'రఫేల్ ఒప్పందాన్ని విమర్శించడం కాదు, ప్రశంసించాలి' : బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images
‘‘రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి దళారీతనానికీ తావు లేదు. మమ్మల్ని విమర్శించడానికి బదులు ప్రశంసించాలి’’ అని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన రఫేల్ వివాదం గురించి నిర్మలా సీతారామన్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్ అడిగిన ఓ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ బదులిస్తూ..
"ఈ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగింది. గత ప్రభుత్వ ఒప్పందాలలాగ ఇందులో దళారులకు తావు లేదు. అందుకే తమ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బదులు, ప్రశంసించాలి’’ అని అన్నారు.
రెండేళ్ల క్రితం భారత్, ఫ్రాన్స్ మధ్య 36 యుద్ధ విమానాల కోసం ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో కంపెనీ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాల కోసం జరిగిన ఈ ఒప్పందం గురించి చాలా వివరాలు బహిర్గతం కాలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.
రాహుల్ గాంధీతోపాటు ఈ ఒప్పందాన్ని విమర్శిస్తున్నవారు, ఒప్పదంలో రెండు లోపాలు ఉన్నాయని చెబుతున్నారు.
- యుద్ధవిమానాల ధర యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన రేటు కంటే చాలా ఎక్కువగా ఉంది.
- భారత పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ సంస్థతో దసో కంపెనీ ఒప్పందం చేసుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్రిత పక్షపాతం ఉంది.
ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వలేదు. విపక్షాలు మాత్రం తమ విమర్శల జోరు పెంచుతున్నాయి. ఈ ఒప్పందం గురించి వస్తున్న విమర్శలపై కొందరు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. దాంతో కోర్టు ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగింది.
ఈ నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్ గురువారం నాడు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
ఇంటర్వ్యూ వీడియో
నిర్మలా సీతారామన్‌తో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
బీబీసీ: అందరూ రిలయన్స్ పేరు ప్రస్తావిస్తూ, ఇది ఆశ్రిత పక్షపాతం అని విమర్శిస్తున్నారు?
సీతారామన్: నేను అధికారికంగా ఏదైనా అంశం మీద వ్యాఖ్య చేయాలంటే నాకు దానికి తగిన డాక్యుమెంట్లు కావాలి. మీడియా కానీ, ప్రతిపక్షాలు కానీ ఆరోపణలు చేస్తూ స్పందించమంటే ప్రభుత్వం ఇటువంటి మీడియా కథనాలను ఆధారం చేసుకుని స్పందించదు. మాకు సరైన ఆధారాలు, డాక్యుమెంట్లు కావాలి. అపుడే మేం స్పందిస్తాం.
బీబీసీ: దసో కంపెనీ తమ భారతీయ భాగస్వామి పేరుతో అధికారికంగా మీవద్దకు రాలేదని మీరు చెబుతూ వచ్చారు?
సీతారామన్: అంతేకదా, వారు పూర్తి వివరాలతో నాదగ్గరకు రావాలి.
బీబీసీ: కానీ వారు విలేఖరుల సమావేశం నిర్వహించారు కదా?
సీతారామన్: నేను మీడియా కథనాలకు స్పందించను.
ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: అవి మీడియా కథనాలు కాదు. 2016లో దసో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
సీతారామన్: ఆ కార్యక్రమం రఫేల్ ఒప్పందంలో అంశాలను నిర్ణయిస్తుందా? అటువంటి వాటి ఆధారంగా నేను ఒప్పందంలోని అంశాలపై ఒక నిర్ణయానికి రావడానికి నిబంధనలు ఒప్పుకోవు.
బీబీసీ: మీరు నిబంధనలను సాకుగా చూపుతూ వాటి వెనక దాక్కుంటున్నట్టుగా అనిపిస్తోంది.
సీతారామన్: నిబంధనల వెనకాల దాక్కోవడమా! నేను మీకు నియమనిబంధనలేంటో చెబుతున్నాను. దసో నా దగ్గరకు అధికారికంగా వచ్చి ఈ అంశాలను ప్రస్తావిస్తే అపుడు అధికారికంగా, "అవును వాళ్లు నా వద్దకు వచ్చారు, నాకు దస్తావేజులు చూపించారు" అని అన్ని విషయాలూ చెప్పేదాన్ని.
బీబీసీ: రాహుల్ గాంధీ చాలా మంది దగ్గరకు వెళ్తున్నారు. మీరు చెబుతున్న సమాధానాల్లో స్పష్టత లేదని, వాస్తవం కాదని అంటున్నారు.
సీతారామన్: మీరు మా సమాధానాలు చదివారా?
బీబీసీ: నేను చదివాను.
సీతారామన్: నా జవాబు వాస్తవం కాదని మీరు అనుకుంటున్నారు. అలా లేదనుకుంటే ఏ సమాధానం యధార్థంగా అనిపించలేదో చెప్పండి. రాహుల్ గాంధీ రఫేల్ యుద్ధ విమానం ధరను ఐదు ప్రాంతాల్లో, ఐదు రకాలుగా చెప్పారు. మీరు వాటిలో ఏది కరెక్ట్ అనుకుంటారు?
ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ: నేను మీరు పార్లమెంటులో చెప్పిందే చెబుతాను. బేసిక్ మోడల్ ధర 670 కోట్లు
సీతారామన్: మేం పార్లమెంటులో 2016 డిసెంబరులో చెప్పిన బేసిక్ ధరను, వారి మాటల్లో వాళ్లు నిర్ణయించిన ధరలతో పోల్చి చూడండి.
బీబీసీ: ఒప్పందం పూర్తి మొత్తం 59 వేల కోట్లు లేదా 6.87 బిలియన్ డాలర్లు ఇది నిజమేనా?
సీతారామన్: నేను మీకు ధర గురించి చెప్పబోవడం లేదు. మేం ఏ ధర చెప్పామో, దాన్ని పార్లమెంటులో చెప్పేశాం.
బీబీసీ: కానీ అది బేసిక్ ధర కదా?
సీతారామన్: అవును. పార్లమెంటులో మమ్మల్ని అదే అడిగారు. మేం ఆ వివరాలు ఎంపీలకు చెప్పాం.
బీబీసీ: ఈ ఒప్పందం భారత్ లోనే కాకుండా, ఫ్రాన్స్ లో కూడా ప్రకంపనల్ని సృష్టించింది కదా?
సీతారామన్: భారత్‌లో, ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చాలా కాలం ప్రభుత్వంలో కొనసాగింది. రక్షణ మంత్రిత్వశాఖ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయంపై వారికి స్పష్టమైన అవగాహన ఉంది.
భారత వైమానిక దళంలో ఫైటింగ్ స్క్వాడ్రన్ల సంఖ్య తక్కువైపోతోంది. ప్రస్తుతం ఉన్న స్క్వాడ్రన్స్ క్షీణిస్తున్నాయి అన్నది నిజం. ఆవశ్యకత ఉండడం వల్లనే ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం.
అవినీతి లేని చోట కూడా ఏదో ఉందంటూ వెతకడం వెతకడం హాస్యాస్పదం. ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. దసో కంపెనీ సీఈఓ భారత్‌కు వచ్చారు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా జవాబిచ్చారు.
ఇవి కూడా చదవండి
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- లబ్‌డబ్బు: రఫేల్ డీల్ వివాదం ఏంటి? ఎందుకు? ఎలా?
- అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?
- రఫేల్ డీల్: అంబానీ సంస్థను.. ‘భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. మాకు ఇచ్చిన వారిని తీసుకున్నాం’
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)