లోక్‌సభ ఎన్నికలు 2019: ప్రపంచ ఓటర్ల వేలిపై హైదరాబాద్ సిరా చుక్క
- ప్రవీణ్ కాసం
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
'నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగుచుక్క' అంటాడో కవి. ఎన్నికల్లో మన ఓటు ఎంత ముఖ్యమో చెప్పడమే ఇక్కడ కవి ఉద్దేశం. అయితే, ఓటు మాత్రమే కాదు ఎన్నికల్లో సిరా చుక్కది కూడా కీలక పాత్రే.
మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే.
అందుకే, భారత్‌తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.
భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్ అధికారిపై ఉంటుంది. ఒక వేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి.
ఎన్నిల వేళ కీలకంగా మారే ఈ సిరా హైదాబాద్‌లోనే తయారవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల ఎన్నికల్లో ఈ సిరానే వాడుతున్నారు.

ఫొటో సోర్స్, bbc/ Rayudu labs
సిరాను బాటిళ్లలలో నింపి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు
100 దేశాలకు ఇక్కడి నుంచే..
భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్(ఎంపీవీఎల్) ఒకటైతే, హైదరాబాద్‌లోని రాయుడు ల్యాబరేటరీస్ మరొకటి.
భారత ఎన్నికల సంఘం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ సిరాను ఎక్కువగా వినియోగిస్తుండగా, ప్రపంచంలోని చాలా దేశాలు రాయుడు ల్యాబరేటరీస్ తయారు చేస్తోన్న సిరాను వాడుతున్నాయి.
''ఎన్నికల కోసం ప్రపంచంలోని దాదాపు 100 దేశాలకు చెరగని సిరా (ఇండెలబుల్ ఇంక్)ను సరఫరా చేస్తున్నాం. ఇండియా, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, బెనిన్, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, వనౌతు, మోజాంబిక్, రువండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయి'' అని రాయుడు ల్యాబరేటరీస్ సీఈవో శశాంక్ రాయుడు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Rayudu labs
సిరాను తయారు చేయడానికి ఉపయోగించే యంత్రం
భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్ , పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారని శశాంక్ చెప్పారు. గత 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలబుల్ ఇంక్‌ను తయారు చేస్తోందన్నారు.
''మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లం. 2004 తర్వాత ఇంక్ మార్కర్‌లను తీసుకొచ్చాం. ఈ సాంకేతికతను తొలుత తీసుకొచ్చింది మేమే'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Rayudu labs
ఎగుమతికి సిద్ధంగా ఉన్న సిరా బాటిళ్లు
పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా..
ఎన్నికల్లోనే కాకుండా పల్స్ పోలియో కార్యక్రమంలో కూడా సిరాను వాడుతుంటారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలుపై సిరా చుక్క పెడుతుంటారు.
''ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెవో) కూడా ఇండెలబుల్ ఇంక్ కోసం మా సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ మా సిరానే ఉపయోగిస్తారు'' అని శశాంక్ చెప్పారు.
''నాణ్యతతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడమే మా ధ్యేయం. అందుకే వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాం. దాదాపు 100 దేశాలు ఎన్నికల వేళ మా ఇండెలబుల్ ఇంక్(చెదిరిపోని సిరా)ను వాడుతుండటం మాకు గర్వంగా ఉంది'' అని శశాంక్ పేర్కొన్నారు.
ఎన్నికల సిరాతో పాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి అనేక రకాల ఇంక్‌లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్ సచిన్, అంజలి దంపతులు
సిరా చుక్క... ఏముంది ప్రత్యేకత?
ఎన్నికల్లో వాడే సిరాను సెమి-పర్మినెంట్ ఇంక్‌గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజుల పాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట.
ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత 72 నుంచి 96 గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది.
అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరానే చాలా దేశాలు వాడుతుంటాయి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)