మహారాష్ట్ర: 13 మందిని చంపిన ఆడ పులి కాల్చివేత

పులి

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో 13 మందిని చంపిన పులి కోసం కొన్ని నెలల పాటు తీవ్రంగా వేటాడిన అధికారులు దాన్ని కాల్చి చంపినట్టు ప్రకటించారు.

ఆరు సంవత్సరాల వయసున్న ఈ ఆడ పులి మహారాష్ట్ర అడవుల్లో రెండేళ్ల నుంచీ ఉంది.

అక్టోబర్‌లో అధికారులు ఈ పులిని పట్టుకునేందుకు పెర్ఫ్యూమ్ ప్రయోగం కూడా చేశారు.

ఈ పులిని సజీవంగా పట్టుకోవాలంటూ జంతు హక్కుల ఉద్యమం కార్యకర్తలు ప్రచారం చేశారు.

కానీ ఫారెస్ట్ రేంజర్లు పులిని తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చిచంపాల్సి వస్తే తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది.

సీనియర్ అటవీ అధికారి సునీల్ లిమాయే మహారాష్ట్రలో మనుషులను చంపిన ఆ పులిని కాల్చి చంపినట్టు బీబీసీకి చెప్పారు.

ఆగస్టులో ఈ ఆడ పులి తన 9 నెలల వయసున్న రెండు పిల్లలతో కలిసి యావత్మల్ జిల్లాలో ఉన్న పాండర్‌కవడాలో ముగ్గురిని చంపేసింది.

అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న 5 వేల మంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఫొటో సోర్స్, Pratik chorge/Hindustan Times

ఫొటో క్యాప్షన్,

అడవిలో వందకు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు

రెండేళ్లుగా పులి కోసం వేట

పులిని వేటాడడానికి ముందే రైతులు, పశువుల కాపరులు అడవులు, పొలాల నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.

బయటకు వెళ్లేటపుడు గుంపులుగా సంచరించాలని, బహిరంగ ప్రాంతాల్లో మల విసర్జనకు వెళ్లద్దని కోరారు.

టీ-1 అని పిలుచుకునే ఈ ఆడపులిని పట్టుకోడానికి అధికారులు వందకు పైగా కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.

గుర్రాలు, మేకలను చెట్లకు కట్టేసి ఎరలుగా ఉపయోగించారు. చెట్లపై మంచెలు ఏర్పాటు చేసి పులి కోసం 24 గంటల నిఘా పెట్టారు.

చాలా రోజులుగా దొరక్కుండా తప్పించుకుంటున్న పులిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు పురుషులు ఉపయోగించే కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ సీసాలు కూడా తీసుకొచ్చారు.

దీనిలో ఉన్న సివిటోన్ వాసన పులులను ఆకర్షిస్తుందని అమెరికాలో జరిగిన ఒక ప్రయోగంలో తేలడంతో అధికారులు దాన్ని కూడా పరీక్షించారు.

ఆగస్టులో ముగ్గురి ప్రాణాలు తీయడానికి ముందు 2016 నుంచి ఈ ఆడ పులి 20 నెలల్లో 10 మందిని పొట్టనపెట్టుకుంది.

13 మంది బాధితుల్లో ఏడుగురి గాయాల నుంచి సేకరించిన పులి లాలాజలాన్ని పరీక్షించిన అధికారులు వారిని ఆడపులి చంపిందని నిర్ధారించారు.

పులి తను చంపిన వారిని తినేయడంతో చాలా మృతదేహాల తలలు దొరకలేదు. దాంతో అది మనిషి మాంసానికి అలవాటు పడిందని గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images

పులి కోసం అధికారుల కష్టాలు

బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ అడవిలో పశువులు మేపుకోడానికి రావడంతో పులి వారిపై దాడి చేసి ఉంటుందని చెప్పారు.

గ్రామస్తులు తమ పశువులను చంపకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. పశుగ్రాసం కొరత ఉండడంతో వాళ్లు వాటిని మేపడానికి అడవిలోకి తీసుకెళ్లేవారని ఆయన చెప్పారు.

పులి వేటలో అధికారులకు అనుకోని ఘటనలు ఎదురయ్యాయి.

ఇటీవల అయిదు ఏనుగులపై షార్ప్ షూటర్ల బృందాన్ని వేటకు పురమాయించగా అందులో ఒక ఏనుగు కట్టుతప్పి సమీపంలోని ఊరిపై విరుచుకుపడింది.

ఏనుగు దాడిలో ఒక వృద్ధురాలు మరణించారు. గ్రామస్థులు ఆగ్రహించడంతో ఏనుగులను అక్కడి నుంచి వెనక్కు పంపించాల్సి వచ్చింది.

అయినప్పటికీ తాము ఓపిగ్గా వేట కొనసాగించి దాన్ని పట్టుకుంటామని అధికారులు చెప్పారు. చివరికి దాన్ని కాల్చి చంపారు.

ప్రపంచంలో ఉన్న పులుల్లో 60 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 2,200 పులులు జీవిస్తున్నాయి.

మహారాష్ట్రలో 200కు పైగా ఉన్నా, వాటిలో మూడో భాగం మాత్రమే రక్షిత ప్రాంతాల్లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)