సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ: 90 మంది నిరసనకారుల నిర్బంధం?

గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది.
అయితే, ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రోడ్లమీదికొచ్చి నిరసనలు తెలిపారు. ప్రధాని మోదీ పోస్టర్లను చించివేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు 90 మందిని పోలీసులు నిర్బంధించారని ఆదివాసీ కార్యకర్తలు బీబీసీకి చెప్పారు. వాళ్లను ఎక్కడ ఉంచారో కూడా తమకు సమాచారం లేదన్నారు.
182 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో కెవాడియా వద్ద నిర్మించారు. ఈ విగ్రహం నిర్మాణాన్ని స్థానిక ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు.
అయితే, ఎవరినీ అరెస్టు చేయలేదని నర్మదా జిల్లా కలెక్టర్ ఆర్.ఎస్.నినామా బీబీసీకి తెలిపారు.
విగ్రహం ఆవిష్కకరణ కార్యక్రమం పోస్టర్‌ను నిరసనకారులు చించివేశారు
పోలీసుల నిర్బంధంలో ఎంతమంది ఉన్నారు?
'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' సమీప ప్రాంతాలకు చెందిన దాదాపు 90 మందిని పోలీసులు నిర్బంధించారని ఆదివాసీ నేత ఆనంద్ మజ్గాంకర్ ఆరోపించారు. "వాళ్లందరినీ పోలీసులు నిర్బంధించారు. వాళ్లను ఎక్కడ ఉంచారన్న సమాచారం కూడా మాకు చెప్పడంలేదు" అని ఆయన అన్నారు.
తమ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురిని నిర్బంధించామని అమ్లెతా పోలీసు స్టేషన్ ఎస్ఐ యంఎ పార్మర్ బీబీసీకి చెప్పారు. "విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లు నిరసన చేయనున్నారని మాకు సమాచారం అందింది. అందుకే వాళ్లను నిర్బంధించాం" అని ఆయన తెలిపారు.
మరోవైపు, పటేల్ విగ్రహం ఆవిష్కరణను వ్యతిరేకిస్తున్న సంఘాలకు చెందిన 16 మంది కార్యకర్తలను నిర్బంధించామని దెడియాపాద పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ నారన్ వాసవ బీబీసీకి చెప్పారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ స్థానిక ఆదివాసీ సంఘాలు అక్టోబరు 31న బంద్‌కు పిలుపునిచ్చాయి. అంబాజీ, ఉమర్గామ్ ప్రాంతాల్లోని పలు గ్రామాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నల్లు తెలుస్తోంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఎలా నిర్మించారు?
నిరసనకారుల డిమాండ్లు ఏంటి?
తమ సమస్యలు పరిష్కరించకుండా విగ్రహం నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ స్థానిక ఆదివాసీలు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు.
చోటా ఉదయ్‌పూర్, పంచ్‌మహల్, వడోదర, నర్మదా జిల్లాలకు చెందిన ఆదివాసీలు విగ్రహం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాము నీటిలో మునిగి చనిపోతామంటూ హెచ్చరించారు.
చక్కెర మిల్లుల నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించాలంటూ చెరకు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తమ నుంచి చెరకు కొనుగోలు చేసిన మిల్లులు తర్వాత మూతపడ్డాయని, తమకు రావాల్సిన డబ్బులు చెల్లించలేదని రైతులు అంటున్నారు.
ఈ విషయంపై అధికారులకు, నాయకులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన "ఏక్తా యాత్ర"ను కూడా ఇక్కడి రైతులు వ్యతిరేకించారు. ఆ యాత్రకు సంబంధించిన పోస్టర్లను కొందరు ఆదివాసీలు చించివేసి నిరసన తెలిపారు.
ఆదివాసీల నిరసనల తర్వాత ఆ పోస్టర్లలో ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ, ప్రధాని మోదీలతో పాటు ప్రముఖ ఆదివాసీ నేత బిర్సా ముండా ఫొటోను పెట్టారు.
ఫొటో సోర్స్, Getty Images
విగ్రహం నిర్మాణానికి పెట్టిన ఖర్చుతో తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తే తమ జీవితాలు బాగుపడేవని స్థానిక ఆదివాసీలు అంటున్నారు.
విగ్రహం నిర్మాణం కోసం పెట్టిన ఖర్చుతో తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తే బాగుండేదని చాలామంది ఆదివాసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ విగ్రహానికి సమీపంలో ఉన్న 22 గ్రామాల ప్రజలు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తే తాము స్వాగతం పలకబోమని ఆ లేఖలో పేర్కొన్నారు.
స్థానిక ఆదివాసీ నాయకులు కూడా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)