దంతెవాడ నక్సల్స్ దాడి: 'అమ్మా, నేను చనిపోవచ్చు...' అని చెప్పిన విలేఖరి వీడియోను ఆ తల్లి చూశారా?

  • సరోజ్ సింగ్
  • బీబీసీ ప్రతినిధి
దంతెవాడ వీడియో
ఫొటో క్యాప్షన్,

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

'తీవ్రవాదులు దాడి చేశారు'(బుల్లెట్ల శబ్దం)

'మేం దంతెవాడలో ఎన్నికల కవరేజి కోసం వచ్చాం. ఒక దారిలో వెళ్తున్నాం.(బుల్లెట్ల శబ్దం) ఆర్మీ మాతోపాటే ఉంది. ఉన్నట్టుండి చుట్టుముట్టారు... నక్సల్స్ దాడి చేశారు. అమ్మా.... ఒకవేళ నేను ప్రాణాలతో ఉంటే… మంచిదే. అమ్మా నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఈ దాడిలో నేను చనిపోవచ్చు. పరిస్థితులు సరిగా లేవు. ఎందుకో తెలీదు, మృత్యువు ఎదురుగా ఉన్నా నాకు భయం వేయడం లేదు. ఇక్కడ దాడి నుంచి బయటపడడం కష్టమే. నాతో ఆరేడుగురు జవాన్లు ఉన్నారు. మమ్మల్ని చుట్టుముట్టారు. అయినా నేను అదే చెబుతాను'.

తర్వాత మొబైల్ కెమెరా పైకి తిరుగుతుంది. కొందరు బైకుల్లో తీసుకెళ్లమని, అంబులెన్స్ పిలిపించాలని అంటుంటారు. ఇంకొన్ని గొంతులు 'భయ్యా కాస్త నీళ్లిస్తారా,' 'ఇప్పుడు సురక్షితం' అని వినిపిస్తాయి.

ఇది దూరదర్శన్ అసిస్టెంట్ కెమెరామెన్ మోర్ ముకుట్ శర్మ తన తల్లి కోసం రికార్డ్ చేసిన మొబైల్ వీడియోలో కనిపించే సంభాషణ. సోషల్ మీడియాలో ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌ అయిపోయింది.

ఫొటో సోర్స్, MORMUKUT/BBC

ఫొటో క్యాప్షన్,

నక్సల్స్ దాడికి కొన్ని క్షణాల ముందు తీసిన ఫొటో

ఈ వైరల్ వీడియో ఆ తల్లికి చేరుతుందా?

కానీ చాలా ప్రశ్నలకు ఇప్పటికీ జవాబులు దొరకడం లేదు.

మోర్ ముకుట్ స్వయంగా తీసిన ఈ వీడియో చూస్తే ఆ తల్లి గుండె ఎంత బాధపడుతుంది?

చావు కళ్లెదుటే ఉన్నప్పుడు వీడియో తీయాలి అనే ఈ ఆలోచన ఎలా వచ్చింది?

మృత్యువును జయించిన దూరదర్శన్ అసిస్టెంట్ కెమెరామెన్ దంతెవాడ నుంచి దిల్లీకి తిరిగి వచ్చారు. కానీ, తల్లి కోసం ఆయన రికార్డ్ చేసిన ఈ వీడియోను చూసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. హర్యానాలోని పల్వల్‌లో మోర్ ముకుట్ శర్మ ఇంటికి వెళ్లిన బీబీసీ ఈ ప్రశ్నలకు సమాధానం వెతికింది.

బీబీసీ తల్లికోసం మోర్ ముకుట్ రికార్డ్ చేసిన వీడియోను, ఆమె దగ్గరకు చేర్చింది. కానీ, కొడుకు సురక్షితంగా భయపడడ్డాడన్న వార్త ఆ తల్లికి అంతకు ముందే తెలిసింది.

మోర్ ముకుట్ ఆరుగురు తోబుట్టువుల్లో చిన్నవారు. కుటుంబంలో ఆయన తల్లితోపాటు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు.

ఫొటో సోర్స్, MORMUKUT/BBC

ఫొటో క్యాప్షన్,

నక్సల్స్ దాడి జరుగుతున్న సమయంలో ఫొటో

ముకుట్ బయటపడిన వార్త ఎలా తెలిసింది?

దంతెవాడలో జరిగిన నక్సల్స్ దాడి నుంటి మోర్ ముకుట్ శర్మ సురక్షితంగా బయటపడ్డాడనే విషయం మొదట అతడి పెద్ద వదిన నీతూ శర్మకు తెలిసింది.

ఆమె ఆరోజు జరిగింది చెప్పారు. "నాకు 30వ తేదీ మధ్యాహ్నం ఒక తెలీని నంబరు నుంచి చాలాసార్లు ఫోన్ వస్తోంది. నెట్‌వర్క్ సమస్య వల్ల కట్ అయిపోతోంది. దాంతో నేనే తిరిగి ఆ నంబరుకు ఫోన్ చేశాను. అవతలి వైపు నుంచి 'మీ బంధువులెవరైనా దూరదర్శన్‌లో పనిచేస్తున్నారా, ఆయనతో మాట్లాడండి' అన్నారు. తర్వాత మోర్ ముకుట్ గొంతు వినిపించింది."

