'ఆడవాళ్ళను తడిమితే ఏం కాదని మా నేత చెప్పాడు, అందుకే అలా చేశాను' : అభిప్రాయం

  • అనఘా పాఠక్
  • బీబీసీ ప్రతినిధి
నేతల మాటలతో వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

వెనక సీటు నుంచి ఎవరో తాకారు. ఆమె నిద్రపోతోంది, కానీ చేయి తగలడంతో మెలకువ వచ్చింది. అక్కడ చాలామంది ఉన్నారు. అనుకోకుండా ఎవరి చేయో తగిలిందిలే అనుకుంది. కానీ, అరగంట తర్వాత మళ్లీ తడిమారు. అప్పుడామెకు తననెవరో ఇబ్బంది పెడుతున్నారనే విషయం అర్థమైంది.

మహిళను తాకుతూ ఇబ్బందిపెట్టిన ఒక వ్యక్తిపై న్యూ మెక్సికోలో అనుచిత లైంగిక ప్రవర్తన కింద కేసు నమోదు చేసారు. తన చేష్టలను సమర్థించుకున్న నిందితుడు "మా అధ్యక్షుడు ట్రంప్ మహిళను తడిమితే తప్పులేదన్నాడు. అందుకే అలా చేశా" అని వాదించాడు.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నాటి ఒక టేప్ వెలుగులోకి వచ్చింది. అందులో మహిళలను తడమడం గురించి గొప్పగా చెబుతున్న ట్రంప్ గొంతు వినిపిస్తుంది.

2005లో టీవీ హోస్ట్ బిల్లీ బుష్, ట్రంప్‌తో మాట్లాడుతుండగా వారిద్దరికీ తెలీకుండా ఈ టేపును రికార్డ్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

2005లో ప్రచార సమయంలో ట్రంప్ మాటలు రికార్డైన టేపు

ఆ టేపులో ట్రంప్ "మనం ఏమైనా చేయచ్చు. మహిళను ఎక్కడైనా తాకవచ్చు" అని మాట్లాడడం వినిపిస్తుంది.

ఎవరో ఒకరు ఒక మహిళను వేధించి, ఎవరో ఎక్స్ చెప్పారనే నేను ఇలా చేస్తున్నా అంటే సబబేనా? అంటే, తను ఏమనుకుంటున్నారు. అతడు అబద్ధాలైనా చెప్పుండాలి, లేదంటే తన తప్పుడు పనులకు వేరే వారిపైన నిందలేస్తుండాలి. అది కూడా కాదంటే అతడు గుడ్డిగా ఇతరులను అనుసరించే తెలివితక్కువ వాడైనా అయ్యుండాలి.

కానీ, ఇతరులు తమను గుడ్డిగా అనుసరించేలా మతిలేని వ్యాఖ్యలు చేసేవారు ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులే అయితే ఎలా ఉంటుంది?

అలాంటి ఘటనలు భారతదేశంలో కూడా ఎన్నో జరిగాయి.

ములాయం సింగ్ యాదవ్ 2014 ఎన్నికల సమయంలో చేసిన ఒక కామెంట్ మీకు గుర్తుందా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ములాయం సింగ్ యాదవ్

తప్పులు అలా జరిగిపోతాయి

అత్యాచారం చేసేవారికి ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకించిన ఆయన "అబ్బాయిల వల్ల తప్పులు జరిగిపోతుంటాయి, అంత మాత్రానికే వాళ్లను ఉరి తీసేయకూడదు" అన్నారు.

ఇక సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా కొన్నిసార్లు ఇలాగే నోరు జారారు. 2015 రాజ్యసభలో బీమా బిల్లు గురించి తీవ్రంగా చర్చ జరిగాక ఆయన " దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా, అందంగా ఉంటారు. కానీ ఉత్తరాది మహిళలు అలా ఉండరు, వారిలా నృత్యం కూడా చేయలేరు" అన్నారు.

అలా అనగానే, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయన్ను ఆపాలని ప్రయత్నించారు. కానీ, "నువ్వేంటో నాకు తెలుసు" అని ఆమెను కూడా అవమానించారు.

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రేణుకా చౌదరిని శూర్పణఖలా వర్ణించడాన్ని ఎవరూ మర్చిపోలేరు.

