ్ల తరఫునే లోక్‌సభలో అడుగుపెడతా. రాయ్‌బరేలీ సీటు వదులుకుంటా'' 1980 లోక్‌సభ ఎన్నికల విజయం అనంతరం రాయబరేలీ కాంగ్రెస్ కార్యకర్తలతో ఇందిరా గాంధీ చెప్పిన మాటలివి. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ఆమె పక్కనే ఉన్నారు. మెదక్‌లో ఇందిర తరఫున ఆయనే ప్రచార బాధ్యతలు నిర్వహించారు.
కంచుకోటలో ఓటమి
గాంధీ కుటుంబానికి అచ్చొచ్చిన రాయబరేలీతో పాటు మరో చోట నుంచి కూడా పోటీ చేయాలని 1980 ఎన్నికల్లో ఇందిర ఎందుకు అనుకున్నారు? మెదక్‌నే ఆమె ఎందుకు ఎంచుకున్నారు?
ఆరవ లోక్‌సభ (1977-1980) ఎన్నికల్లో రాయబరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర, జనతా కూటమి అభ్యర్థి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు.
భారత దేశ ఉక్కు మహిళగా పేరుతెచ్చుకున్న ఇందిరాగాంధీ ప్రధానిగా ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, అత్యయికస్థితి విధించిన అనంతరం ఆమె ప్రతిష్ఠ దెబ్బతిన్నది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో (1977) కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఇందిర కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తొలిసారి జనతా పార్టీ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఎంతో కాలం కొనసాగలేదు.
1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాయ్‌బరేలీతో పాటు మరో సురక్షిత ప్రాంతం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం ఇందిరకు సూచించింది.
ఉత్తరాదిన జనతా పార్టీ ప్రభావం బాగా కనిపిస్తుండటంతో దక్షిణాదిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఇందిరతో పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఇతర ముఖ్యనేతలు మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరకు సూచించారు. వారి సూచనను అంగీకరించిన ఇందిర మెదక్ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్నారు.
ఫొటో సోర్స్, JAIPALREDDY
కాంగ్రెస్ నేత బాగారెడ్డి ఇందిర తరఫున మెదక్ ప్రచార బాధ్యతలను నిర్వహించారు
ఇందిర ప్రచారం కోసం మంత్రి పదవికి బాగారెడ్డి రాజీనామా
మెదక్ లోక్‌సభ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చిన ఇందిర ప్రచారంలో మాత్రం పాల్గొనలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను ఇందిరకు నమ్మకస్తుడిగా పేరున్న బాగారెడ్డికి అప్పగించింది.
''మెదక్‌తో నాన్నకు మంచి పరిచయాలున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇందిర తరఫున ప్రచారం చేయడం కోసం మంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నైతికంగా సరికాదని ఆ పనిచేశారు. ఇందిర తరఫున నియోజకవర్గ ప్రచారం ఆయనే చూసుకున్నారు'' అని బాగా రెడ్డి తనయుడు మోగిలిగుండ్ల జైపాల్ రెడ్డి నాటి సంఘటనలను బీబీసీతో పంచుకున్నారు.
ఫొటో సోర్స్, jaipallreddy/facebook
1980 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఇందిరపై పోటీచేసిన జైపాల్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు
ఇందిరకు పోటీగా ఎస్. జైపాల్‌రెడ్డి, ‘గణిత మేధావి’ శకుంతలా దేవి
ఇందిరాగాంధీ పోటీ చేయనున్నారని తెలియగానే అందరి దృష్టి మెదక్‌పై పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్.జైపాల్ రెడ్డి ఆ ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున ఇందిరకు పోటీగా నిలబడ్డారు.
గణిత మేధావి, మానవ కంప్యూటర్‌గా పేరున్న శకుంతలా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా మెదక్ నుంచే బరిలో దిగారు.
పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్ తదితరులు కూడా ఇందిరపై పోటీకి దిగారు.
మొత్తంగా 10 మంది అభ్యర్థులు మెదక్ ఎన్నికల బరిలో నిలిచారు.
ఆ ఎన్నికల్లో మెదక్ ప్రజలు ఇందిరకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 2 లక్షల పైచిలుకు మెజార్టీని కట్టబెట్టారు.
ఇందిరకు ఈ ఎన్నికల్లో ఇందిరకు 3,01,577 ఓట్లు రాగా, జైపాల్ రెడ్డికి 82,453 ఓట్లు వచ్చాయి. కేశవ్‌రావుజాదవ్‌కు 26,149 ఓట్లు పడ్డాయి. శకుంతలాదేవి 6,514 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు.
ఫొటో సోర్స్, JAIPALREDDY
మెదక్‌లో గెలుపు అనంతరం అక్కడి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఇందిర పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు
తెలంగాణలో 15కు 15 సీట్లు కాంగ్రెస్‌కే...
1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 లోకసభ స్థానాల్లో పోటీ చేస్తే 41 స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఒక్క పార్వతీపురం నియోజవర్గం మాత్రం కాంగ్రెస్ (యూ)కు దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి కిషోర్ చంద్రదేవ్ గెలుపొందారు.
తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లను కాంగ్రెస్ చేజిక్కించుకుంది.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ఇందిర సిద్ధమయ్యారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఆమె మెదక్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఇందిర హయాంలోని మెదక్ జిల్లాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రారంభమైంది. అల్విన్- మహేంద్ర లోకోమోటివ్ కేంద్రం పూర్తయింది.
ఫొటో సోర్స్, Getty Images
'సీతాఫలాలు తిందాం రండి'
ఇందిరాగాంధీ బాగా తన తండ్రి పట్ల ఎంతో అభిమానం చూపేవారని బాగా రెడ్డి తనయుడు ఎం.జైపాల్ రెడ్డి తెలిపారు.
''ఇందిరాగాంధీకి సీతాఫలాలు అంటే చాలా ఇష్టమమని నాన్న చెప్పేవారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆమె కోసం ప్రత్యేకంగా సీతాఫలాలు తీసుకెళ్లేవారు. ఇందిర వాటిని అందరితో పంచుకొని తినేవారని నాన్నగారు చెప్పేవారు'' అని జైపాల్ రెడ్డి తెలిపారు.
ఇందిర తర్వాత ఈ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి.మాణిక్ రెడ్డి గెలుపొందారు. అయితే, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బాగారెడ్డి విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)