సిగరెట్ అలవాటు లేని అనంత్‌కుమార్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకొచ్చింది?

  • 13 నవంబర్ 2018
లంగ్ క్యాన్సర్ Image copyright Getty Images

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్.. 2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నపుడు చాలా సార్లు దగ్గుతుండటాన్ని జనం, జర్నలిస్టులు చూశారు. అది మే-జూన్ నెలలో సంగతి.

ఎన్నికలు ముగిశాక అనంత్‌కుమార్ వైద్యం కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్లారు. ఆయనకు లంగ్ క్యాన్సర్ (ఊపిరితిత్తుల క్యాన్సర్) ఉందని అప్పుడు గుర్తించారు. ఏడు నెలలు తిరగకముందే.. అనంత్‌కుమార్ ఇక లేరన్న వార్త వెలువడింది.

ఆయన క్యాన్సర్‌, ఇన్‌ఫెక్షన్ కారణంగా చనిపోయారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఆయనను గత కొన్ని రోజులుగా ఐసీయూలో ఉంచి కృత్రిమ శ్వాస అందించారు.

బెంగళూరులోని శంకర క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఆయనకు చికిత్స చేశారు. ఆయన దగ్గుకు చికిత్స చేసేటపుడు క్యాన్సర్ ఉందని గుర్తించింది ఈ ఆస్పత్రిలోనే. క్యాన్సర్‌ను గుర్తించిన తర్వాత అనంతకుమార్ చికిత్స కోసం అమెరికా వెళ్లారు.

ఆయన ఇరవై రోజుల కిందట అమెరికా నుంచి తిరిగి వచ్చి శంకర ఆస్పత్రిలో చేరారు.

Image copyright Getty Images

లంగ్ క్యాన్సర్ రావటానికి కారణాలేమిటి?

లంగ్ క్యాన్సర్‌ను అర్థం చేసుకోవటానికన్నా ముందు.. క్యాన్సర్ వచ్చినపుడు ఏం జరుగుతుందనేది తెలుసుకోవటం ముఖ్యం.

''శరీరంలోని కణాలకు.. ఒక నిర్దిష్ట కాలపరిమితి తర్వాత స్వయంగా ధ్వంసమయ్యే విశిష్ట లక్షణం ఉంటుంది. క్యాన్సర్ వ్యాధిలో.. శరీరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలోని కణాలు ఆ విశిష్ట లక్షణాన్ని కోల్పోతాయి. అవి చనిపోక పోగా.. హెచ్చింపు రేటుతో పెరుగుతూ పోతుంటాయి. రెండు కణాలు నాలుగు, నాలుగు కణాలు ఎనిమిది చొప్పున విస్తరిస్తుంటాయి. స్వయంగా ధ్వంసమయ్యే వాటి సామర్థ్యం పోతుంది. ఈ తరహా ట్యూమర్ ఏర్పడటం మొదలయ్యే శరీర అవయవాన్ని.. క్యాన్సర్ మొదలైన అవయవంగా పరిగణిస్తారు'' అని దిల్లీలోని ధర్మశిల క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్న డాక్టర్ అన్షుమన్ కుమార్ వివరించారు.

లంగ్ క్యాన్సర్ రావటానికి మూడు కారణాలున్నాయని ఆయన చెప్పారు. అందులో మొదటిది.. పొగాకు వినియోగం లేదా ధూమపానం. సిగరెట్లు తాగటం, పొగాకు వాడటానికి.. లంగ్ క్యాన్సర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది. వాటివల్ల లంగ్ క్యాన్సర్ ప్రమాదం ఉంది.

రెండో కారణం.. వాయు కాలుష్యం. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం కానీ.. డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగ కానీ.. అన్నీ బెంజీన్ గ్యాస్ విడుదల చేస్తాయి. ఈ గ్యాస్ వల్ల గాలి కలుషితంగా మారుతుంది. ఆ గాలి పీల్చటం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు ఉంటుంది.

మూడో కారణం.. జన్యుసంబంధమైనది. శరీరంలో ఉన్న జన్యువుల్లో మార్పు వల్ల ఈ తరహా క్యాన్సర్ వస్తుంది.

Image copyright Getty Images

అనంత్‌కుమార్‌కి లంగ్ క్యాన్సర్ రావటానికి కారణమేమిటి?

