తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”

  • 9 నవంబర్ 2018
పాతబస్తీ చార్మినార్ తెలంగాణ ఎన్నికలు Image copyright Getty Images

'నేటి తరం బాగా చదువుకుంటోంది. ఇక్కడివారు హైటెక్ సిటీ వైపు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు పాతబస్తీ అంటే శిథిలమైన భవనాలు, నిజాం కాలపు ఆనవాళ్లు, గత చరిత్ర జ్ఞాపకాలు మాత్రమే" తన ఆటోను చార్మినార్ లాడ్‌బజార్ గల్లీలో తిప్పుతూ అన్నారు సయీద్ అబ్దుల్(53).

హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాలుగా నిలిచే పాతబస్తీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. పాతబస్తీలో ఎనిమిది నియోజకవర్గాలున్నాయి. చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, గోషామహల్, కార్వాన్, మలక్‌పేట, నాంపల్లి నియోజకవర్గాల పరిధిని పాతబస్తీగా వ్యవహరిస్తుంటారు.

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం పాతబస్తీలో 21,76,045 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క గోషామహల్ నియోజకవర్గం తప్ప మిగిలిన ఏడు నియోజక వర్గాల్లో ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇతే హదుల్ ముస్లిమీన్) పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది.

గతంతో పోల్చితే పాతబస్తీలో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడి ఎనిమిది నియోజకవర్గాల్లో 11,30,545 మంది పురుష ఓటర్లు ఉంటే, మహిళా ఓటర్లు 10,45,262 మంది ఉన్నారు.

ఎన్నికల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే అసదుద్దీన్ ఓవైసీ ఈ సారి పాతబస్తీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మహిళలతో సమావేశం అవుతున్నారు.

Image copyright ASADUDDIN/TWITTER
చిత్రం శీర్షిక పాతబస్తీలో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తోన్న అసదుద్దీన్ ఓవైసీ

దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ, "రాజకీయ నేతలు ఆమోదయోగ్యంగా ఉండాలంటే ప్రజల విశ్వాసం పొందాలి. వారితో కూర్చొని మాట్లాడి సమస్యలు అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి మహిళల సమస్యలు తెలుసుకోవాలి. నేను మహిళా ఓటర్ల సమస్యలు విన్నా. వాటిని మరింత సమర్థంగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నా'' అని పేర్కొన్నారు.

'వాగ్దానాలకే పరిమితం'

పాతబస్తీలో ముస్లింల జనాభా అధికం. ఎనిమిది నియోజక వర్గాల్లో వారి ఓట్లే నిర్ణయాత్మకంగా ఉన్నాయి. ముస్లింల అభివృద్ధిపై సచార్ కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని ఇక్కడి మేధావులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు.

ముస్లింల జీవన ప్రమాణాల పెరుగుదలకు విద్యా, ఉద్యోగం, ఉపాధిలో వారికి రిజర్వేషన్లు పెంచాలని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని తదితర కీలక సిఫారసులను సచార్ కమిటీ సూచించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు.

ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ కొన్నాళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానం కేంద్రానికి పంపింది. అయితే, రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదు.

పాతబస్తీ అభివృద్ధిపై ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని రాజకీయ విశ్లేషకులు, సియాసత్ పత్రిక సంపాదకులు జాహిద్ అలీఖాన్ బీబీసీకి చెప్పారు.

'50 ఏళ్లుగా నేతలు వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు కానీ, పనులు జరగడం లేదు. ఏ పార్టీ వచ్చినా ఇదే పరిస్థితి' అని పేర్కొన్నారు.

'పాతబస్తీ రాజకీయం అంటే కేవలం ఒకరిపై ఆధారపడి ఉండటమే. ఇక్కడి పార్టీలు అధికార పార్టీలతో పొత్తు పెట్టుకొని స్వలాభం చూసుకుంటున్నాయి'' అని అలీఖాన్ విమర్శించారు.

2009 ఎన్నికల్లో ఈయన అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసి ఓడిపోయారు.

'ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా దేశాలు పాతబస్తీలను వారసత్వ సంపదగా భావించి పరిరక్షిస్తాయి. కానీ, ఇక్కడి ప్రభుత్వాలకు అవేవి పట్టవు' అని ఆయన పేర్కొన్నారు.

Image copyright Getty Images

'మహిళా సాధికారత శూన్యం'

పాతబస్తీలో ఉన్న మరో ప్రధాన సమస్య డబ్బుల కోసం అమ్మాయిలను దుబాయి షేక్‌లకిచ్చి పెళ్లి చేయడం. కొన్నేళ్లుగా ఈ సమస్య పెరుగుతోంది. తెలంగాణ పోలీసులు గతేడాది దీనికి సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడ మహిళను మనిషిగా కాకుండా వస్తువుగా చూస్తున్నారని జమీలా నిషత్ పేర్కొన్నారు. పాతబస్తీలో 'షహీన్' అనే మహిళా స్వచ్చంధ సంస్థను ఆమె నడుపుతున్నారు.

