మూఢనమ్మకం: దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా?

  • 8 నవంబర్ 2018
గుడ్లగూబల బలి Image copyright Getty Images

గుడ్లగూబను ఒక మాంసం తినే పక్షిగానే కాదు, శుభ-అశుభాలకు జోడించి కూడా చూస్తుంటారు. రాత్రి గుడ్లగూబ కూత పెడితే దానిని అపశకునంగా, దురదృష్టంగా భావిస్తుంటారు.

మహమ్మద్ గజనీ(971-1030) దారుణాలను చూస్తూ వచ్చిన ఆయన మంత్రుల్లో ఒకరు సుల్తాన్‌కు కనువిప్పు కలిగించాలని అనుకున్నాడు. ఎన్ని అరాచకాలు చేశాడో గజినీకి అర్థమయ్యేలా చెప్పడానికి ఒక ఎత్తు వేశాడు.

ఒక రోజు రాత్రి మంత్రి, గజనీని దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ అడవిలో దాదాపు ఎండిపోయిన ఒక చెట్టు పైన రెండు గుడ్లగూబలు ఉన్నాయి. కొద్దికొద్దిగా చంద్రుడి వెలుగు పడుతోంది.

సుల్తాన్ మంత్రితో "ఈ గుడ్లగూబలు రెండూ ఏం మాట్లాడుకుంటున్నాయి?" అని అడిగారు.

మంత్రి ఆయనతో "సుల్తాన్, ఒక గుడ్లగూబ ఇంకోదానితో తమ పిల్లల పెళ్లి గురించి మాట్లాడుతోంది. ఇక రెండో గుడ్లగూబ కట్నంగా తమకు ఎన్ని మనుషులే లేని గ్రామాలు లభిస్తాయో తెలుసుకోవాలని అనుకుంటోంది" అన్నాడు.

దాంతో సుల్తాన్ "అయితే, ఆ మొదటి గుడ్లగూబ దానికి ఏం సమాధానం ఇచ్చింది?" అన్నారు.

దాంతో మంత్రి "సుల్తాన్ ప్రాణాలతో ఉన్నంతవరకూ, జనం లేని గ్రామాలకు ఎలాంటి లోటు ఉండదని ఆ గుడ్లగూబ చెప్పింది" అన్నారు. మంత్రి మాటలు సుల్తాన్‌పై చాలా ప్రభావం చూపించాయని, ఆయన తన కత్తిని ఒరలో పెట్టారని చెబుతారు.

Image copyright Getty Images

ఇప్పటికీ గుడ్లగూబలు బలి

గుడ్లగూబలను కొందరు చాలా తెలివైనవిగా భావిస్తే, కొందరు మాత్రం వాటికి తెలివి లేదని, అపశకునం అని భావిస్తారు. దీపావళి రాగానే తమ స్వార్థం కోసం గుడ్లగూబలను బలివ్వడానికి సిద్ధమవుతారు. అమావాస్య పూజల పేరుతో ఇప్పటికీ గుడ్లగూబలను బలి ఇస్తున్నారు.

ఈ సీజన్‌లో గుడ్లగూబలను భారీ ధరకు అమ్ముతారు. ఒక్కో గుడ్లగూబ రేటు 30 వేల వరకూ పలుకుతుంది. దిల్లీలో ఒక గుడ్లగూబను 50 వేలకు అమ్ముతామని చెప్పే వాళ్లు కూడా కొందరు కనిపిస్తారు. కానీ వాళ్లు మాత్రం జైపూర్ లేదా మీరట్ నుంచి ఒక్కోదాన్ని మూడు లేదా నాలుగు వందలకే కొనుక్కొస్తుంటారు.

మూడు వందలకు కొన్న గుడ్లగూబ ధర 30 వేలు అవడం వెనుక ఒకే ఒక కారణం ఉంది. మూఢనమ్మకం. లక్ష్మీ పూజ రాత్రి గుడ్లగూబను బలి ఇవ్వడం వల్ల తర్వాత ఏడాది వరకూ వాళ్ల ధనధాన్యాలు, సుఖసంపదలు అలాగే ఉంటాయని కొందరు నమ్ముతారు.

గుడ్లగూబల క్రయవిక్రయాల మార్కెట్ ఎక్కువగా రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లో వ్యాపించి ఉంది. అక్కడ కలందర్లు వాటిని పట్టుకుంటారు.

వీళ్లు ముఖ్యంగా జైపూర్, భరత్‌పూర్, అల్వర్, ఫతేపూర్ సిక్రీ దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. కోరాయీ-కరావ్లీ, మధుర దగ్గరున్న కోసీ-కలా లాంటి గ్రామాల్లో గుడ్లగూబల రహస్య వ్యాపారం భారీగా జరుగుతుంది.

కొంతమంది గిరిజనులు, ముఖ్యంగా బహేలియా తెగవారు చిన్న చిన్న గుడ్లగూబలను పట్టుకుంటారు. దీపావళి సమయానికి భారీ ధరలకు అమ్ముకోడానికి వాటిని పెంచుతారు.

గుడ్లగూబల పరిమాణం బట్టి వాటి ధర ఉంటుంది. దాని కళ్ల నుంచి, మాంసం వరకూ ప్రతిభాగాన్నీ తాంత్రిక పూజల్లో ఉపయోగిస్తారు.

Image copyright Getty Images

మూఢనమ్మకాలే కారణం

అమావాస్య రాత్రి జరిగే తాంత్రిక పూజల్లో కొందరు గుడ్లగూబలను బలి ఇస్తారు.