నేతలు చేసే ఇలాంటి ఏకపక్ష ప్రకటనల వల్ల ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో ఎవరైనా అర్థం చేసుకోగలరు.

రాజకీయ పరిశీలకులు సుజాతా ఆనందన్ "రాజకీయ నేతలను వారి అనుచరులు దేవుళ్లలా భావిస్తారని" నాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

"ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఒక్కోసారి సొంత పార్టీ వారే ఇలాంటి అశ్లీల వ్యాఖ్యలను ఒప్పుకోరు. శివసేన చీఫ్ బాల్ థాకరే తన ప్రసంగాల్లో వేరే పార్టీల మహిళా నేతలలపై తరచూ అభ్యంతరకరమైన, అశ్లీల వ్యాఖ్యలు చేసేవారు. పార్టీలో ఉన్న వారికే అలాంటివి నచ్చకపోయినా ఆ ప్రసంగం విన్న అభిమానులకు మాత్రం అవి బాగా అనిపించేవి" అంటారు సుజాత.

"ఒక నేత అలాంటి వ్యాఖ్యలు చేస్తే, అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? సమాజంలో మహిళలకు సమాన హోదా ఉంటుందని మనం భావించడం లేదు. అందుకే నేతలు, ప్రముఖులు మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసినపుడు, జనాల్లో ఉత్సాహం వస్తుంది. స్త్రీల పట్ల తమలో ఉన్న వివక్ష స్వభావానికి పై స్థాయిలో ఉన్నవారెవరి నుంచో ఆమోదం లభించినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా నేతలను అనుసరించని వారు కూడా తాము చేసే తప్పుడు పనుల నుంచి నోరుజారిన ప్రముఖుల మాటలను ప్రస్తావించి బయటపడాలని చూస్తుంటారు" అని సుజాత వివరించారు.

"మోదీ శూర్పణఖ అనే పదం ఉపయోగించడాన్ని నేను అందుకే వ్యతిరేకించాను. ఎందుకంటే ఆ పదం వాడిన మోదీ రాజకీయ ప్రత్యర్థులపై పంచ్ వేయడం కాదు, ఒక మహిళను అవమానించారు. ముఖ్యంగా ఆయన గట్టిగా నవ్విన ఆ ఒక్క మహిళ గురించే అలా అన్నారు. పురుషులను వ్యతిరేకించిన మహిళలు మంచి వారు కాదని, శూర్పణఖ లాంటి వారని అన్నారు. ఇక్కడ అందుకే ఆమె ముక్కు కోశారు అన్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలా అయినా మహిళను అవమానించడం ఆయనకు సమంజసమే అనిపించింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ నాయకులు కొందరు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటే, మనం సమానత్వం గురించి ఏ చర్చనైనా ఎలా ప్రారంభించగలం?

అందుకే నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. మనం మన నేతలను గుడ్డిగా అనుసరిస్తున్నామా? ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోకుండా వెళ్తున్నామా? మన వివేకం, నైతికత ఏమయ్యాయి?

ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తి మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఢిల్లీలోని సైకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు.

"ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. తమ నేత ఏది చెప్పినా అది సరైనదే అని అనుచరులు అనుకుంటారు. వాస్తవాలతో సంబంధం లేకుండా వాళ్లు తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా వెళ్లచ్చు. వాళ్లు ఆ నేతలను గుడ్డిగా అనుసరిస్తుంటారు. ఎందుకంటే వాళ్లు ఆయనలాగే కావాలనుకుంటారు. అది రాజకీయమైనా, ఆధ్యాత్మికమైనా కావచ్చు. అతడు క్రీడా ప్రముఖుడో, సినీతారో కావచ్చు.

"జనం తమకు తెలీకుండానే ఇతరుల ప్రవర్తనకు అలవాటు పడతారని, ఈ కేసులో అభిమాన నేతలను అనుసరిస్తున్నారని" త్రిపాఠి చెప్పారు. ఈ ఉదాహరణను సైకాలజీలో 'ఇంట్రోజెక్షన్' అంటారన్నారు.

