రిజర్వు బ్యాంకుకూ కేంద్రానికీ మధ్య దూరం పెంచిన 6 ఘటనలు

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య సంఘర్షణకు సంబంధించిన వార్తలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ పక్క భారత ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే కేంద్రానికీ, ఆర్బీఐకీ మధ్య వాతావరణం వేడెక్కుతోంది.
గతవారం ఓ ఆందోళనకర ప్రసంగంలో మాట్లాడుతూ... పరిస్థితి సద్దుమణగకపోతే దేశంలో ఆర్థికంగా సంకట స్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ విరల్ ఆచార్య హెచ్చరించారు.
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారంటూ బుధవారం వార్తలొచ్చాయి. కానీ, దానిపైన ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఇదంతా ఇప్పటికిప్పుడు జరుగుతోందా లేక ముందు నుంచే జరిగిన పరిణామాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయా అన్నది ప్రశ్నార్థకమైంది. 2018లో జరిగిన అనేక పరిణామాలు ప్రస్తుతం నెలకొన్న సంకట స్థితికి దారి తీశాయని చెప్పొచ్చు.
1. వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లను తగ్గించలేదన్న కారణంగా ప్రభుత్వం ఆర్బీఐపైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేదు సరికదా, వాటిని ఇంకా పెంచింది.
దీన్ని రిజర్వు బ్యాంకు తన స్వతంత్ర అధికారంగా భావిస్తుంది. ఈ పరిణామం వల్ల ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య ఇబ్బందికర వాతావరణం నెలకొంది.
2. బ్యాంకులపై షరతులు
ఫిబ్రవరిలో ఆర్బీఐ జారీ చేసిన ఓ సర్క్యులర్లో ఎన్పీఏ(నిరర్థక ఆస్తులు)లను నిర్వచించడంతో పాటు రుణాలు మంజూరు చేయడానికి అవసరమైన షరతులను మళ్లీ సడలించింది. ఇది కూడా వివాదానికి ఓ కారణమైంది.
ఆర్బీఐ నిర్ణయం బ్యాంకులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అత్యంత కఠినమైన విధానం అని ప్రభుత్వం భావించింది. ఈ ఉత్తర్వుల కారణంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు రుణాలు అందించలేవేమోననే సందేహం నెలకొంది.
ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ విరల్ ఆచార్య
3. నీరవ్ మోదీ ‘కుంభకోణం’
నీరవ్ మోదీ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు బయటికి వచ్చిన సమయంలోనే ఆర్బీఐపైన నిఘాకు సంబంధించిన పాలసీల గురించి ప్రభుత్వం ప్రశ్నించింది.
అదే సమయంలో ప్రభుత్వ బ్యాంకులపైన మరింత నిఘా పెట్టేందుకు తమ అధికార పరిధి పెంచాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కోరారు. అలా చేస్తేనే ప్రభుత్వ బ్యాంకులు కూడా ప్రైవేటు బ్యాంకుల తరహాలో పనిచేస్తాయని ఆయన చెప్పారు.
4. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఉదంతం
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా తన రుణాలను చెల్లించడానికి ఇబ్బందిపడిన సమయంలో, అలాంటి ‘నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్’ కంపెనీలకు రుణాల చెల్లింపుల విషయంలో కొంత ఊరట కల్పించమని ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ, ఆర్బీఐ ఆ దిశగా ఎలాంటి అడుగులూ వేయలేదు.
5. నచికేత్ మోర్ తొలగింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుల్లో ఒకరైన నచికేత్ మోర్ను, ఆయన పదవీ కాలం పూర్తవడానికి రెండేళ్ల ముందే తప్పించారు. ఈ విషయంలో నచికేత్కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు.
నచికేత్ అనేక విషయాల్లో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. అందుకే ఆయన్ను పదవి నుంచి తొలిగించారని భావిస్తున్నారు. ఇది కూడా బ్యాంకు అధికారులకూ, ప్రభుత్వానికీ మధ్య దూరం పెరగడానికి కారణమైంది.
6. ప్రభుత్వ చెల్లింపులు
ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల కోసం ప్రత్యేక విభాగాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆర్బీఐ దీనిని బహిరంగంగానే వ్యతిరేకించింది.
ఆర్బీఐ తన వెబ్సైట్లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ నోటును ప్రచురించి తన నిరసనను తెలియజేసింది. ఆ తరువాత ఆర్బీఐ స్వతంత్ర అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పరిణామాలన్నీ క్రమంగా ప్రస్తుత పరిస్థితులకు దారతీశాయని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- ఇందిరాగాంధీ: జననం నుంచి మరణం దాకా
- ‘అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?’
- వర్ణాంతర వివాహం: ఆఫ్రికా అబ్బాయి, ఇండియా అమ్మాయి.. ఓ అందమైన ప్రేమ కథ
- జియా ఉల్-హక్ : ఖురాన్ సాక్షిగా భుట్టోను మోసం చేసిన జిత్తులమారి
- నాసా: అంటార్కిటికాలో దీర్ఘచతురస్రం ఆకారంలో ఐస్బర్గ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)