మాలేగావ్ పేలుళ్ల కేసు: పురోహిత్, సాధ్వి ప్రగ్యాలపై అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు

ఫొటో సోర్స్, PTI
ప్రసాద్ పురోహిత్
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్లపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేసింది.
వారితో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిలపై భయోత్పాతం సృష్టించాలన్న కుట్ర, హత్య, ఇతర అభియోగాలను నమోదు చేశారు.
తర్వాత విచారణ తేదీని నవంబర్ 2కు వాయిదా వేశారు.
దీనికి ముందు సోమవారం బాంబే హైకోర్టు నిందితులపై ఉన్న అభియోగాలను ఎత్తివేయడానికి నిరాకరించింది. అయితే తనను యూఏపీఏ చట్టం కింద విచారించడాన్ని సవాలు చేస్తూ పురోహిత్ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి అంగీకరించింది.
గత ఏడాది డిసెంబర్ 27న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పురోహిత్, ప్రగ్య తదితరులు తమపై అభియోగాలను కొట్టేయాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసింది.
ఫొటో సోర్స్, Reuters
కల్నల్ పురోహిత్ ఎవరు?
మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల్లో ఒకరైన కల్నల్ ప్రసాద్ పురోహిత్ మొదట మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో చేరారు. అరెస్ట్ అయినపుడు ఆయన సైన్యంలోని మిలటరీ ఇంటలిజెన్స్‌లో పని చేసేవారు.
ఈ కేసులో దాఖలు చేసిన మొదటి ఛార్జ్ షీట్ ప్రకారం, కల్నల్ పురోహిత్ 2007లో 'అభినవ్ భారత్' పేరిట 'ప్రత్యేక హిందూ దేశం' నిర్మాణం కోసం ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక కాషాయ జెండా కలిగిన సంస్థను ఏర్పాటు చేశారు.
'అభినవ్ భారత్'కు చెందిన వారు ఫరీదాబాద్, కోల్‌కతా, భోపాల్, జబల్పూర్, ఇండోర్, నాసిక్‌లలో సమావేశాలు నిర్వహించి, పేలుళ్లకు కుట్ర పన్నారని ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) ఆరోపించింది.
ఇంతకూ ఈ కేసు ఏమిటి?
2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని భీకు చౌక్, అంజుమన్ చౌక్ల వద్ద బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించగా, 101 మంది గాయపడ్డారు.
రంజాన్ మాసంలో జరిగిన ఈ పేలుళ్లపై మొదట ఏటీఎస్ విచారణ చేపట్టింది.
2009 జనవరి 20న ఏటీఎస్ అరెస్ట్ చేసిన 11 మంది, పరారీలో ఉన్న మరో ముగ్గురిపై మొదటి చార్జిషీటు దాఖలు చేసింది.
నిందితులు తమపై ఎంసీఓసీఏ చట్టం కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.
జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) 2016లో దాఖలు చేసిన ఛార్జిషీటులో ఎంసీఓసీఏ కింద నమోదు చేసిన అభియోగాలను తొలగించారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను మెల్లగా కొనసాగించాలంటూ ఎన్ఐఏ తనపై వత్తిడి తెచ్చిందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియా 2015లో రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)