రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది? మీకేమవుతుంది?

  • సమీర్ హష్మి
  • బీబీసీ ప్రతినిధి
రూపాయి

ఫొటో సోర్స్, Getty Images

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ గత కొన్ని నెలలుగా తగ్గిపోతోంది. 2018లో భారత కరెన్సీ విలువ 15 శాతం దాకా పడిపోయింది. ఆసియాలో అత్యంత భారీగా పతనమైన కరెన్సీ రూపాయే.

ఈ ఏడాది జూన్ నుంచి ఆ పతనం మరింత ఎక్కువగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 67 నుంచి అక్టోబర్ 11 నాటికి అత్యల్పంగా 74.4 రూపాయలకు చేరింది.

పెరిగిన ముడిచమురు ధరలు, భారత మార్కెట్ల నుంచి వేగంగా తరలిపోయిన విదేశీ పెట్టుబడులు ప్రధానంగా రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా ప్రస్తుతం దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

ద్రవ్యోల్బణం

రూపాయి విలువ క్షీణిస్తే ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపైన పడుతుంది. దేశంలో దాదాపు 80శాతం చమురు విదేశాల నుంచే వస్తుంది. చమురు దరలు పెరగడంతో భారత్ మరిన్ని ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.

మరోపక్క రూపాయి విలువ కూడా తగ్గుతుండటంతో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. సెప్టెంబర్ నాటికి టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం సెప్టెంబరు నాటికి 5.3శాతానికి చేరింది. దేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత రెండు నెలలుగా 4శాతం లోపే ఉంది. కానీ, ఇంధనం ధర కారణంగా రవాణా ఖర్చులు పెరిగి ఫలితంగా ఆ ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.

‘ఆహార ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ అవి మారితే 2019 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5శాతానికి చేరే అవకాశం ఉంటుంది’ అని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

వడ్డీ రేట్లు

నాలుగేళ్ల పాటు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు జూన్ నుంచి ఆగస్టు మధ్య రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతూ రావడంతో, డిసెంబర్‌ నాటికి వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల వినియోగదారుడి కొనుగోలు అలవాట్లపైన ప్రభావం పడుతుంది. ఎక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధికి కూడా నిరోధకంగా మారతాయని విశ్లేషకులు చెబుతారు.

‘ఎక్కువ వడ్డీ రేట్లు ఆదాయంపైన ప్రభావం చూపుతాయి. 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు తరువాత ఇప్పుడిప్పుడే సంస్థలు ఆదాయాన్ని తిరిగి పొందుతున్నాయి. కానీ, వడ్డీ రేట్లు పెరిగితే మళ్లీ ఆదాయాన్ని తిరిగి పొందే అవకాశంపైన దెబ్బపడుతుంది’ అంటారు ఐఐఎఫ్ఎల్ రిసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అభిమన్యు సోఫత్.

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ కార్పొరేట్ రుణం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రుణం పొందిన భారతీయ సంస్థలు తిరిగి వాటిని చెల్లించేందుకు చేస్తున్న ఖర్చు కూడా ఇప్పటికే పెరిగిపోయింది. 2019 మార్చి నాటికి భారత కంపెనీల షార్ట్-టెర్మ్ రుణాలు మెచ్యుర్ అవుతాయి. రుణగ్రహీతలు వాటిని మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే, ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దానివల్ల లాభాలపైన ప్రభావం పడుతుంది.

ఇప్పటికే అప్పుల భారం పెరిగిపోయిన భారతీయ సంస్థలకు, ఈ పరిస్థితి మరింత తలనొప్పిగా మారుతుందంటారు సబ్నవిస్.

వీడియో క్యాప్షన్,

డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది?

దిగుమతులు

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడంతో ఆ ప్రభావం నేరుగా దిగుమతులపైన ఆధారపడే ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, రసాయనాల రంగాలపైన పడుతోంది. భారత్ దాదాపు 65శాతం ఎలక్ట్రానిక్ వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. క్షీణిస్తున్న రూపాయి మొబైల్ ఫోన్ల తయారీదారులపైన మరింత ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికీ భారత్‌లో ఉన్న పోటీ కారణంగా అవి అతితక్కువ మార్జిన్లతో పనిచేస్తున్నాయి.

దిగుమతి ధరలు ఎక్కువవుతుండటంతో మొబైల్ సంస్థలు ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి.

ఎల్‌ఈడీ లైట్లను తయారు చేసే ఎవర్‌గ్రీన్ ఇంజినీరింగ్ సంస్థ అధినేత దీపక్ రావు మాట్లాడుతూ గత కొంత కాలంగా తన లాభాలన్నీ తగ్గిపోయినట్లు చెప్పారు.

‘రూపాయి విలువ ఇలానే క్షీణిస్తే నేను ఉత్పత్తిని కూడా తగ్గించాల్సి వస్తుంది’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎగుమతులు

రూపాయి క్షీణత ఎగుమతులపైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఐటీ, ఔషధాలు, టెక్స్‌టైల్స్ తదితర రంగాలు దీని వల్ల లాభపడతాయి. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య ఎగుమతుల విలువ రూ.9.9లక్షల కోట్లు దాటింది. గతేడాది అదే సమయంలో జరిగిన ఎగుమతుల విలువ కంటే అది 16శాతం ఎక్కువ.

2019 మార్చి నాటికి ఎగుమతుల విలువ రూ.25లక్షల కోట్ల మార్కు దాటుతుందని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య అంచనా వేస్తోంది.

మరోపక్క అమెరికా, చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగుతుండటంతో భారతీయ సంస్థలు రూపాయి క్షీణత వల్ల పూర్తి స్థాయిలో లాభాలు పొందలేకపోవచ్చని, వారి వాణిజ్య యుద్ధ ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపైన ఉండటమే దానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

‘గత నాలుగేళ్లుగా ఎగుమతుల్లో ఎలాంటి వృద్ధి లేదు. వాళ్లు లాభపడటానికి ఇదో మంచి అవకాశం. కానీ, వాణిజ్య యుద్ధం ఆ ఆశలపైన నీళ్లు జల్లుతుంది’ అనిఐఐఎఫ్ఎల్ రిసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అభిమన్యు సోఫత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ద్రవ్య లోటు

ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్‌తో అనేక సంక్షేమ పథకాలను నడిపిస్తోంది. రూపాయి విలువ తగ్గుతుండటంతో ద్రవ్యలోటు పెరుగుతోంది. దాంతో, ప్రభుత్వం పథకాల అమలు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.

జీఎస్టీ వసూలు తగ్గడం, రాష్ట్రాల ఆర్థిక వనరుల పైన పడుతున్న ఒత్తిడి కారణంగా 2019 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు 6.5శాతానికి చేరుతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ చెబుతోంది.

ఈ ద్రవ్యలోటును నియంత్రించాలంటే ప్రభుత్వం మూలధన వ్యయాన్ని తగ్గించాలని సబ్నవిస్ చెబుతారు.

దేశంలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రూపాయి విలువ ఇలానే పడిపోతే ద్రవ్యోల్బణంతో పాటు ధరలు పెరుగుతాయి. ఆ ప్రభావం పాలక పక్షాల విజయావకాశాలపైన పడొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)