రఫేల్ డీల్: విమానం ధర ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు, కుదరదన్న కేంద్రం

రఫేల్ ఒప్పందం

ఫొటో సోర్స్, Getty Images

రఫేల్ విమానాల ధరకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో అందించాలని సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం బుధవారం రఫేల్ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపింది.

రఫేల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దీనిపై దర్యాప్తు చేయాలని మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో మోదీ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు.

ఈ విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ వేసిన పిటిషన్‌ను కూడా చేర్చారు.

అక్టోబర్ 10న లాయర్లు ఎంఎల్ శర్మ, వినీత్ డాండా తరఫున దాఖలైన పిటిషన్లను విచారణ కోసం స్వీకరించిన కోర్టు రఫేల్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఫొటో సోర్స్, Getty Images

రఫేల్ ఒప్పందంపై వాదనలు

భారత్, ఫ్రాన్స్ మధ్య 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించిన చాలా వివరాలు బహిర్గతం చేయలేదు.

ఈ విమానాల ఒప్పందంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తోంది. భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ సంస్థతో డసో ఒప్పందం చేసుకోవడాన్ని ప్రశ్నిస్తోంది.

ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ చాలా మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

బుధవారం జరిగిన విచారణ చాలా కీలకమైనదని అరుణ్ శౌరి బీబీసీకి చెప్పారు. "సుప్రీంకోర్టు రఫేల్ ఒప్పందం గురించి మొదట వివరాలు మాత్రమే అడిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో సమగ్ర విచారణ చేపట్టింది" అన్నారు.

ఫొటో సోర్స్, PTI

అదే విషయం అఫిడవిట్లో చెప్పండి-సుప్రీం

"రఫేల్ డీల్ గురించి పూర్తి వివరాలు అందించాలని కోరిన సుప్రీంకోర్టు విమానాల ధరలు ఎలా నిర్ణయించారు, ఆఫ్‌షోర్ పార్టనర్‌ను ఒప్పందంలో ఎలా చేర్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది" అని శౌరి చెప్పారు.

ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ "ఈ ధరలు రహస్యం" అన్నారు. అయితే "అదే విషయాన్ని అఫిడవిట్‌ ద్వారా చెప్పాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది" అని ఆయన తెలిపారు.

"ప్రభుత్వం ఈ విషయాన్ని అఫిడవిట్ ద్వారా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 126 విమానాల ధర 90 వేల కోట్లు ఉంటుందని మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ముందే తెలుసు. ఆ లెక్కన ఒక విమానం ధర 715 కోట్లు అవుతుంది. ఆ తర్వాత రక్షణ మంత్రి పార్లమెంటులో ఒక ప్రశ్నకు జవాబిస్తూ విమానం ధర 670 కోట్లు ఉంటుందన్నారు. తర్వాత రిలయన్స్, డసో తమ వార్షిక నివేదికలో ఒక విమానం ధర 670 కోట్లు కాదు, 1670 కోట్లని చెప్పాయి" అని అరుణ్ శౌరీ తెలిపారు.

మోదీ ప్రభుత్వం మాత్రం ఫ్రాన్స్‌తో జరిగిన రఫేల్ విమాన ఒప్పందంలో 'గోప్యత' షరతు ఉందని చెబుతోంది. ఇటు శౌరీ మాత్రం 'గోప్యత' అనేది విమానాల సాంకేతిక వివరాల గురించేనని, ధర గురించి కాదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)