వరంగల్‌లో దాడికి గురైన పూజారి మృతి

పూజారి సత్యనారాయణ శర్మ
ఫొటో క్యాప్షన్,

పూజారి సత్యనారాయణ శర్మ

తెలంగాణలోని వరంగల్ జిల్లా కేంద్రంలో దేవాలయం మీద మైక్ విషయంగా జరిగిన గొడవలో గాయపడ్డ అర్చకుడు సత్యనారాయణ శర్మ మృతి చెందారు.

గుడి పైన ఉండే మైక్ శబ్దం ఇబ్బంది కలిగిస్తోందంటూ హుస్సేన్ అనే యువకుడు కొన్ని రోజుల కిందట అర్చుకుడి మీద దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన సత్యనారాయణ వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయారు.

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం ప్రాతంలోని శివాలయం, సాయిబాబా గుళ్లలో సత్యనారాయణ శర్మ పూజారిగా పనిచేసేవారు. ఆయనపై అక్టోబర్ 26వ తేదీ ఉదయం దాడి జరిగింది. నిందితుడు వరంగల్ నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సాదిక్ హుస్సేన్‌‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

గాయపడిన పూజారిని చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాడిలో ఆయన కాలేయం బాగా దెబ్బతింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ కి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన చనిపోయారు.

ఫొటో క్యాప్షన్,

పూజారిపై దాడి చేసిన హుస్సేన్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

"గుళ్లో మైక్ పెట్టొందంటూ నిందితుడు గతంలో చాలా సార్లు ఆయనను బెదిరించారని తెలిసింది. కానీ, ఆరోజు మైక్ పెట్టేసరికి అతను పూజారిని ముఖంపైనా, పొట్టలోనూ చేతితో గుద్దాడు. పూజారికి 65 ఏళ్లు ఉంటాయి. మేం వెంటనే దాడిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం, పూజారిని ఆసుపత్రిలో చేర్పించాం. బాధితుడు కోలుకోకపోవడంతో, హైదరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడే మరణించారు" అని వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్ బీబీసీకి తెలిపారు.

నిందితుడిపై ఐపిసి సెక్షన్ 462, 307 కింద కేసు నమోదు చేశామని, ఇప్పుడు పూజారి మరణించడంతో ఆయనకు 302 సెక్షన్ వర్తిస్తుందని తెలిపారు. నిందితుడు, బాధితుడు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో మేం అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.

‘ప్రభుత్వం ఆదుకోవాలి’

"ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. గ్రామాల్లో అర్చుకులను కొట్టడం ఎక్కువైంది. ఈమధ్య కాలంలో ఇది ఐదవ ఘటన. ఇటీవల లాలాపేటలో ఇద్దరు పండితులను కొట్టారు. ఈ పూజారి చావుబతుకుల్లో ఉంటే చూడ్డానికి ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఆయన కోసం మేమంతా తలా కొంత డబ్బు వేసుకుని ఇచ్చాం. ప్రభుత్వం తక్షణం ఆయన కుటుంబానికి పరిహారం ప్రకటించాలి. గ్రామాల్లో అర్చకుల రక్షణకు పటిష్ట చట్టం తేవాలి" అని దర్శనం పత్రిక సంపాదకులు ఎం వేంకట రమణ శర్మ అన్నారు.

బాధితుడిని గట్టిగా కొట్టడం వల్ల అవయవాలు పనిచేయకుండా మరణించారని ఎంజిఎం వైద్యులు డా. గోపాలరావు వివరించారు.

"మా దగ్గర చేరేప్పటికి కాలేయం దెబ్బతిన్నది. పక్కటెముకలు విరిగాయి. కుడి వైపు ఊపిరితిత్తులకు గాయాలు అయ్యాయి. మేం శస్త్రచికిత్స చేసి రక్తం ఎక్కించి చాలా ప్రయత్నాలు చేశాం. 4-5 రోజులు బాగానే ఉన్నారు. నిన్న ఆరోగ్యం బాగా క్షీణించడంతో, హైదరాబాద్ తరలిస్తామని వారి కుటుంబ సభ్యులు చెబితే అంగీకరించాం. గట్టిగా దెబ్బలు తగలడంతో అవయవాలు పనిచేయకుండా పోయాయి" అని డా. గోపాలరావు తెలిపారు.

సత్యనారాయణ మృతికి సంతాపంగా వరంగల్ రైల్వేస్టేషన్, ఎంజిఎం ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)