‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు? - అభిప్రాయం
- ఒమర్ ఫారూఖ్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు 15 ఏళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు. గురవారంనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన కలవడం, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు మంతనాలు జరపడం వంటి పరిణామాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
గత ఏడాదిన్నర కాలంలో వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులు జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగించినప్పటికీ అవేవీ చంద్రబాబు నాయుడి ప్రయత్నాలకు వచ్చినంత స్పందనను రాబట్టలేకపోయాయి. దానికి కారణం కూటములను ఏర్పాటు చేయడంలో చంద్రబాబుకు ఉన్న అనుభవమే.
1996లో వివిధ రాజకీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి, సెక్యులర్ యునైటెడ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబు, ప్రాంతీయ నాయకుడు దేవెగౌడ ప్రధానమంత్రి పీఠమెక్కడంలో కీలక పాత్ర పోషించారు.
ఆ తరువాత ఆశ్చర్యకర రీతిలో యూ టర్న్ తీసుకొని బీజేపీతో జతకట్టి మొదటి నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అటల్ బిహారీ వాజపేయీ ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు.
2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఓడిపోయింది. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ కూడా అధికారం కోల్పోయింది. అప్పుడు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'మతతత్వ బీజేపీ', నరేంద్ర మోదీ హయాంలో గుజరాత్లో జరిగిన అల్లర్లే ఓటమికి కారణమని నిందించారు.
ఫొటో సోర్స్, FACEBOOK
సైద్ధాంతిక కట్టుబాటును, వ్యక్తుల పట్ల విధేయతను చంద్రబాబు ఏనాడూ ప్రదర్శించలేదు. ఆయన రాహుల్ గాంధీతో ఎలా జతకట్టగలిగారని ప్రశ్నిస్తున్నవారు, చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైందని, 1978లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పైనే తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారని మరచిపోయినట్టున్నారు.
ఆయన 1980లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ చేశారు. అదే ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లిచేసుకునేందుకు సాయపడింది.
'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ మీద ఘన విజయం సాధించారు. ఆ సమయంలో చంద్రబాబు టీడీపీలో చేరకుండా కాంగ్రెస్ టికెట్‌పైనే పోటీ చేసి ఓటమిని చవిచూశారు.
ఆ తరువాత తెదేపాలో చేరి క్రమంగా శక్తిమంతమైన నేతగా ఎదిగారు. 1984లో చంద్రబాబుకు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశానుసారం గవర్నర్ రామ్ లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు, చంద్రబాబు సర్వశక్తులొడ్డి తిరిగి ఎన్టీఆర్‌ను అధికారంలోకి తెచ్చేవరకు నిద్రపోలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు నీడలా ఉన్న చంద్రబాబు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంలో సఫలమయ్యారు. ఆ ప్రయత్నమే 1989లో నేషనల్ ఫ్రంట్‌గా రూపం దాల్చింది.
అదే చంద్రబాబు 1995లో ఎన్టీఆర్‌ను దింపేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెదేపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2002లో గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి నరేంద్ర మోదీ వైదొలగాలని చంద్రబాబు కోరుకున్నారు. 2014 తరువాత అదే మోదీతో చేయి కలిపి, బీజేపీ కూటమిలో భాగమయ్యారు.
ఫొటో సోర్స్, Getty Images
2014 ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. మరి ఇప్పుడు చంద్రబాబు తన కాంగ్రెస్ వ్యతిరేకతను పక్కనబెట్టి ఆ పార్టీతో ఎందుకు చేయి కలిపారు?
దీన్ని ఊసరవెల్లిలా రంగులు మార్చడం అని, విలువలు కొరవడడమని కొందరంటారు. కానీ, చంద్రబాబు మాత్రం దీన్ని 'ప్రజాస్వామ్య అనివార్యత' అని అభివర్ణిస్తున్నారు.
బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దేశ భవిష్యత్తును కాపాడండి' అనే మంచి నినాదాన్ని కూడా ఆయన అందించారు.
వాస్తవం ఏంటంటే, అనేక ఇతర కారణాలకు తోడు ముఖ్యంగా రాజకీయాల్లో మనుగడ సాగించడమన్నది చంద్రబాబును కాంగ్రెస్‌కు దగ్గర చేసింది.
ఈ ఏడాది మార్చిలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బీజేపీ ఎదురుదాడి మొదలైంది.
రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్‌తో బీజేపీ కలుస్తుందనే సంకేతాలు, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ వంటి పరిణామాలు తెదేపాలో భయం పుట్టించాయి.
ఫొటో సోర్స్, Getty Images
మోదీ-అమిత్ షా ద్వయంపైన ఎదురుదాడికి దిగడమంటే సమస్యలను కోరి తెచ్చుకోవడమేనని అందరికీ తెలుసు. టీడీపీ నాయకులు, సానుభూతిపరులుగా ఉన్న వ్యాపారవేత్తలపై ఐటీ, ఈడీ, ఇతర ఏజెన్సీల దాడులను కేంద్ర ప్రభుత్వం పురమాయించిందన్న వాదన ఉంది. కొన్ని రోజులుగా ఈ దాడులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే అది 'ప్రభుత్వాన్ని అస్థిరపరిచి పార్టీ నాయకులను నాశనం చేయాలనే కుట్ర'.
జగన్మోహన్రెడ్డి మీద ఇటీవల జరిగిన కత్తి దాడి కూడా.. బీజేపీ, వైఎస్ఆర్సీపీలు ఆయనను లక్ష్యం చేసుకోవటానికి కొత్త ఆయుధాన్నిచ్చింది.
