పవన్ కల్యాణ్: చంద్రబాబు అధికారం కోసం వైసీపీతోనూ కలుస్తారేమో - ప్రెస్ రివ్యూ

పవన్ తుని బహిరంగ సభ

ఫొటో సోర్స్, JanaSena Party/FACEBOOK

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తుని సభలో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెడతారా? అని టీడీపీని ప్రశ్నించినట్టు ఈనాడు కథనం ప్రచురించింది. 2019 నుంచి సరికొత్త రాజకీయ శకం ప్రారంభమవుతుందని ఆయన అన్నట్టు తెలిపింది.

'తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టాల్సిన అవసరమేముంది..? కేవలం గెలుపు కావాలంటే మీరు రాహుల్‌ గాంధీ వరకూ ఎందుకెళ్లాలి.. మా ఇంటికి రండి. నేను అండగా ఉంటా.. ప్రజలకు ఏం కావాలో అడుగుదాం.. మనలో మనం ఏదన్నా అర్థం చేసుకోగలం. కానీ దిల్లీ వీధుల్లో తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టుపెట్టడం అన్యాయం' అని ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు అని ఈనాడు కథనం తెలిపింది.

'జగన్‌లా వేల కోట్లున్నాయా.. ముఖ్యమంత్రిలా హెరిటేజ్‌ ఫ్యాక్టరీలున్నాయా.. నాకేమీ లేవు. మీరే నా శక్తి. పవర్‌ అంటే మీరు.. స్టార్‌ అంటే భగవంతుడు. మధ్యలో నేను.. సామాన్య, దిగువ మధ్యతరగతి మనిషిని.. మీ కోసం అండగా నిలిచేవాడిని' అని కార్యకర్తలనుద్దేశించి పవన్ మాట్లాడినట్టు కథనంలో వివరించారు.

కాంగ్రెస్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు జట్టుకట్టడం తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని చంపేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆయన నిర్ణయాలు తెలుగు ప్రజల కోసం కాదని, ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమేనని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో జగన్‌తోనూ కలిసి నడుస్తానంటారేమోనని వ్యాఖ్యానించారని పత్రికలో చెప్పారు.

శుక్రవారం విజయవాడ నుంచి రైలు ప్రయాణం ద్వారా తుని చేరుకున్న ఆయన అక్కడ జరిగిన బహిరంగసభలో ప్రసంగించారని ఈనాడు చెప్పింది.

ఫొటో సోర్స్, youtube/dvv

ఫొటో క్యాప్షన్,

నవంబర్ 11న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రారంభం

ఆర్ఆర్ఆర్ ముహుర్తం ఖరారు

రాజమౌళి తర్వాత సినిమా ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవం తేదీ గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించినట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారని తెలిపింది.

ప్రముఖ దర్శకకుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో చేయబోతోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చేశారు..

ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయినా వేటికీ సమాధానమివ్వని చిత్రయూనిట్.. అఫీషియల్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రారంభోత్సవ తేదీని ప్రకటించిందని కథనంలో చెప్పారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ఓ స్పెషల్ తేదీన ప్రారంభం కాబోతోంది. 11-11-11న ఈ చిత్రం ప్రారంభం కానుంది.

11వ నెల 11వ తారీఖు 11గంటలకు ఈ చిత్రానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారని ఆంధ్రజ్యోతి తమ కథనంలో తెలిపింది.

చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ విడుదల చేసింది. ఇందులో '11 11 11' అని చూపిస్తూ.. ఈ మూడు 11లు మూడు 'R R R'లుగా మారడంను వీడియోలో చూపించారు.

ఫొటో సోర్స్, Reuters

ఎన్నికలతో మాకేం సంబంధం?

ఓటుకు నోటు కేసుపై విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం ఎన్నికలతో తమకు సంబంధం లేదని వ్యాఖ్యలు చేసినట్టు సాక్షి కథనం తెలిపింది. ఈ కేసును ఫిబ్రవరిలో విచారించాలని నిర్ణయించామని మార్చి 2017లోనే నోటీసులు జారీ చేశామమని కోర్టు చెప్పిందని ఇందులో తెలిపారు.

'వచ్చే ఫిబ్రవరి నెల ఎన్నికల సమయమైతే వాటితో మాకేం సంబంధం'.. అని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించిందని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

అప్పుడైతే రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని కేసులో ప్రతివాది ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరఫు న్యాయవాది వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. అంతేకాక.. ఈ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఆ నెలలోనే విచారణ చేపట్టనున్నట్లు కూడా వెల్లడించిందని తెలిపారు.

వాస్తవానికి ఈ పిటిషన్‌లో ప్రతివాదులైన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ప్రభుత్వానికి 2017 మార్చి 6న సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఆ తరువాత ఈ పిటిషన్‌ విచారణకు రాలేదు.

ఈ నేపథ్యం లో దీనిని త్వరగా విచారించాలని కోరుతూ వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తాజాగా మరో దరఖాస్తు దాఖలు చేశారని సాక్షి తమ కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, IPRTelangana/fb

సాధ్యమయ్యే హామీలే ఇవ్వాలి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న పార్టీలు మ్యానిఫెస్టోల ప్రతులు ముందుగానే తమకు సమర్పించాలని ఈసీ కోరినట్టు నమస్తే తెలంగాణ తమ కథనంలో తెలిపింది. ఎన్నికల సమయంలో మద్యనిషేధం అసాధ్యమని చెప్పినట్టు వివరించింది.

మ్యానిఫెస్టోలను (ఎన్నికల ప్రణాళికలను) విడుదలచేయడానికి మూడురోజుల ముందుగానే వాటి ప్రతులను అన్ని రాజకీయ పార్టీలు విధిగా ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ ఆదేశించారని నమస్తే తెలంగాణ చెప్పింది.

మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అలవిగానిగా ఉండరాదనే భావనతో ఎన్నికల కమిషన్ వాటిని పరిశీలించి అవసరమైతే మార్పులను సూచిస్తుందని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలోని హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి ఎన్నికల కమిషన్ సంధించే ప్రశ్నలకు రాజకీయ పార్టీలు సరైన సమాధానాలిచ్చే స్థితిలో ఉండాలని సూచించారు.

ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలను నిషేధించడం సాధ్యంకాదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)