సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం

  • డాక్టర్. దేవాంశు పండిట్
  • బీబీసీ కోసం
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గుజరాత్‌లో నర్మదా నదీ తీరంలో నిర్మించిన సర్దార్ పటేల్ భారీ విగ్రహం

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తున్నారు.

గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 3,000 కోట్లు.

"స్టాట్యూ ఆఫ్ యూనిటీ" ఒక ప్రధాన పర్యటక ఆకర్షణగా నిలుస్తుందని మోదీ అన్నారు. స్థానికులు కొందరు మాత్రం ఇది ప్రజాధన దుర్వినియోగమేనని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద మొత్తాన్ని మరేదైనా ఉపయోగకర కార్యక్రమాలకు ఖర్చు చేస్తే బాగుండేదని విమర్శకులు అంటున్నారు.

ఈ విగ్రహావిష్కరణ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత మోదీ మాట్లాడుతూ, "ఇది భారతదేశ సమైక్యతకు చిహ్నం" అని అన్నారు.

భారతీయ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించిన ఈ భారీ విగ్రం మీద వైమానిక దళ విమానాలు పూల వర్షం కురిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఇంజినీరింగ్ అద్భుతం

ఇంత ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించడం వెనుక ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు, మెళకువలు దాగున్నాయి.

ముందుగా విగ్రహం పీఠం(అడుగు భాగం) నుంచి మొదలుపెడదాం.

మొత్తం విగ్రహం ఎత్తు 182 మీటర్లయినా, అందులో పీఠం ఎత్తే 25 మీటర్లు. అమెరికాలోని స్టాట్ట్యూ ఆఫ్ లిబర్టీతో పోలిస్తే ఈ విగ్రహం రెండింతలు ఎత్తైనది.

వీడియో క్యాప్షన్,

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మాణం వెనకున్న విశేషాలను ఈ వీడియోలో చూడండి

ఈ మొత్తం పని కాంట్రాక్ట్ విలువ రూ.2,332కోట్లు అయినా, నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3వేల కోట్లు ఖర్చయ్యాయి. 42 నెలల సమయం పట్టింది.

2012-13లో ఈ ప్రాజెక్టు మొదలైంది. 2012 ఆగస్టులో ప్రాజెక్టు నిర్వహణ కోసం ‘టర్నర్ కన్సల్టెంట్‌’ను ఎంపిక చేశారు. దుబాయ్‌లోని ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా ప్రాజెక్టు నిర్వహణ కూడా ఈ సంస్థే చేపట్టింది. కాంట్రాక్టర్‌ను నియమించడం, ప్రాజెక్టు రోజువారీ పనులను, నాణ్యతను పరీక్షించడం, భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడటం లాంటి అన్ని నిర్వహణ బాధ్యతలు ఆ కన్సల్టెన్సీపైనే ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన కాంట్రాక్టర్ - ఎల్&టీ

2014లో ఎల్&టీ సంస్థకు ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ(ఈపీసీ) బాధ్యతలు అప్పగించారు. ఈపీసీ కాంట్రాక్టులో ఒకే సంస్థ డిజైనింగ్‌తో పాటు మిగతా అన్ని బాధ్యతలూ చూసుకోవాలి. ఎల్&టీ విగ్రహ డిజైనింగ్‌ను తన సొంత సిబ్బందితో పాటు బెగేట్ అనే సంస్థ సాయంతో పూర్తి చేసింది. మొత్తం నిర్మాణ రూపకల్పనను అరూప్ ఇండియా అనే సంస్థ సాయంతో పూర్తి చేసింది.

విగ్రహ డిజైన్‌ను పరీక్షించే బాధ్యతను ఏజీస్ ఇండియా, టాటా కన్సల్టెంట్స్ అండ్ ఇంజినీర్స్‌కు అప్పగించారు. దీన్ని ప్రూఫ్ కన్సల్టెన్సీ అని పిలుస్తారు. డిజైనింగ్ వెనుకున్న మౌలిక వ్యూహం, విగ్రహం దిమ్మె కోసం ఉపయోగించే దూలం పరిమాణం లాంటి అంశాలను ప్రూఫ్ కన్సల్టెంట్లు చూసి ఆమోదిస్తారు.

