తెలంగాణ ఎన్నికలు: ‘ఆమె’కు ఎందుకు అంత ప్రాధాన్యం దక్కడం లేదు?

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి

తెలంగాణలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 48 శాతం... శాసన సభలో వారి ప్రాతినిధ్యం 7.56 శాతం. అధికారంలో మహిళలకు ఏ స్థాయిలో భాగస్వామ్యం కల్పిస్తున్నారో ఈ అంకెలు చూస్తే అర్థమవుతుంది.

2014 ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నాలుగు ప్రధాన పార్టీల నుంచి 476 మంది అభ్యర్థులు పోటీపడగా ఇందులో మహిళలు కేవలం 39 మంది. ఎన్నికల్లో గెలిచిన మహిళలు తొమ్మిది మంది.

ఆరుగురు టీఆర్ఎస్ నుంచి ఎన్నికవగా, ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచారు. పద్మా దేవేందర్ రెడ్డి, కొండా సురేఖ, కోవా లక్ష్మీ, అజ్మీరా రేఖ, బోడిగ శోభ, గొంగడి సునీత టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవగా, కాంగ్రెస్ నుంచి గీతా రెడ్డి, డీకే అరుణ, పద్మావతి రెడ్డి విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి 14 మంది మహిళలకు టికెట్లు కేటాయించగా, టీఆర్‌ఎస్ 11 మందికి, కాంగ్రెస్ 9 మంది మహిళలకు సీట్లిచ్చాయి. ఇక 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గెలిచిన మహిళ కవిత ఒక్కరే.

సగం ఓటర్లు మహిళలే.. ప్రాతినిధ్యంలో పావు శాతం కూడా లేరు

నాటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు గమనిస్తే, మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. కానీ, దానికి తగ్గట్టుగా శాసనసభలో వారికి ప్రాతినిధ్యం దక్కడం లేదు.

2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 2,93,51,248.

ఇందులో పురుష ఓటర్లు 1,47,53,468

మహిళా ఓటర్లు 1,40,90,973

అంటే దాదాపు సగం ఓటర్లు మహిళలు. కానీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మహిళలు కేవలం తొమ్మిది మంది.

1957లో కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ( నాటి హైదరాబాద్ రాష్ట్ర పరిధి) ఎన్నికలు జరిగాయి.

అప్పుడు మొత్తం ఓటర్ల సంఖ్య 56,03585. వీరిలో మహిళ ఓటర్లు సుమారు 20 లక్షలు.

ఆ ఎన్నికల్లో మొత్తంగా 17 మంది మహిళలు పోటీ చేయగా ఏడుగురు గెలుపొందారు.

ఫొటో క్యాప్షన్,

ఆరుట్ల కమలాదేవి

గతమే ఘనం...

తెలంగాణ రాజకీయాల్లో, సాంస్కృతిక ఉద్యమాల్లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి, మలిదశ ఉద్యమాల్లోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. కొందరు రాజకీయ రంగంలోనూ రాణించారు.

స్త్రీల హక్కుల కోసం పోరాడిన మసూమాబేగం రాజకీయాల్లో సత్తా చాటారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దేశంలోనే మొదటి ముస్లిం మంత్రిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమంలోనూ ఆమె పాలుపంచుకున్నారు.

దళిత ఉద్యమాల నుంచి వచ్చిన టీఎన్ సదాలక్ష్మి, ఈశ్వరీబాయి చట్టసభల్లో రాణించారు.

టీఎన్‌ సదాలక్ష్మి 1960-62 మధ్య డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం విప్లవోద్యమాల నుంచి వచ్చి ఎన్నికల రంగంలో గెలుపొందారు.

కమలాదేవి ఆలేరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందారు. తుంగతుర్తి నుంచి మల్లు స్వరాజ్యం వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.

కమలా దేవి పీడీఎఫ్ అభ్యర్ధిగా 1952లో, సీపీఐ అభ్యర్ధిగా 1957, 1962 ఎన్నికల్లో వరుసగా నెగ్గి హాట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు..