ఆ పూజలు చేసేవారికి తాంత్రికులు కొన్ని ఆచారాలు పాటించాలని చెబుతారు. శారీరక సంబంధాలు పెట్టుకోకూడదని, శరీరంపై అవాంఛిత రోమాలు ఉండకూడదని, అర్థరాత్రి స్నానం చేయాలని చెబుతారు.

తర్వాత ఒక తెల్లటి పంచె కట్టుకోవాలని, పై భాగం నగ్నంగా ఉండాలని చెబుతారు. ఆ తర్వాత కళ్లు మూసుకుని కూచోవాలంటారు.

ఎదురుగా కూర్చున్న మంత్రగాడు మంత్రాలను చదువుతూ పూజలు చేయడం మొదలుపెడతాడు. ఇవి రకరకాలుగా ఉంటాయి. అప్పుడప్పుడు ఎవరైనా అమ్మాయిలు (అప్పుడే పిరియడ్స్ మొదలైన వారు) ఉపయోగించిన శానిటరీ న్యాప్‌కిన్‌ను గుడ్లగూబకు చుట్టి కాల్చేస్తారు. ఒక్కోసారి కొత్తగా పెళ్లైన మహిళ నెలసరి సమయంలో ఉపయోగించిన లోదుస్తులను చుట్టి తగలబెడతారు.

చిన్న పిల్లల మలంతో కూడా మంత్రగాళ్లు పూజలు చేస్తారు. ఇవి జరిగే సమయంలో గుడ్లగూబకు మద్యం తాగించి మత్తులో ఉంచుతారు.

ఈ మంత్ర తంత్రాలు జరుగుతున్న సమయంలో ఆ చుట్టుపక్కలకు చిన్నపిల్లలు, మహిళలు రాకుండా చూసుకుంటారు.

ఒకవేళ ఎవరైనా మహిళలు దానిని ఆసక్తిగా గమనిస్తే, ఆమె జీవితంలో పిల్లలు పుట్టరని, పిల్లలెవరైనా వాటిని చూస్తే చనిపోతారని భయపెడతారు.

మొఘలుల కాలంలో బలులు

గుడ్లగూబలను బలి ఇచ్చే ఆచారానికి చాలా మంత్ర క్రియలతో సంబంధం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ఇబ్రహీమ్ పట్టీకి చెందిన ఇబ్రహీం భాయ్ చెప్పారు.

గుడ్లగూబ వైభవ లక్ష్మి వాహనం అని, త్వరగా డబ్బు సంపాదించాలని అనుకునేవారు మంత్రగాళ్లు చెప్పిన అన్ని పనులూ చేస్తారని తెలిపారు.

ఆయన కుటుంబం రాజస్థాన్ ధోల్‌పూర్‌ నుంచి ఇక్కడకు వలస వచ్చింది. మొఘలుల వంశం అంతం అయ్యే సమయంలో కూడా గుడ్లగూబల బలి ఇచ్చినట్టు కొన్ని ఆధారాలున్నట్టు ఆయన చెబుతారు.

మహమ్మద్ షా రంగీలా, ఆయనకు ముందు మైజుద్దీన్ జహందార్ షాహ్, మహమ్మద్ ఫరూక్‌సేర్ ఇలాంటి తాంత్రిక పూజల్లో పాల్గొన్నారని చెప్పారు.

గుడ్లగూబలను, తమ భార్యలు నెలసరి సమయంలో ఉపయోగించిన దుస్తులను అమావాస్య రాత్రి తాంత్రిక పూజలకు వాడేవారని చెప్పారు.

ఇబ్రహీం భాయ్ చరిత్రకారుడు కారు, ఆయన పెద్దగా చదువుకోలేదు. ఆయన తమ పెద్దవాళ్లు చెబుతూ వచ్చిన కొన్ని కథల ఆధారంగా ఈ విషయాలు చెప్పారు.

తమకు తెలిసిన కాంజే అనే ఒక నీలికళ్ల వ్యక్తి తల్లి రెండో ప్రపంచ యుద్ధంలో ఒక అమెరికా సైనికుడిని ప్రేమించిందని, ఆమె కూడా కొన్ని ఏళ్ల వరకూ రాణీగంజ్‌లో గుడ్లగూబలను పెంచేదని, దీపావళి రాగానే వాటిని అమ్మేదని చెప్పాడు.

నీ అంతం చాలా భయానకంగా ఉంటుందని కాంజేను కొందరు హెచ్చరించారని ఆయన చెప్పారు. తర్వాత కాంజే, ఆయన భార్య, నలుగురు పిల్లలు అందరూ టీబీతో చనిపోయారని చెప్పారు. అంటే అది గుడ్లగూబలను బలి ఇవ్వడం వల్లే జరిగిందా?

Image copyright ARSHDEEP SINGH / WPY

గుడ్లగూబను చంపడం పిచ్చితనం

గుడ్లగూబలు వేటాడే పక్షులు. పర్యావరణం పరిశుభ్రంగా ఉండడానికి ఇవి సాయం చేస్తాయి. వీటికి మంత్ర శక్తులు ఉన్నాయని నమ్మడం మూఢనమ్మకం మాత్రమే. ఈ అంధ విశ్వాసాలు ఎంత వ్యాపించాయంటే షేక్‌స్పియర్ కూడా తన మాక్‌బెత్‌లో దాని గురించి ప్రస్తావించారు.

కానీ గుడ్లగూబలను ఇలా చంపేస్తున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా దాన్ని ఉపేక్షిస్తున్నాయి. వీటిని బలి ఇవ్వడం వల్ల సంపదలు రెట్టింపవడం నిజమే అయితే, వాటితో వ్యాపారం చేసేవారే కోటీశ్వరులు అయిపోయుండేవారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.