'పాతబస్తీలో మహిళా సాధికారత శూన్యం. మౌలిక సౌకర్యాలు కూడా లేవు. ఈ ప్రభావం మహిళలపై ఎక్కువగా పడుతోంది. ఈతరం అమ్మాయిలు చదువుకున్నా, ఉద్యోగం రావటం కష్టంగా మారుతోంది. ఈ సమస్యలను లోతుగా అధ్యయనం చేసే రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తేనే మార్పు వస్తుంది'' అని జమీలా పేర్కొన్నారు.

పాతబస్తీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. వెయ్యి కోట్లతో ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ గత ఏప్రిల్‌లో ప్రకటించారు.

అయితే, ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

'ముస్లిం విద్యార్థుల ఉద్యోగ కల్పనకు ఐటీ కారిడార్ ఏర్పాటు, తాగు నీటి జలాశయాలు, నిరుపేద ముస్లిం మహిళలకు కుట్టు మెషిన్ల పంపిణీ.. ఇలా చాలా వాగ్దానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. నిధులు కేటాయించారు. కానీ, వాస్తవానికి ఎంత వరకు పనులు జరిగాయో ప్రజాప్రతినిధులే చెప్పాలి' అని మజ్లీస్ ఏ బచావో తెహరీక్ ప్రతినిధి అంజాద్ ఉల్లా ఖాన్ అన్నారు.

'పాతబస్తీలో ఓ సామెత ప్రాచుర్యంలో ఉంది. ప్రభుత్వ వాగ్దానాలు గాలిబ్ రచనల్లోని ప్రేయసి వాగ్దానంలా ఉన్నాయి అని.

గాలిబ్‌ను కలుస్తానని అతడి ప్రేయసి రోజూ వాగ్దానం చేస్తుంది. కానీ, కలవదు. ప్రభుత్వం కూడా అలానే ఉంది' అని ఆయన అన్నారు.

'తెలంగాణ వస్తే పాతబస్తీలో వెలుగులొస్తాయని అన్నారు. కానీ, ప్రభుత్వ వాగ్దానాలు గాలి మాటలే అయ్యాయి' అని అంజాద్ ఉల్లాఖాన్ వ్యాఖ్యానించారు.

Image copyright Rakesh Empelly/facebook
చిత్రం శీర్షిక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని షెహజాదీ బీజేపీ తరఫున చంద్రాయణగుట్ట నుంచి బరిలో దిగుతున్నారు

అక్బరుద్దీన్‌పై యువతి పోటీ

చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఈసారి ఓ మహిళను బీజేపీ బరిలో దింపుతోంది. ఈ ప్రాంతం 1994 నుంచి ఎంఐఎం కంచుకోటగా ఉంది. ఆ పార్టీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయనపై బీజేపీ తరఫున సాయిదా షెహజాదీ పోటీకి దిగుతున్నారు.

'పాతబస్తీ ప్రజలకు సరైన రాజకీయ మార్గదర్శకత్వం లేకపోవటమే ఇక్కడి సమస్యలకు కారణం. స్థానికులను భయపెట్టి, మతం పేరుతో విభజించి రాజకీయాలు చేస్తున్నారు'' అని షెహజాదీ బీబీసీతో అన్నారు.

డబీర్‌పురాలోని ఒక ఇరానీ కేఫ్‌లో మిత్రులతో టీ తాగుతూ ఇర్ఫాన్ ఎన్నికల గురించి చర్చిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి వారిని కలిసినప్పుడు, మా జీవితాలను మార్చే అవకాశం ఓటు ద్వారా కలుగుతుందని భావిస్తున్నాని చెప్పారు. ఇర్ఫాన్ ఈ ఎన్నికల్లోనే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

"చిన్నప్పటి నుంచి సర్కారు బడిలో చదువుకున్నాం. ఒక్క ముక్క కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడలేం. కాలేజ్‌లో చెప్పే ఇంగ్లిష్ పాఠాలు అర్థంకావు. మా దగ్గర మంచి స్కూళ్లు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు. అర్ధరాత్రి మంచినీటి కోసం వీధుల్లో నిలబడటంతోనే మా బాల్యం గడిచింది. మా పెద్దలు ఎవరికి ఓటు వేశారనేది అనవసరం. మేం మాత్రం అభివృద్ధి చేసేవాళ్లకే ఓటు వేస్తాం'' అని తన మిత్రులతో కలిసి చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ట్రంప్ పదవి ఊడుతుందా.. అసలు అభిశంసన అంటే ఏంటి

‘అయోధ్య తీర్పులో స్పష్టంగా చెప్పారు, రామ జన్మస్థలం మసీదు కిందే ఉంది’ - సి.ఎస్.వైద్యనాథన్

World Kindness Day: ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు

అయోధ్య తీర్పు: ‘తప్పు చేసిన దోషికే బహుమతి ఇచ్చారు’ - జస్టిస్ లిబర్హాన్ కమిషన్ న్యాయవాది అనుపమ్ గుప్తా

ట్రంప్‌పై పోటీచేయాలనే ఒత్తిడి వస్తోంది: హిల్లరీ క్లింటన్

ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం

సాంబార్ సరస్సు తీరంలో వెయ్యికి పైగా పక్షుల మృతికి కారణాలేమిటి

తాలిబన్ల వద్ద బందీలైన ప్రొఫెసర్ల విడుదలకు మిలిటెంట్లను విడిచిపెట్టనున్న అఫ్గానిస్తాన్