1964లో సీపీఐ శాసన సభ పక్ష నేతగా పనిచేశారు.

ప్రాతినిధ్యం 15 శాతం లోపే...

1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం 15 శాతానికి మించడం లేదు.

2014 ఎన్నికలు: 119 నియోజకవర్గాలకు గాను 76 నియోజకవర్గాల్లో మొత్తం 133 మంది మహిళలు బరిలో నిలిచారు. వారిలో 9 మంది విజయం సాధించారు.

2009: 74 చోట్ల 125 మంది మహిళలు పోటీ చేయగా 16 మంది విజయం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో మహిళ ప్రాతినిధ్యం 13.45 శాతం.

2004: ఈ ఎన్నికల్లో 10 మంది మహిళలు గెలిచారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల శాతం 8.4 శాతం.

1999: ఆరుగురు మాత్రమే ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం 5.04 శాతం.

1994: ఈ ఎన్నికల్లో ఆర్మూరు నుంచి అన్నపూర్ణ ఒక్కరే గెలుపొందారు.

1989: ముగ్గురు మాత్రమే గెలిచారు. సికింద్రాబాద్ నుంచి మేరీ రవీంద్రనాథ్, మేడ్చల్ నుంచి సింగిరెడ్డి ఉమా వెంకట రామారెడ్డి, జహీరాబాద్ నుంచి గీతా రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1985: ఈ ఎన్నికల్లో ఒక్కరే విజయం సాధించారు. షాద్‌నగర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగి ఎం.ఇందిర గెలుపొందారు.

1983: ఈ ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు. సనత్ నగర్ నుంచి కాట్రగడ్డ ప్రసూన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తుంగతుర్తి నుంచి మల్లుస్వరాజ్యం సీపీఎం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

1978: ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్(ఐ) తరఫున పోటీ చేసి సుమిత్రాదేవి గెలిచారు. తుంగతుర్తి నుంచి సీపీఐ నుంచి పోటీ చేసి మల్లు స్వరాజ్యం విజయం సాధించారు.

1972: 49 మంది మహిళలు పోటీ చేయగా ఒక్కరూ గెలవలేదు.

1967: ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు ఎన్నికయ్యారు. చెన్నూరు నుంచి ఎన్.ఆర్.దేవి, రామాయంపేట నుంచి రత్నమ్మ, ఎల్లారెడ్డి నుంచి జె.ఈశ్వరీ బాయి (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), మేడ్చల్ నుంచి ఎస్.దేవి, మలక్ పేట నుంచి బీఎస్‌పీ రెడ్డి, వనపర్తి నుంచి జేకే దేవి గెలుపొందారు.

1962: ఎనిమిది మంది గెలిచారు. వనపర్తి నుంచి కుముదిని దేవి, హైదరాబాద్ ఈస్ట్ నుంచి సుమిత్రా దేవి (ఎస్సీ), జూబ్లీహిల్స్ నుంచి రోడామేస్రీ, ఆందోల్ నుంచి ఎస్.ఎల్. దేవి, మెదక్ నుంచి కేవల్ ఆనందాదేవి, రామాయంపేట నుంచి పెద్ద రత్తమ్మ , ఎల్లారెడ్డి ఎస్సీ నియోజకవర్గం నుంచి టీఎన్ సదాలక్ష్మీ, ఆలేర్ నుంచి ఆరుట్ల కమలాదేవి గెలుపొందారు.

1957: కేవలం తెలంగాణ ప్రాంతానికే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తంగా 17 మంది మహిళలు పోటీ చేయగా ఏడుగురు మహిళలు గెలుపొందారు.

1951: హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. 142 నియోజకవర్గాలు ఉండేవి. ఈ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు విజయం సాధించారు.

షాలిబండ్ నుంచి మసూమా బేగం, పరిగి నుంచి షా జహాన్ బేగం, మక్తల్-ఆత్మకూరు నుంచి శాంతాబాయి, బాన్సువాడ నుంచి లక్ష్మీబాయి, సిరిసిల్ల నుంచి జేఎం రాజమణి దేవి, ఆలేరు నుంచి అరుట్ల కమలా దేవి గెలుపొందారు.