"వదినా, ఇక్కడ నక్సల్స్ దాడి జరిగింది. మా కెమెరా మెన్ చనిపోయారు. కానీ నేను బాగానే ఉన్నా. మమ్మీకి ఏం చెప్పకండి"

మృత్యువును దగ్గరగా చూస్తూ తల్లి కోసం తన వీడియో రికార్డ్ చేసిన ముకుట్.. దాడి నుంచి సురక్షితంగా బయటపడిన వార్త మాత్రం తల్లికి తెలీకూడదని ఎందుకు అనుకున్నారు.

ముకుట్ దాని సమాధానం చెప్పారు. "అప్పుడు ఒకేసారి రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక యుద్ధం కళ్లెదుటే కనిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం వినిపిస్తోంది. ఎదురుగా రక్తంతో తడిసిన నా సహచరుడి ముఖం కనిపిస్తోంది. రెండో యుద్ధం మనసులో జరుగుతోంది. అమ్మ ముఖం కనిపిస్తోంది. నేను తిరిగి ఇంటికి వెళ్లకపోతే ఆమె ఏమవుతుందో అనిపించింది. అందుకే ఆ వీడియో తీశాను. నాకు బతుకుతాననే ఆశల్లేవు" అన్నాడు.

దిల్లీ తిరిగి వచ్చిన తర్వాత ముకుట్ బీబీసీతో ఫోన్లో అన్నీ వివరంగా మాట్లాడారు.

ఫొటో సోర్స్, MORMUKUT/BBC

ఆరు నెలల కిందటే గుండెపోటుతో తండ్రి మృతి

ఆర్నెల్ల ముందు మోర్ ముకుట్ తండ్రి మరణించారు. ఆయనకు సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇంట్లో అందరికంటే చిన్న వాడవడంతో ముకుట్ అంటే తల్లికి చాలా ఇష్టం. అతడంటే గారాబం కూడా.

మోర్ ముకుట్ దిల్లీ తిరిగిరావడానికి కొన్ని గంటల ముందే ఆమె ఆ వీడియోను చూశారు. కానీ దంతెవాడలో జరిగిన దాడి గురించి ఇంట్లో వాళ్లెవరూ ఆమెకు చెప్పలేరు.

మోర్ ముకుట్ తల్లి వీడియో చూడగానే మొదట ఇంట్లో వాళ్లను బాగా తిట్టారు. కానీ కొడుకు అప్పటికే ఇంటికి బయల్దేరాడనే విషయం తెలిసి కాస్త శాంతించారు.

కొడుకును కలవగానే.. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకొడుకుల్లా అయిపోయారు.

ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్న ముకుట్ "ఆమ్మ నన్ను ఏం అడగలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. కానీ అమ్మ నన్ను పట్టుకోగానే, అప్పటివరకూ మనసులో ఉన్న బాధంతా పోయినట్టైంది. ఇప్పుడు నాకు దాని గురించి ఎలాంటి బాధా లేదు" అన్నారు.

అయితే, మోర్ ముకుట్ ఇంట్లో వాళ్లందరూ తల్లికి 24 గంటలపాటు అతడి విషయం చెప్పకుండా ఎలా దాచగలిగారు. దానికి ఒక కారణం ఉంది. ముకుట్ ఇంట్లో దీపావళి కోసం రంగులు వేస్తున్నారు. టీవీ కనెక్షన్ తీసేశారు. దాంతో దేశమంతా ఆ వార్త తెలిసినా, వాళ్ల అమ్మకు మాత్రం అది తెలీకుండా ఉంచగలిగారు.

ఎన్నికల కవరేజీకి ఛత్తీస్‌గఢ్ వెళ్లాలనే ఆదేశాలు ఆయనకు ఆఫీసు నుంచి వచ్చాయా? లేక ఆయన సొంత నిర్ణయమా?

"అది నా సొంత నిర్ణయం. ఛత్తీస్‌గఢ్‌కు నన్ను పంపించమని నేనే మా సెక్షన్ హెడ్‌ను అడిగాను. 14 ఏళ్ల నుంచి దూరదర్శన్‌లో ఉన్నా. ఎన్నో కవరేజీలకు వెళ్తుంటా. అది నాకు కొత్తేం కాదు. బహుశా అందుకేనేమో, మృత్యువు దగ్గరగా ఉన్నా నాకెలాంటి భయం వేయలేదు" అన్నారు ముకుట్.

దాడి నుంచి సురక్షితంగా బయటపడి దిల్లీ వచ్చిన సమయంలో, ముకుట్ వాళ్ల అమ్మ చాలా గాఢమైన నిద్రలో ఉన్నారు.

అది బహుశా కొడుకుపైకి వచ్చిన మృత్యువు దూరంగా పారిపోయినందుకు ఆ తల్లి మనసులో కలిగిన ప్రశాంతత వల్లే అయ్యుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)