''అనంత్‌కుమార్ ఏ రకంగానూ పొగాకును వాడలేదు. సిగరెట్లు, సిగార్లు తాగే అలవాటు లేదు. మద్యపానానికీ ఆయన దూరంగా ఉన్నారు. కాబట్టి ఆయనకు క్యాన్సర్ రావటానికి మొదటి అంశం కారణం కాదు. జన్యు సంబంధిత అంశాలు కూడా కారణం కాదు'' అని బెంగళూరులోని శంకర హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్.శ్రీనాథ్ పేర్కొన్నారు.

అనంత్‌కుమార్ కేంద్ర మంత్రి. ఆయన ఎక్కువ కాలం దిల్లీలోనే ఉంటారు. దిల్లీలో వాయు కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందన్నది ప్రపంచమంతా తెలుసు.

అనంత్‌కుమార్‌కి క్యాన్సర్ రావటానికి కారణమేమిటన్న ప్రశ్నకు డాక్టర్ శ్రీనాథ్ నేరుగా సమాధానం చెప్పలేదు.

''క్యాన్సర్‌కి కారణాలు ఏమిటన్నది చాలా సందర్భాల్లో తెలియదు. అనంత్‌కుమార్‌కి లంగ్ క్యాన్సర్ ఉందని ఈ ఏడాది జూన్‌లో గుర్తించారు. ఆయన రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి, నాయకుడు. చాలా ప్రాంతాలు పర్యటిస్తుండేవారు. ఇంటి పట్టునే ఉండిపోవాలని ఆయనకు చెప్పలేరు. కానీ.. ఆయనకు క్యాన్సర్ ఉందని గుర్తించేటప్పటికి అది ముదిరిన దశలో ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''కాలుష్యానికి - ఊపిరితిత్తుల వ్యాధులకు నేరుగా సంబంధం ఉందన్న విషయాన్ని ఎవరూ తిరస్కరించలేరు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్న పేషెంట్లు.. కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కానీ.. ఆయన క్యాన్సర్‌కు దీనికి నేరుగా సంబంధం ఉందని నేను చెప్పను'' అని పేర్కొన్నారు.

లంగ్ క్యాన్సర్ రకాలు, లక్షణాలు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో రెండు రకాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అవి.. సూక్ష్మ కణ క్యాన్సర్, సూక్ష్మ కణేతర క్యాన్సర్.

సూక్ష్మ కణ లంగ్ క్యాన్సర్ శరవేగంగా విస్తరిస్తుంది. దీనికన్నా సూక్ష్మ కణేతర లంగ్ క్యాన్సర్ తక్కువ వేగంగా వ్యాపిస్తుంది.

క్యాన్సర్ అవగాహన పెంపొందించటానికి డాక్టర్లు చేపట్టిన కార్యక్రమాల్లో ''ఇండియా అగైనెస్ట్ క్యాన్సర్'' ఒకటి. ఆ వెబ్‌సైట్ చెప్తున్న దాని ప్రకారం:

  • మూడు వారాలుగా దగ్గు తగ్గకపోవటం
  • గవద బిళ్లల నుంచి రక్తస్రావం
  • మెట్లు ఎక్కుతున్నపుడు వేగంగా శ్వాస తీసుకోవటం
  • ఛాతీ నొప్పి సమస్యలు ఉండటం
  • కోలుకున్న తర్వాత కూడా బరువు క్రమేణా తగ్గుతుండటం

ఇవి లంగ్ క్యాన్సర్ ప్రాధమిక లక్షణాలు కావచ్చు. ఇవి కనిపించినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

కానీ.. లంగ్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు.. మెదడు వంటి వాటికి విస్తరించినట్లయితే.. దానివల్ల శరీరంలోని ఏ భాగమైనా పనిచేయకుండా (పక్షవాతం) పోవచ్చు. క్యాన్సర్ మూత్రపిండాలకు వ్యాపించినట్లయితే కామెర్ల వ్యాధి (జాండిస్) రావచ్చు.

Image copyright PAUL WOOTTON SPL

క్యాన్సర్ దశలు

ఇతర తరహా క్యాన్సర్ల లాగానే.. లంగ్ క్యాన్సర్‌లో కూడా మూడు దశలు ఉన్నాయని డాక్టర్ అన్షుమన్ చెప్తున్నారు.

