ధన్‌తేరస్: ఈ పండగకు బంగారం ఎలా కొనాలి?

gold

దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా? బంగారానికి భారత దేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి బంగారం కేవలం అలంకారం కోసమేనా? కాదు. ఇది పెట్టుబడి మార్గం కూడా.

బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ధన్‌తేరస్, దీపావళి వచ్చిందంటే బంగారం షాపులకు పండగే పండగ.

మరి మీరు కూడా బంగారం కొంటున్నారా? అయితే దాన్ని పెట్టుబడిగా ఎలా మార్చాలో చూద్దాం.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారత దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24 వేల టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ.

భారత్‌లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28 శాతం ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28 శాతం భారత్‌లోనే ఉంది. తర్వాతి స్థానం చైనాది.

భారత్‌లో బంగారానికి గిరాకీ ఉండటం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ప్రపంచంలో బంగారం ఉత్పత్తి చేసే 5 అతి పెద్ద దేశాలు - చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, రష్యాకాగా వాటి నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.

2018 నాటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంకు.. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం నిల్వ. ఆ బ్యాంకులో 8000 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది. నిల్వల జాబితాలో పదో స్థానంలో ఉన్న భారత రిజర్వ్ బ్యాంకులో 560 టన్నులకు పైగా బంగారం ఉంది.

బంగారం వర్తకుల నుంచి బంగారం కొనుగోలు చేయడమే మనకున్న ఏకైక, లాభదాయకమైన మార్గమా? అంటే కాదనే చెప్పాలి. దీనికి పలు మార్గాలున్నాయి.

భౌతికంగా అంటే.. ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, గోల్డ్ కాయిన్స్ కొనడం . ఇవి ఆభరణాల దుకాణాల్లో లభిస్తాయనేది తెలిసిందే. ఇక రెండవది డిజిటల్ గోల్డ్. అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్ (ఈటీఎఫ్), మరోటి సావరిన్ గోల్డ్ బాండ్లు.

భారత్‌లో డైమండ్స్ , ప్లాటినం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. బంగారం, వెండితో పోలిస్తే వీటి ధరల్లో పెరుగుదల రేటు చాలా ఎక్కువ.

అయితే, నమ్మకం విషయానికొస్తే మాత్రం బంగారానికే గోల్డ్ మెడల్ దక్కుతుంది. వెండి, బంగారాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రజలు వీటిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు కాబట్టి.

ఇక బంగారంలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో కాస్త వివరంగా చూద్దాం. మొదటిది ఆభరణాలు. చాలా మంది వేరే వేరే పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయడంకన్నా ఆభరణాల్ని కొనడమే మేలంటారు.

అయితే ఆభరణాలతో ఒక ప్రమాదం ఉంటుంది. వాటిని దొంగలు ఎత్తుకెళ్లొచ్చు లేదా అవి పాతబడి పోవచ్చు. రెండవది డిజిటల్ గోల్డ్.

కావాలంటే మీరు బంగారం బిస్కెట్లను లేదా కడ్డీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. కొన్ని మొబైల్ వాలెట్లూ, వెబ్‌సైట్లలో డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నారు.

ఇప్పుడు కొన్ని బంగారు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటినే గోల్డ్ కాయిన్ స్కీమ్ అంటున్నారు. రిజిస్టర్డ్ ఎంఎంటీసీ ఔట్‌లెట్లు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నాణేలను కొనుగోలు చేయొచ్చు.

గోల్డ్ సేవింగ్ స్కీమ్

ఇందులో ఒక నిర్ణీత కాలం పాటు నెలకు కొంత చొప్పున నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత కాలం పూర్తయ్యాక డిపాజిట్ చేసిన విలువకు సమానమైన బంగారం కొనుక్కోవచ్చు.

గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్ (ఈటీఎఫ్) - బంగారం ధరలపై ఆధారపడి ఈటీఎఫ్ విలువలో హెచ్చుతగ్గులుంటాయి. అయితే, ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ట్రేడింగ్, డీ-మ్యాట్ అకౌంట్ తప్పనిసరి.

వీడియో క్యాప్షన్,

మీ ఇల్లు బంగారం కానూ!

సావరిన్ గోల్డ్ బాండ్

ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ బాండ్లను విడుదల చేస్తుంటుంది. 2-3 నెలలకోసారి వీటిని విడుదల చేస్తూ విండో ఓపెన్ చేస్తుంది. ఈ విండో వారం రోజుల పాటు తెరిచి ఉంటుంది.

(గమనిక: నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ కథనం రాశాం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సొంత అధ్యయనం, నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.)

ఇవి కూడా చదవండి:

గోల్డ్ స్వీట్ గురించి విన్నారా?

వీడియో క్యాప్షన్,

వీడియో: 'గోల్డెన్ స్వీట్' రుచి చూస్తారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)