ఫేక్ న్యూస్: నకిలీ వార్తలను సృష్టించేదెవరు? వారి ప్రయోజనాలేమిటి?
- వినీత్ ఖరే
- బీబీసీ ప్రతినిధి

సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న నకిలీ వార్తల కారణంగా దేశంలోని పలు చోట్ల మూకదాడులు, హత్యలు జరుగుతున్నాయనే వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీ ఫేస్‌బుక్, ఇతర వెబ్ సైట్లలో నకిలీ వార్తలను సృష్టిస్తున్నారనే ఆరోపణల వెనుక ఉన్న వ్యక్తులెవరో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఈ నకిలీ వార్తల సృష్టి వెనుక పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు బీబీసీ గుర్తించింది.
నకిలీ వార్తల పరిశోధనలో భాగంగా బీబీసీ పలు నగరాలను సందర్శించి, వాటిని సృష్టిస్తున్న వ్యక్తులతో సంభాషించింది.
నకిలీ వార్తల సృష్టికర్తల్లో కొందరి గుట్టును రట్టు చేసింది.
ఆకాశ్ సోనీ
తప్పులు జరుగుతుంటాయి..
ఆకాశ్ సోనీ ‘ఆల్ ఇండియా బీజేపీ’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్నారు. నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలు ఈ పేజీపై ఉన్నాయి.
పది లక్షలకు పైగా లైక్స్ కలిగిన ఈ పేజీలో ఎక్కడా బీజేపీ అధికారిక లింక్ కనిపించదు.
మే నెలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీ వీడియోను ఈ పేజీలో పోస్ట్ చేశారు. అందులో కనిపించే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాను పాకిస్తాన్ జెండాగా పేర్కొన్నారు.
దీనిపై ప్రశ్నించినపుడు ఆకాశ్, అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయన్నారు. అది ఒక వెబ్ సైట్ ప్రచురించిన కథనం అని, దాన్ని తొలగించామని వెల్లడించారు.
ఈ వీడియో చాలా సైట్లలో కనిపించింది. జెండా విషయంలో వాళ్లు చేసిన తప్పునే మిగిలిన వాళ్లూ చేశారు. కాంగ్రెస్‌కూ- పాకిస్తాన్‌కూ ముడిపెట్టేందుకే ఈ పని చేసి ఉండొచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.
నెహ్రూనూ వదిలిపెట్టలేదు
కొన్నేళ్ల క్రితం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఒక కాముకుడిగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా ఆయన విదేశీ మహిళలతో ఉన్నట్టు ఫొటోషాప్ చేసిన చిత్రం ఆ పేజీలో కనిపించడం గురించి ప్రశ్నించినపుడు, ఆ ఫోటో విషయం తనకు గుర్తు రావడం లేదని ఆకాశ్ అన్నారు.
అయితే ఆ పేజీలో నెహ్రూ చిత్రాన్ని చూసినట్లు గట్టిగా చెప్పడంతో తన సహచరుల్లో ఎవరైనా పోస్ట్ చేసి ఉండొచ్చని మాట మార్చారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసిన ఆకాశ్ తనకు బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శిగా ఉన్న ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉందని చెప్పారు.
బీబీసీతో సంభాషణ తర్వాత వాళ్లు తమ ఫేస్ బుక్ పేజీ పేరును మార్చేశారు.
ఫేక్ న్యూస్ వెనుక ఎవరున్నారు? వాళ్ల ప్రయోజనాలేంటి?
గ్వాలియర్ నగరంలోని అన్షియా ప్లాజాలోని మూడో అంతస్తులో కవరేజ్ టైమ్స్ డాట్ కామ్ వెబ్‌సైట్ కార్యాలయం ఉంది. ఈ వెబ్‌సైట్ కూడా నకిలీ వార్తలను ప్రచురిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
రొహింజ్యాల సమస్యపై బీబీసీ ప్రసారం చేసిన కథనంలో ఒక బాలిక కనిపిస్తుంది. అందులో ఆ బాలిక గురించి ఎటువంటి వివరాలూ ఇవ్వలేదు. కానీ, కవరేజ్ టైమ్స్ డాట్ కామ్ మాత్రం ఆ బాలిక భర్తకు 18 మంది పిల్లలున్నారని.. ఇలాంటి శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వాలా అంటూ హెడ్ లైన్ పెట్టింది.
దీనిపై కవరేజ్ టైమ్స్ డాట్ కామ్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజు సికర్వర్‌ను ప్రశ్నించినపుడు ఆయన, మరి బీబీసీ ఆ కథానాన్ని ఎలా ప్రచురించిందని ఎదురు ప్రశ్నించారు. బీబీసీ సహా చాలా మంది ఈ కథనాన్ని ప్రసారం చేశారని సమర్థించుకున్నారు.
అయితే, అది అసలు కథనమే కాదని, కేవలం కొద్ది క్షణాల పాటు కనిపించే విజువల్ మాత్రమే అని బీబీసీ స్పష్టం చేయడంతో రాజు చివరకు అది తప్పుడు కథనమే అని ఒప్పుకున్నారు.
అభిషేక్ మిశ్రా భోపాల్‌లో వైరల్ ఇన్ ఇండియా డాట్ నెట్ వెబ్ సైట్ నడుపుతున్నారు.
కాంగ్రెస్‌కు మద్దతుగా, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు ఈ వెబ్ సైట్‌పై ఉన్నాయి.
కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ కలిగిన నేత అంటూ ఓ అమెరికన్ సర్వే తేల్చినట్టు ఈ వెబ్ సైట్‌లో ఓ కథనం ప్రచురించారు.
అయితే, వార్తల్లో నిజానిజాలను తేల్చి చెప్పే వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ దీన్ని తప్పుడు వార్తగా పేర్కొంది.
సవాలు-ప్రతిసవాలు
దీనిపై బీబీసీ అభిషేక్‌ను ప్రశ్నించినపుడు, అది తప్పుడు వార్త ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమ కథనానికి వ్యతిరేకంగా అమెరికా ఏదైనా ప్రకటన చేసిందా అని వాదించారు. చేతనైతే అది తప్పుడు వార్త అని నిరూపించాలని సవాలు చేశారు.
అసలు ఆ సర్వే ఎక్కడ నిర్వహించారని ప్రశ్నించగా, ఈ కథనాన్ని పబ్లిష్ చేసిన వ్యక్తికి అది సరైన వార్త అని తెలుసన్నారు. తమ బృందంలో ఎవరో ఈ వార్తను రాసి ఉంటారని, అది కచ్చితంగా వాస్తవ వార్తే అన్నారు.
''ఆల్ట్ న్యూస్ స్టోరీనే తప్పుడు వార్త అని నేనంటాను. మీరేమంటారో చెప్పండి?'' అని అభిషేక్ ఎదురు ప్రశ్నించారు.
మరి కొన్ని నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికీ, వారిని వ్యతిరేకిస్తున్నవారికీ మధ్య పోరు పతాక స్థాయికి చేరుతోంది.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్: దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- ప్రపంచంలోనే ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారు?
- సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ: 90 మంది నిరసనకారుల నిర్బంధం?
- ఆఫ్రికా చరిత్ర: పుస్తకాల్లో కనిపించని శక్తిమంతమైన మహారాణి
- బ్రెజిల్ ఎన్నికలు: జైర్ బోల్సోనారోను గెలిపించిన ‘తుపాకీ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)