వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి గాయం చిన్నదే - ప్రెస్ రివ్యూ

జగన్

ఫొటో సోర్స్, Chandrakanth

విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిలో జగన్‌కి అయిన గాయం చిన్నదేనని.. వైద్యులు తేల్చినట్లు ఈనాడు.. ఆంధ్రజ్యోతి పేర్కొన్నాయి.

ఈ మేరకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు గాయాల ధ్రువపత్రం(వూండ్‌ సర్టిఫికెట్‌) జారీ చేశారని తెలిపాయి. ఆ ధ్రువ పత్రం ఫొటోనూ ప్రచురించాయి.

వీడియో క్యాప్షన్,

వీడియో: జగన్‌పై దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

''జగన్‌ ఎడమ భుజం వెనుక పైభాగంలో కత్తి గాయమైందని అందులో పేర్కొన్నారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి 18002386 ఇన్‌పేషంట్‌ నెంబరుతో ఈ నెల 25.10.2018 మధ్యాహ్నం 3.45 గంటలకు సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. 26.10.2018 మధ్యాహ్నం 12.54 గంటలకు డిశ్చార్జి అయ్యారు. ఈ మెడికో లీగల్‌ కేసులో నిర్వహించిన వైద్య పరీక్షల ప్రకారం అయనకైన గాయం స్వభావం చిన్నదే'' అని ధ్రువపత్రంలో ఉందని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఇక ఏటీఎంలో రోజుకు రూ.20 వేలే

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గతంలో ప్రకటించిన రూ. 20 వేల విత్‌డ్రా లిమిట్‌ నేటి నుంచి అమల్లోకి వచ్చిందని సాక్షి తెలిపింది. దీని ప్రభావం దాదాపు 1. 42 కోట్ల మంది ఎస్‌బీఐ వినియోగదార్ల మీద ఉంటుందని తెలిపింది. ఎస్‌బీఐ క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్న ఎస్‌బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉండేదని ఈ పత్రిక కథనం.

''ఇక మీదట రూ. 20 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకునేవారు హై వెరియంట్‌ డెబిట్‌ కార్డ్‌కు అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి బ్యాంక్‌ అధికారులు 'అత్యధిక మంది రోజుకు రూ.20 వేలు మించి తీయడం లేదని మా పరిశీలనలో తేలింది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రం రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేస్తున్నారు. దీనివల్ల ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దాంతో పాటు నగదురహిత/ డిజిటల్‌ లావాదేవీలు పెంచడమే ధ్యేయంగా బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.'' అని సాక్షి తన కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK/AndhraPradeshCM

చంద్రబాబు.. మళ్లీ దిల్లీకి

జాతీయ స్థాయిలో భావసారూప్యం కలిగిన భాజపాయేతర పార్టీలను ఏకం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారని ఈనాడు తెలిపింది.

ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని వివరించింది. ఇకపై ఆయన వారంలో రెండు మూడు రోజులు జాతీయ రాజకీయాలకు కేటాయించనున్నారని తెలిపింది.

''భాజపాయేతర పక్షాలను సంఘటితం చేసేందుకు ఇటీవలే దేశ రాజధానిలో పర్యటించిన చంద్రబాబు... గురువారం మరోసారి దిల్లీ వెళుతున్నారు. ఈసారి పర్యటనలో ఆయన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో మధ్యాహ్న భోజన సమావేశంలో పాల్గొననున్నారు. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాతోను మరోసారి భేటీ అవుతారు. మరో పక్క బాబు ప్రయత్నాలకు మద్దతిచ్చే పార్టీల సంఖ్య పెరుగుతోంది.'' అని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Ankit Srinivas

ఫొటో క్యాప్షన్,

దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన బిర్యానీ తయారు చేస్తారు

ఎన్నికల మెనూలో తగ్గిన ధరలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ కొత్త ధరలను ప్రతిపాదిస్తూ రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఈ ధరలపై అభిప్రాయాలను చెప్పాలని ఈసీ కోరింది. ఈ ప్రతిపాదనల్లో తినుబండారాల ధరలను భారీగా తగ్గించారు. టీ ధర 2014లో రూ.10 ఉంటే ఇప్పుడు రూ.6కు.. చికెన్‌ బిర్యానీ ధరను 140 నుంచి 120కి; పులిహోర ధరను 40 నుంచి 30కి పరిమితం చేశారు.

ఇలాగే, ఇతర తినుబండారాల ధరలను కూడా తగ్గించారు. ప్రచారంలో ఉపయోగించే ఇతర వస్తువులు, సౌకర్యాల ధరలను మాత్రం కొంత పెంచారు. లౌడ్‌ స్పీకర్లు, వేదిక ఏర్పాటు, జీపులు, ఆటోలు, కార్ల అద్దెలతో పాటు, కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు తదితరాలు ధరలు పెంచిన జాబితాలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)