‘గెలువరని అపనమ్మకం’

రాజకీయ వారసత్వం ఉన్న మహిళలకే పార్టీలు ఎక్కువగా సీట్లు కేటాయిస్తుంటాయిని, రాజకీయ నేపథ్యం లేని మహిళలకు టికెట్లు రావడం కష్టమేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద అభిప్రాయపడ్డారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మహిళలు గెలువలేరు. రాజకీయం చేయలేరని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. ఎన్నికల్లో ప్రతి సీటూ ఎంతో కీలకం. అందుకే మహిళలకు సీట్లు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అన్ని పార్టీలలోనూ ఇదే పరిస్థితి ఉంది.’’ అని పేర్కొన్నారు.

‘‘స్త్రీలకు విధాననిర్ణయాల్లో, పాలనలో చోటు కల్పించకపోవడం పితృస్వామ్య దొరల మనస్తత్వానికి ప్రతీక. ప్రస్తుత పార్టీల ధోరణి ఇలాగే ఉంది’’ అని సామాజిక కార్యకర్త దేవి బీబీసీతో అన్నారు.

మంత్రివర్గంలో మొండిచేయి

తెలంగాణ తొలి ప్రభుత్వంలో దళిత, మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి 2014లో ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే, మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదు. మహిళా మంత్రి లేకుండానే తొలి తెలంగాణ ప్రభుత్వం ముగిసింది. దీనిపై మొదటి నుంచి చర్చ జరగుతూనే ఉంది.

రాష్ట్రమంత్రివర్గంలో మహిళలకు చోటివ్వలేదని న్యాయవాది శ్రీశైలం ఇటీవల హైకోర్ట్‌లో పిల్ దాఖలు చేశారు. అయితే, మంత్రివర్గంలో ఎవరుండాలదనే ముఖ్యమంత్రి విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుందని హైకోర్ట్ ఈ కేసును కొట్టివేసింది.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళ మంత్రి లేకపోవడంపై మహిళా సంఘాల నుంచి విమర్శలొస్తూనే ఉన్నాయి.

''చివరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పురుషుడినే మంత్రిగా నియమించారు. విధాన నిర్ణయాల్లో మహిళలు పాలుపంచుకోకుండా చేశారు''అని సామజిక కార్యకర్త శ్రావ్య రెడ్డి మందాడి బీబీసీతో అన్నారు.

ఏం చేశామన్నది ముఖ్యం: టీఆర్ఎస్

అయితే మహిళలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలను టీఆర్‌ఎస్ కొట్టిపారేసింది. పార్లమెంట్ సభ్యురాలు కె.కవిత, మహిళలు ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు, మహిళల కోసం ఏం చేసామన్నది ముఖ్యం అన్నారు.

''నిజమే, మహిళా మంత్రి లేరు. అలాగని మేం మహిళల సంక్షేమం గురించి మర్చిపోలేదు. కేంద్ర మంత్రివర్గంలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశ పెట్టలేకపోయారు. కాబట్టి, మహిళలు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు" అని కవిత అన్నారు.

ఆదర్శం హైదరాబాద్ రాష్ట్రం...

ఒక్క మహిళా మంత్రికి స్థానం లేకుండానే తెలంగాణ తొలి ప్రభుత్వం ముగిస్తే, హైదరాబాద్ రాష్ట్ర తొలి కేబినెట్‌ ఒక ముస్లిం మహిళకు చోటిచ్చి రికార్టు సృష్టించింది.

మాసూమా బేగం దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళగా చరిత్రలో నిలిచారు. సాంఘీక సంక్షేమం, వక్ఫ్ బోర్డు శాఖల మంత్రిగా ఆమె పనిచేశారు.

తెలంగాణ ఉద్యమంలోనూ మసుమాబేగం కీలకపాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)