పోలవరం సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర రాజధాని నిర్మాణ కార్యక్రమంలో అవినీతి ఆరోపణలతో బీజేపీ నాయకులు ఇప్పటికే ఆయన మీద విరుచుకుపడుతున్నారు.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కొనసాగుతున్న విరోధం కూడా ఆయన కష్టాలకు తోడైంది. తనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎత్తుల వెనుక బీజేపీ హస్తముందని ఆయన అనుమానించారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు బీజేపీయేతర శిబిరంలోని నాయకులతో స్నేహాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ప్రారంభించారు. మమతా బెనర్జీ, హెచ్.డి.దేవెగౌడ, శరద్ పవార్, మాయావతి, ఫరూఖ్ అబ్దుల్లా వంటి వారితో సంబంధాలు పునరుద్ధరించారు. కొత్త తరం నాయకులు అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారితో సంబంధాలు నెలకొల్పుకున్నారు.
అనుభవజ్ఞుడైన, అవకాశవాద రాజకీయ నాయకుడిగా.. ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీల కూటమి.. ఒక ప్రధాన జాతీయ పార్టీ మద్దతు లేకుండా ఎంతో కాలం మనలేదని చంద్రబాబుకు బాగా తెలుసు. గతంలో బీజేపీని ఆ పాత్రలోనే చూశారాయన. కానీ ఇప్పుడు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే.
కాంగ్రెస్ వైపు సహకార హస్తాన్ని చాచటానికి ఆయన తన గర్వాన్ని పక్కనపెట్టారు. తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని విడనాడారు.
ఈ క్రమంలో ఆయనకు దోహదపడిన ఒక అంశం.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కాంగ్రెస్ ఇప్పుడేమాత్రం పెద్ద శక్తి కాకపోవటం.
తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సాయం అందించినందుకు ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్‌లో బలపడుతున్న ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తనకు మద్దతు అందించాలని ఆయన కోరుకుంటున్నారు.
తెలంగాణలో ప్రతిపక్షాల 'మహా కూటమి'లో కాంగ్రెస్, టీడీపీలు ఒక దగ్గరకు వచ్చినపుడు.. ఈ రెండు పార్టీలు చేతులు కలుపుతున్నాయన్న తొలి సంకేతం వెలువడింది.
కొత్త వాస్తవికతను అంగీకరిస్తూ తెలంగాణ అసెంబ్లీ సీట్లలో సింహ భాగాన్ని కాంగ్రెస్‌కు ఇవ్వటానికి ఒప్పుకోవటం ద్వారా.. తన పార్టీ మైనర్ పాత్రను పోషించటానికి చంద్రబాబు అంగీకరించారు.
ఇప్పుడు రాహుల్‌గాంధీ ఈ స్నేహబంధాన్ని నిర్ధరించారు. చంద్రబాబును కలిసిన తర్వాత.. ''బీజేపీని ఓడించటం.. ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించటం ప్రధాన లక్ష్యమని మేం అంగీకారానికి వచ్చాం'' అని రాహుల్ ప్రకటించారు. కూటమి ముఖచిత్రం ఎవరవుతారు వంటి విషయాలను తర్వాత చర్చిస్తామని కూడా ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, FACEBOOK
అయితే.. 1996లో, 1998లో ఉన్నంత శక్తివంతుడిగా చంద్రబాబు ఈనాడు ఉన్నారా?
రాజకీయంగా కాదు. కానీ వ్యక్తిగతంగా అంత శక్తివంతుడే.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. బేరమాడే ఆయన సామర్థ్యం తగ్గిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు కేవలం 25 లోక్‌సభ సీట్లే మిగిలాయి. మిగతా 17 సీట్లు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. అక్కడ కేసీఆర్ తన సొంత జాతీయ ఆకాంక్షలకు పదునుపెడుతున్నారు.
కానీ వ్యక్తిగతంగా.. చంద్రబాబుకు అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. పొలిటికల్ మేనేజ్మెంట్, లాబీయింగ్, ఇతరులను ఒప్పించటం, కూటమి ఏర్పాటు చేయటం, ఎంపిక చేసిన నాయకుడి విషయంలో ఏకాభిప్రాయం నిర్మించటం వంటి విషయాల్లో ఘనమైన అనుభవముంది. జాతీయ వేదిక మీదకు ఆయన పునరాగమనం సృష్టించిన ఆసక్తిలో ఇది ప్రతిఫలిస్తోంది.
ఇప్పుడు అందరి దృష్టీ.. సమీప భవిష్యత్తులో ప్రతిపాదిత బీజేపీయేతర నాయకుల సమావేశం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆ సమావేశం ఫలితం మీద నరేంద్రమోదీ కన్నా ఎక్కువ ఆసక్తి మరే వ్యక్తికీ ఉండదు.
ఇవి కూడా చదవండి:
- మనుస్మృతి ఎందుకు వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది?
- రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ‘కాంగ్రెస్‌తో చేయి కలపడం ప్రజాస్వామిక అనివార్యత'
- జమాల్ ఖషోగ్జీ హత్య: గొంతు నులిమి చంపేశారన్న టర్కీ
- రిజర్వు బ్యాంకుకూ కేంద్రానికీ మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- రఫేల్ డీల్: విమానం ధర ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు, కుదరదన్న కేంద్రం
- ఫేక్ న్యూస్: నకిలీ వార్తలను సృష్టించేదెవరు? వారి ప్రయోజనాలేమిటి?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)