కొరియా మహారాణిగా మారిన అయోధ్య రాజకుమారి

కిమ్ జోంగ్-సూక్

ఫొటో సోర్స్, Getty Images

రామ జన్మభూమిగా చాలామంది నమ్మే అయోధ్యకూ, కొరియా ద్వీప కల్పానికి చాలా పాత అనుబంధం ఉంది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భార్య కిమ్ జోంగ్-సూక్ ఒంటరిగా భారత పర్యటనకు రానున్నారు. ఏటా దీపావళికి ముందు రోజు అయోధ్యలో జరిగే దీపోత్సవ్‌లో నవంబర్‌ 6న ఆమె పాల్గొంటారు. ఆమె రాకతో అయోధ్య-కొరియా మధ్య సంబంధం మరోసారి చర్చకొచ్చింది.

పదహారేళ్లలో తొలిసారిగా కిమ్ జోంగ్-సూక్ భర్త తోడు లేకుండా దేశం దాటి వస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె నవంబర్ 4న భారత్‌కు వస్తారు. సోమవారం నాడు ప్రధాని మోదీని కలుస్తారని ఏజెన్సీలు చెబుతున్నాయి.

అయోధ్యకు వచ్చినప్పుడు ఆమె సరయు నదీ తీరంలో ఉన్న కొరియా మహారాణి ‘హియో’ స్మారకాన్ని సందర్శిస్తారు. ప్రాచీన కొరియా సామ్రాజ్య వ్యవస్థాపకుడు కిమ్ సూ-రో భారతీయ భార్యే ఈ హియో’ మహారాణి.

ఫొటో సోర్స్, OTHERS

ఫొటో క్యాప్షన్,

'హియో' మహారాణి

ఈ ‘హియో’ మహారాణి కథ ఏంటి?

రాజకుమారుడైన రాముడు పద్నాలుగేళ్ల వనవాసం తరువాత తిరిగి అయోధ్య చేరుకున్నాడనే కథ అందరూ చదువుకున్నదే. కానీ, అయోధ్యకు చెందిన ఓ మహారాణి ఆ రాజ్యాన్ని వదిలి వెళ్లి తిరిగి రాలేదన్న కథ కూడా చాలాకాలంగా ప్రచారంలో ఉంది.

కొరియా చరిత్ర ప్రకారం దాదాపు 2వేల ఏళ్ల క్రితం భారత్‌లోని అయోధ్య(అప్పుడు సాకేత్)కు చెందిన మహారాణి సురీరత్న దక్షిణ కొరియాలోని గ్యోంగ్సాంగ్ ప్రాంతంలోని కిమ్హాయే నగరానికి వెళ్లారని, హియో హాంగ్-ఓక్‌గా తన పేరు మార్చుకున్నారని తెలుస్తోంది.

చైనా భాషలో ఉన్న సాంగుక్ యుసా అనే చరిత్ర పుస్తకం ప్రకారం... అయోధ్య రాజకుమారి సురీరత్న తండ్రి కలలో దేవుడు కనిపించాడు. దక్షిణ కొరియాకు చెందిన రాజు కిమ్ సు-రో తో అతడి కుమార్తెకు వివాహం చేయమని చెప్పాడు. దాంతో ఆ రాజు కుమార్తె సురీరత్నను దక్షిణ కొరియా పంపించాడు.

కారక వంశం

ప్రస్తుత కొరియాలో దాదాపు 60లక్షల మంది తాము కొరియా రాజు కిమ్ సూ-రో, అయోధ్య రాణి హియో వంశస్థులమని చెప్పుకుంటారు. ఆ రాణి కారక వంశానికి చెందినవారని చెబుతారు. దక్షిణ కొరియాలో చాలామంది దీన్ని నిజమేనని భావిస్తారు. ఆ కారణంతోనే ఏటా వందల మంది దక్షిణ కొరియన్లు అయోధ్యకు వచ్చి తమ మహారాణి స్మారకానికి నివాళులర్పిస్తారు.

