పవన్ కల్యాణ్: జనంతో జనసేనాని రైలు ప్రయాణం- ప్రెస్ రివ్యూ

విశాఖపట్నంలో ప్రసంగిస్తున్న పవన్‌కళ్యాణ్

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేపట్టనున్నట్టు ఈనాడు కథనం ప్రచురించింది. రైలు ప్రయాణంలో పవన్ కల్యాణ్ పలు వర్గాలతో భేటీ అవుతారని, తొలిరోజు తునిలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపింది.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర చేపట్టనున్నారు. తొలిరోజు సాయంత్రం తుని రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

విజయవాడ నుంచి పవన్‌ కల్యాణ్‌ రైలులో తుని చేరుకుంటారు. 'జనసేనానితో రైలు ప్రయాణం' పేరుతో సాగే ఈ యాత్రలో విజయవాడలో రైల్వే పోర్టర్లు, నూజివీడులో మామిడి రైతులు, ఏలూరులో అసంఘటిత కార్మికులు, సాధారణ ప్రయాణికులు, తాడేపల్లిగూడెంలో చెరకు రైతులతో పవన్‌ మాట్లాడతారు. రాజమహేంద్రవరంలో టెక్స్‌టైల్‌ కార్మికులు, సామర్లకోటలో విద్యార్థులు, అన్నవరంలో ఏటికొప్పాక హస్తకళల తయారీ కార్మికులతో చర్చిస్తారు.

సాధారణ ప్రయాణికుడి తరహాలోనే రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ప్రయాణించనున్నారని ఈ కథనంలో తెలిపారు.

జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు సాగే యాత్రలో నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

2న తుని, 3న ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలి బహిరంగ సభలో పవన్‌ పాల్గొంటారు.

4న వంతాడలో లేటరైట్‌ తవ్వకాలు సాగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తారు. సాయంత్రం జగ్గంపేట బహిరంగ సభలో పాల్గొంటారు.

5న పెద్దాపురం బహిరంగ సభలో పాల్గొంటారు.

6న కాకినాడ ఎస్‌ఈజెడ్‌ నిర్వాసితులు, రైతులు, పోరాట సంఘ నాయకులతో పవన్‌ మాట్లాడతారు. ఉప్పాడకు వెళ్లి అక్కడి మత్స్యకారులను కలుస్తారు. సాయంత్రం పిఠాపురం బహిరంగ సభలో పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Getty Images

హై కోర్టు ఉద్యోగుల విభజనకు శ్రీకారం

ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమైనట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. దీనిపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని, ఉద్యోగులందరూ తమ ఆప్షన్‌ దరఖాస్తులను ఈనెల 15లోపు సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించిందని ఇందులో తెలిపారు.

ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమయింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను హైకోర్టు గురువారం జారీచేసింది.

విభజనపై మార్గదర్శకాలతోపాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేదా తెలంగాణ హైకోర్టులో పనిచేసే విషయంలో ఐచ్ఛిక (ఆప్షన్)ను తెలియజేసేందుకు దరఖాస్తులను ఉద్యోగులకు అందజేశారు.

పూర్తిచేసిన దరఖాస్తులను హైకోర్టు ఉద్యోగులందరూ ఈ నెల 15లోగా సీల్డ్‌కవర్‌లో అందజేయాలని హైకోర్టు వర్గాలు స్పష్టంచేశాయి.

భార్యభర్తలిద్దరూ హైకోర్టు ఉద్యోగులైతే ఇరువురూ ఎంచుకున్న హైకోర్టుకు వారిని కేటాయించనున్నారు.

ఒకవేళ హైకోర్టులో పనిచేసే ఉద్యోగి భార్య రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఆమె పనిచేస్తున్న రాష్ట్రంలోని హైకోర్టుకు అతన్ని కేటాయిస్తారు.

పదవీ విరమణకు రెండేళ్లు గడువు మాత్రమే ఉన్న ఉద్యోగులను, వారు ఎంచుకున్న రాష్ట్రానికి కేటాయిస్తారు.

ఫొటో సోర్స్, Alok Putul

ఐదు జిల్లాల్లో హైఅలర్ట్‌..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మావోయిస్టుల ఉనికి ఎక్కువైందంటూ రాష్ట్ర పోలీసు శాఖ ఈసీకి నివేదిక ఇచ్చిందని సాక్షి కథనం తెలిపింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మావోయిస్టుల ఉనికి పోలీసు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఎన్నికల వేళ ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంటుందని భావిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చింది.

దీంతో ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసేందుకు నేరుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చేపట్టాల్సిన అంశాలపై గురువారం జిల్లాల్లో పర్యటించి చర్చించారు.

గోదావరి పరీవాహక జిల్లాలుగా ఉన్న ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాచలం, ఖమ్మంలో మావోయిస్టు యాక్షన్‌ కమిటీల కదలికలు భారీ స్థాయిలోనే ఉన్నట్లు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) గుర్తించింది.

దీనికి బలం చేకూరుస్తూ బుధవారం ఏటూరునాగారం కమిటీ పేరుతో ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ బ్యానర్లు, పోస్టర్లు బయటపడటం ఇప్పుడు మరింత ఆందోళనలో పడేసింది. బ్యానర్లు పెట్టి వాటి కింద మావోయిస్టులు ల్యాండ్‌మైన్లను పాతిపెట్టడం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

మన 'శక్తి'ని చాటేలా..!

మద్రాస్ ఐఐటీ దేశీయ తొలి మైక్రో ప్రాసెసర్ తయారు చేసినట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఈ ప్రాసెసర్ ద్వారా సైనిక, సమాచార వ్యవస్థలకు సైబర్‌ దాడుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపింది.

మద్రాస్‌ ఐఐటీ తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'శక్తి' అనే మైక్రోప్రాసెసర్‌ను అభివృద్ధి చేసింది.

మొబైల్స్‌, నిఘా కెమెరాలు, స్మార్ట్‌ మీటర్స్‌, కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో త్వరలోనే 'శక్తి'ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

చండీగఢ్‌లోని ఇస్రోకు చెందిన సెమీకండక్టర్‌ ల్యాబ్‌లో మైక్రోచిప్‌ తయారు చేయగా.. దాన్ని చక్కగా డిజైన్‌ చేసిన మద్రాస్‌ ఐఐటీ బృందం మైక్రోప్రాసెసర్‌గా అభివృద్ధి చేసింది.

ఇప్పుడు 'శక్తి' రావడంతో విదేశీ ప్రాసెసర్లపై ఆధారపడే అవసరం ఉండదు. సైనిక, సమాచార వ్యవస్థలపై జరిగే సైబర్‌ దాడులను ఎదుర్కొనే శక్తి దీనికుందని ఈ కథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)