ఇక రెండోది ఏ నాయకులనూ, ఎవరినీ అనుసరించని వాళ్లు కూడా ఉంటారు. కానీ వాళ్లు తమ వాదనలను సమర్థించుకునేందుకు ఎప్పుడూ ఎవరో ఒకరు అనిన మాటలను ఉపయోగిస్తుంటారు.

దీన్నే సింపుల్‌గా చెప్పాలంటే, ఒక యువకుడు ఒక యువతిని వేధించాలని అనుకుంటే, అతడు "అబ్బాయిలు తప్పులు చేస్తుంటారు, అదంత పెద్ద విషయం కాదని ఒక నేతాజీనే చెప్పారని" అంటాడు.

ఫొటో సోర్స్, Getty Images

'గందీ బాత్' గురించి గొప్ప ప్రచారం

ఒక హిందీ సినిమాలో హీరో షాహిద్ కపూర్, తన హీరోయిన్‌తో 'గందీబాత్' అంటూ పాటందుకుంటాడు. ఆ తర్వాత బయట షాహిద్ కపూర్ అభిమానులు కూడా చాలా మంది అలా కావాలనుకున్నారు. మహిళలతో వెకిలి సంభాషణలకు సిద్ధమయ్యారు.

చాటుగా ఉన్న 'గందీబాత్'ను తెరపైన హీరోలు చాలా మామూలు విషయంగా మార్చేశారు.

మనకు ప్రతి గల్లీలో ఒక 'దాదా' కనిపిస్తుంటాడు. వారిపై వారి అభిమాన నటుడి ప్రభావం ఉంటుంది. వారిలో కూడా అదే అహంకారం, స్త్రీద్వేషం, అశ్లీల ప్రవర్తన, వేధించడాలు ఉంటాయి. మా 'దాదా' చేశాడు కాబట్టి అలా చేయడం నాకు బాగుంటుందని వాళ్లు చెప్పుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

కొడుకులను సరిగా పెంచండి

మన సినిమాలు, జానపదాలు, గ్రంథాలు కూడా 'అంగీకారం' అనే అంశాన్ని నిర్లక్ష్యం చేశాయి. మన దేవుళ్లు కూడా మహిళను చాటుగా అనుసరించారు. వారి చీరలు దొంగిలించారు, అంగీకారం లేకుండానే వారి చేతులు ఒడిసిపట్టారు. మనం ఆ కథలను ఆరాధిస్తాం.

మహిళను అవమానించడం అనే సంస్కృతి మన సమాజంలో మన మనసులో బాగా స్థిరపడిపోయింది. దాన్ని పెకలించడం అంత సులభం కాదు.

అయితే, దీనికి సమాధానం? పితృస్వామ్యంలో దీని గురించి దిగులు పడాల్సిన అవసరమే రాలేదు. వాళ్లకు తమకంటూ సొంత పరిష్కారాలు ఉన్నాయి. మహిళలను ఇళ్లలో వేసి తాళాలు వేయడం. వారిని ఎదగనీకుండా చేయడం, చదువు లేకుండా, బలవంతంగా ముసుగులో ఉంచడం చేశారు.

అయితే, అది ఈనాటి ప్రపంచంలో సాధ్య కాదు. అందుకే ఇప్పుడు మీ కొడుకులను సరిగ్గా పెంచండి. మహిళలు తమ జీవితంలో ఒక భాగమనే విషయం వారికి తెలిసేలా పెంచండి. ముఖ్యంగా వారు సొంతంగా ఆలోచించగలిగేలా చేయండి, అప్పుడే వాళ్లు ఆ నేతల మందలో ఒకరు కాకుండా ఉంటారు.

ఇక అసలు వారి విషయానికి వద్దాం. తమ వ్యాఖ్యలకు ఎవరూ చప్పట్లు కొట్టడం లేదని ఆ నేతలకు తెలిస్తే, తమ అశ్లీల సినిమాలను ఎవరూ చూడడం లేదనే విషయం ఆ హీరోలు గుర్తిస్తే, స్త్రీద్వేషాన్ని ఎవరూ ప్రోత్సహించరనేది ఆ దాదాలకు అర్థమైతే, తర్వాత వాళ్లే అలా ప్రవర్తించడం మానుకుంటారు.

అప్పటివరకూ వాళ్లకు మనం శూర్పణఖలమే అవుతాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)