దక్షిణ కొరియా మాజీ రాష్ట్రపతి కిమ్ డేయ్ జంగ్, మాజీ ప్రధాని హియో జియోంగ్, జోంగ్ పిల్-కిమ్‌లు ఈ వంశానికి చెందినవారే.

అయోధ్య నుంచి కొరియాకు హియో మహారాణి చిన్న పడవలో ప్రయాణించారు. సముద్రంలో ఆటుపోట్ల వల్ల ఆ పడవ పట్టు తప్పుకుండా ఉండేందుకు కొన్ని రాళ్లనూ తనతో తీసుకెళ్లారు. ఇప్పటికీ ఆ రాళ్లు తమ దగ్గర ఉన్నాయని కొరియాలోని కారక వంశస్థులు చెబుతారు. కిమ్హాయే నగరంలో హియో మహారాణికి చెందిన భారీ విగ్రహం కూడా ఉంది.

దక్షిణ కొరియాలో హియో సమాధిపైన ఉన్న భారీ రాయిని అయోధ్య నుంచి తీసుకొచ్చారని చెబుతారు.

2001 నుంచి అయోధ్య, కిమ్హాయే నగరాల మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే కారక వంశానికి చెందిన ఒక సమూహం ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో మాతృభూమిలో తమ మహారాణికి నివాళులు ఆర్పించేందుకు అయోధ్య వచ్చి వెళ్తుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

కొరియన్లు కట్టిన పార్కు

మహారాణి హియోను స్మరించుకుంటూ కొరియాకు చెందిన అతిథులే సరయు నది తీరంలో తులసీఘాట్ దగ్గర ఒక పార్కునూ నిర్మించారు. క్రమంగా కొరియాకు చెందిన ప్రముఖులు కూడా అయోధ్యకు రావడం మొదలుపెట్టారు.

అయోధ్యలోని పూర్వ రాజవంశీకుడైన బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కొరియా నుంచి వచ్చే వారికి ఆతిథ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా చాలాసార్లు దక్షిణ కొరియా వెళ్లొచ్చారు.

‘మొదట్లో నాకు ఈ కథపై కాస్త సందేహం ఉండేది. బహుశా అది థాయిలాండ్‌కు చెందిన ఆయుతా నగరం అయ్యుంటుందని నేను కొరియా అతిథులతో చెప్పాను. అక్కడ కూడా ఓ అయోధ్య ఉంది. కానీ, తాము పూర్తి అధ్యయనం చేసి, రూఢీ చేసుకున్న తరువాతే ఇక్కడి వచ్చామని చెప్పారు’ అని బిమలేంద్ర మోహన్ ప్రతాప్ గతంలో బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

కొరియావాళ్లకు అయోధ్య విషయంలో అనేక ప్రణాళికలు ఉన్నాయని, కానీ భారత నేతలు మాత్రం ఆ విషయంలో పెద్దగా ఆసక్తి చూపట్లేదని మిశ్రా అంటున్నారు. అందుకే మహారాణికి స్మారకంగా ఓ స్థూపం కట్టిన అనంతరం కొరియావాళ్లు కూడా పక్కకు తప్పుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

గత కొన్నేళ్లలో జరిగిన పరిణామాలు

  • 2015-16లో భారత్ - దక్షిణ కొరియా నేతల మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అయోధ్యలో హియో స్మారకంగా ఓ పార్కును నిర్మించాలని ప్రణాళిక వేశారు.
  • ఆ సమయంలో పార్కు కోసం దక్షిణ కొరియా ప్రభుత్వం 8.6లక్షల డాలర్లు సాయం చేస్తామని తెలిపింది.
  • అఖిలేష్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక, కొరియా నిర్మాణ శైలి ప్రకారం పార్కు నిర్మిస్తామని చెప్పారు.
  • 2018లో మహారాణి పార్కు విస్తరణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేసింది.
  • ఆ తరువాత అయోధ్యలో రామ్ కథా సంగ్రహాలయం వెనుక కొరియా మహారాణి పార్కు కోసం 2.5ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు వార్తలొచ్చాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)