అమెరికాకు చెందిన ‘మైఖేల్ గ్రేవ్స్’, ‘మిన్హార్డ్’ సంస్థలు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరీక్షించాయి. వీటికి తోడు మరో 30 కన్సెల్టెన్సీ సంస్థలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయి.

రెండు భాగాలుగా పని

స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ పనులు ప్రధానంగా రెండు భాగాలుగా సాగాయి. ఒకటి... పునాదులు వేయడం, రెండోది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. మొదట పునాదులు ఏర్పాటు చేసి, మెజానిన్ ఫ్లోర్‌ (రెండు అంతస్తుల మధ్య ఎత్తు తక్కువగా ఉండే మరో అంతస్తు)ను నిర్మించారు. ఆ తరువాత మధ్య భాగం నిర్మించి దాని అంచున నిలబడి చూసేందుకు గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో 200 మంది నిలబడి చూసే వీలుంది.

అంత పెద్ద విగ్రహాన్ని నిర్మించే ముందు ప్రధానంగా దాని బరువు, గాలులను తట్టుకునే శక్తి, భూకంపాలు, వరదలు, ఈదురుగాలుల ప్రభావం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ మొత్తం బరువు 67వేల మెట్రిక్ టన్నులు. అది భూకంపం కంటే బలమైన గాలుల ప్రభావానికే లోనయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

అందుకే సాధారణంగా పరిగణనలోకి తీసుకునే గాలుల సామర్థ్యం కంటే ఎక్కువ బలమైన గాలులను సైతం తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని నిర్మించారు.

భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని జోన్‌ 3లో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. కానీ, జోన్ 4లో తలెత్తే భూకంపాలను సైతం దృష్టిలో పెట్టుకొని దీని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే, భారీ భూకంపాలను సైతం తట్టుకొని నిలబడే విధంగా దీని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

జియో-సాంకేతిక సర్వేలకు తోడు ఈ విగ్రహ నిర్మాణానికి కావల్సిన సర్వే కోసం ‘లేడార్’ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన ప్రాంతంలో ప్రధానంగా క్వార్ట్జ్, మైకా, ఇతర పదార్థాలు కలగలిసిన రాళ్లున్నాయి. దగ్గర్లోనే సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది. కాబట్టి, పునాదుల కోసం తవ్వకాలు జరిపే సమయంలో మరింత జాగ్రత్తగా పేలుళ్లు జరిపారు.

ఫొటో సోర్స్, Getty Images

15 అంతస్తుల లోతులో పునాదులు

స్టాట్యూ ఆఫ్ యూనిటీ పునాదులు 45మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే, భూమి పూజ చేయడానికి కనీసం 15అంతస్తులు కిందకు దిగాలి. తవ్వకాలు పూర్తయ్యాక నీటితో లోపలంతా శుభ్రం చేసి కాంక్రీటు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. నదిలో నుంచి వచ్చే నీటి ప్రవాహం ఆ కాంక్రీటును తుడిచిపెట్టేయకుండా ఏర్పాట్లు చేశారు.

నదీ తీరంలో ఉంది కాబట్టి ఈదురు గాలుల ప్రమాదం విగ్రహానికి పొంచి ఉంటుంది. విగ్రహానికి 90డిగ్రీల కోణంలో బలమైన గాలులు వీస్తే, మొదళ్ల నుంచి దాన్ని పెకిలించే ప్రమాదం ఉంటుంది. అందుకే గాలుల్ని తట్టుకునేలా డిజైన్ చేయడం చాలా కీలకం. ప్రపంచ ప్రఖ్యాత ‘ఆర్‌డబ్ల్యూఐడీ’ సంస్థ ఆ బాధ్యతను తీసుకుంది. ఆ సంస్థ విగ్రహ నమూనా ఏరో ఎలాస్టిసిటీని పరీక్షించి అవసరమైన సూచనలను చేసింది. సెకనుకు 60మీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా విగ్రహాన్ని రూపొందించారు.

