తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలుపుతుందా?: ప్రెస్‌రివ్యూ

రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

ఎన్డీయే వ్యతిరేక పక్షాలతో ఏర్పాటు చేయబోయే కూటమిలో కాంగ్రెస్‌ను కూడా భాగస్వామిని చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని 'ఈనాడు' ఒక కథనం రాసింది.

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తోనూ చేతులు కలుపుతుందా? అని ఇన్నాళ్లూ నెలకొన్న సందేహానికి చంద్రబాబు తెరదించారు. ఇవాళ దిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ కాబోతున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాహుల్‌ గాంధీ, చంద్రబాబు మొదటిసారి ఒకే వేదికపై కనిపించారు. ఇప్పుడు వారిద్దరూ ముఖాముఖి సమావేశం కానున్నారు.

తెలంగాణలో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీలు రెండూ కలసి పోటీ చేస్తుండటంతో ప్రజల్లో ఒక స్పష్టత వచ్చిందని, తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చినందున జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీతో కలసి పని చేయడాన్ని రాష్ట్ర ప్రజలు సానుకూలంగానే చూస్తారన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేశారు.

"ప్రధాని కావాలనో, కూటమికి నాయకత్వం వహించాలనో అనుకోవడం లేదు. ఇది నా కోసం చేస్తున్నది అసలే కాదు. దేశాన్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం" అని చంద్రబాబు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ విధానంలో మార్పులు

దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ఏడాది మొత్తం భర్తీ శాతం (ఆక్యుపెన్సీ) 50 కంటే తక్కువగా ఉన్న 15 ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

నమస్తే తెలంగాణ కథనం ప్రకారం 50 నుంచి 75 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండే మరో 32 రైళ్లలో ఫ్లెక్సీఫేర్ పథకాన్ని రద్దీలేని సమయాల్లో అమలు చేయరు.

మరో 101 రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ను బేస్ రేటుపై 1.5 నుంచి 1.4 రెట్లకు తగ్గిస్తున్నట్టు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం వెల్లడించారు.

2016 సెప్టెంబర్‌లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి రైళ్లలో భర్తీ శాతం పడిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొన్న నేపథ్యంలో రైల్వేశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి రైల్వేశాఖకు రూ.103 కోట్ల మేర నష్టం వచ్చిందని రైల్వేశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో వ్యాపారం సులభం

సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ర్యాంకుల్లో గత ఏడాదికంటే 23 స్థానాలు ఎగబాకి.. భారతదేశం 77వ ర్యాంకు సాధించిందని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

ప్రపంచబ్యాంకు విడుదల చేసిన 'డూయింగ్‌ బిజినెస్‌-2019' నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను అంచనా వేసి ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకును ప్రకటించింది.

జీఎస్టీ, దివాలా పరిష్కార విధివిధానాలు, పన్ను సంస్కరణలు వంటివి దేశాన్ని పెట్టుబడిదారుల అనుకూల దేశంగా మార్చాయి.

ఫొటో సోర్స్, Telangana Registration and stamps

రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ విధానం

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖలో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానం నేటి నుంచి అందుబాటులోకి రాబోతోందని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాస్‌పోర్ట్ మాదిరిగా రిజిస్ట్రేషన్ చేసుకొనే రోజును ముందస్తుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తున్నారు.

రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలుచేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ, కమిషనర్ టీ చిరంజీవులు సర్క్యులర్ జారీచేశారు.

ప్రతిరోజు ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 18 మందికి స్లాట్లు బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు.

మ్యారేజీ సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే విధానం కూడా గురువారం నుంచే అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుపరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.