అంతే ఎత్తయిన ఇతర నిర్మాణాలతో పోలిస్తే, మనిషి విగ్రహాలను రూపొందించడం చాలా కష్టం. ఛాతీ భాగం వెడల్పుగా, కాళ్ల భాగం చిన్నగా ఉండటమే దానికి కారణం. పటేల్ విగ్రహ తయారీలో అలాంటి సవాళ్లే ఎదురయ్యాయి.

విగ్రహం ప్రధాన భాగం కోసం అండాకృతిలో ఉండే రెండు భారీ గోడల్ని(కోర్ వాల్స్) నిర్మించారు. ఒక్కో గోడ ఎత్తు 152 మీటర్లు. విగ్రహానికి ఉండే కాళ్లనే ఓ రకంగా పునాదుల్లా వాడుకున్నారు. ఎత్తయిన భవంతుల్ని నిర్మించేందుకు ఈ కోర్ వాల్ టెక్నాలజీనే ఉపయోగిస్తారు. ఈ విగ్రహానికి ఉపయోగించిన కోర్ వాల్ వెడల్పు 850మి.మీ.తో మొదలై చివరికి 450మి.మీ. దగ్గర ఆగుతుంది.

విగ్రహానికి ఉపయోగించే కంచు దిమ్మల బరువు కోర్ వాల్స్‌పైన పడేలా ‘స్పేస్ ఫ్రేమ్‌’ను రూపొందించారు. చివరికి ఆ బరువంతా పునాదులపై పడేలా రూపకల్పన చేశారు.

అంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు జీవన కాలం కనీసం వందేళ్లు ఉండాలి. దానికి తగ్గట్టుగానే సాధారణ కాంక్రీటుకు బదులుగా అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన నాణ్యమైన కాంక్రీటును ఉపయోగించారు. సాధారణ కాంక్రీటు వాడితే 10-15ఏళ్లలో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ప్రపంచంలో 400-500ఏళ్లుగా ఉన్న విగ్రహాల్లో కాంక్రీటు, స్టీలును ఉపయోగించలేదు. ఈ ప్రాజెక్టు కోసం 22,500 మెట్రిక్ టన్నుల సిమెంటు, 5,700 మెట్రిక్ టన్నుల స్టీలు, 18,500 టన్నుల ఇనుప రాడ్లను ఉపయోగించారని అంచనా. స్టీలును వినియోగించడం వల్ల అది తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. దాని చుట్టూ నాణ్యమైన కాంక్రీటును వాడితే, ఆ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది. తుప్పు పట్టిన రాడ్లు ఎంత మంచి కాంక్రీటునైనా పగలగొడతాయి. అందుకే స్టాట్యూ ఆఫ్ యూనిటీ కోసం ఎం65 గ్రేడ్ కాంక్రీటును ఉపయోగించారు.

ఎం65 అంటే 65 మెగా పాస్కల్ శక్తి ఉన్న కాంక్రీటు; సాధారణ భవనాల నిర్మాణం కోసం ఎం20 గ్రేడ్ కాంక్రీటును ఉపయోగిస్తారు.

చైనాలో తయారైన ప్యానెళ్లు

1850 టన్నుల బరువున్న దాదాపు 1250 కంచు ప్యానెళ్లను ఉపయోగించి విగ్రహానికి రూపు తీసుకొచ్చారు. ఈ ప్యానెళ్లను చైనాలో తయారు చేశారు. ఆ కారణంగానే రాజకీయంగానూ దానిపైన విమర్శలు ఎదురయ్యాయి.

బయటకు ఏ మాత్రం కనిపించకుండా ఈ ప్యానెళ్లను విగ్రహానికి చెందిన ప్రధాన ఫ్రేమ్‌కు అమర్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎల్&టీ సాధించిన మరో ఘనతగా దీన్ని చెప్పుకోవచ్చు.

మొత్తమ్మీద అత్యంత ఎత్తయిన ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు, ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్, డిజైనింగ్ మెదళ్లను ఉపయోగించారు. ఇది అందంగా, దృఢంగా, మన్నికగా ఉండేందకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.

ఇది పర్యటకులకు ప్రధాన ఆకర్షణగా మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్, డిజైనింగ్ నిపుణులకు పాఠంగానూ నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)