మొదటి దశ: క్యాన్సర్ ఆరంభయ్యే దశ ఇది. శరీరంలోని ఒక భాగంలో.. అక్కడి కణాలు హెచ్చింపు సంఖ్యలో పెరుగుతుంటాయి. ఈ దశలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ఊపిరితిత్తులు లేదా ఇతర శరీర భాగంలోని ఆ ప్రాంతాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు.

మధ్యస్థ దశ: క్యాన్సర్ కణాలు శరీరంలో ఒక అవయవం నుంచి మరొక అవయవానికి విస్తరించటం మొదలయ్యే దశ ఇది. ఈ దశలో కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీల మిశ్రమంతో చికిత్స చేయాల్సి ఉంటుంది.

ముదిరిన దశ: ఇది క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు పూర్తిస్థాయిలో విస్తరించిన దశ. ఈ దశలో పేషెంట్ కోలుకునే అవకాశం దాదాపు ఉండదు. అయితే.. కీమోథెరపీ ద్వారా చికిత్స చేయవచ్చు.

అనంత్‌కుమార్‌కు లంగ్ క్యాన్సర్ ఉందని గుర్తించినపుడు.. అది ముదిరిన దశలో ఉంది. అయితే.. ఆయన కీమోథెరపీ చికిత్స తీసుకోలేదు. కేవలం మందులు మాత్రమే వాడారని డాక్టర్ శ్రీనాథ్ చెప్పారు.

Image copyright SPL

చికిత్స కోసం అమెరికా ఎందుకు?

సినీ నటి సోనాలి బెంద్రే కానీ, క్రికెటర్ యువరాజ్‌సింగ్ కానీ.. క్యాన్సర్ వచ్చిన ప్రముఖులు ఎవరూ భారత దేశంలో చికిత్స తీసుకోవటానికన్నా.. విదేశాలకు వెళ్లటానికి ప్రాధాన్యం ఇస్తారు.

''చికిత్స కోసం అమెరికా వెళ్లాలని అనంతకుమార్‌కు సూచించింది మేమే'' అని బెంగళూరులోని శంకర హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ చెప్పారు.

''నిజానికి.. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అమెరికా కొన్ని కొత్త మందులను ఆవిష్కరించింది. అవి ఇండియాలో అందుబాటులో లేవు. లంగ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి సమర్థవంతమైన మందులపై అమెరికాలో పరిశోధన చాలా ముందుకెళ్లింది. అందుకే అక్కడికి వెళ్లాలని ఆయనకు మేం సూచించాం'' అని తెలిపారు.

''లంగ్ క్యాన్సర్ చికిత్స కోసం భారతదేశంలో అందుబాటులో ఉన్న మందులు అనంతకుమార్‌కు ఏ మాత్రం పనిచేయలేదు. క్యాన్సర్, సంబంధిత పరిశోధనలో ఇండియా వెనుకబడింది. దేశంలో చాలా పరిమితమైన ప్రమాణాలతో కూడిన చికిత్స మాత్రమే మేం అందించగలం. ముదిరిన దశలోని క్యాన్సర్‌కు మేం చికిత్స చేయలేం. మేం నిస్సహాయులమైనప్పుడు.. ఇతర దేశాల్లో చికిత్స తీసుకోవాలని మేం రోగులకు సిఫారసు చేస్తాం. అమెరికా, యూరప్‌లలో ఇటువంటి పరిశోధనలపై చాలా నిధులు ఖర్చుపెడతారు. కాబట్టి అక్కడ చికిత్స కూడా మెరుగ్గా ఉంటుంది'' అని డాక్టర్ శ్రీనాథ్ వివరించారు.

అయితే.. ''ఇండియాలో అన్ని రకాల క్యాన్సర్‌కూ చికిత్స అందుబాటులో ఉంది. కానీ.. జనం చికిత్స కోసం విదేశాలకు వెళ్లటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. తమ వ్యాధిని దాచిపెట్టటం. రెండోది.. డబ్బు. సెలబ్రిటీ హోదా వల్ల చాలా మంది ధనికులు భారతదేశంలో చికిత్సను విశ్వసించరు'' అని ధర్మశిల క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అన్షుమన్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

లంగ్ క్యాన్సర్ ముప్పు మహిళల కన్నా పురుషులకే ఎక్కువ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐసీపీఆర్)కు చెందిన పలువురు డాక్టర్లు, పరిశోధకులు.. ''ఇండియా అగైనెస్ట్ క్యాన్సర్'' అనే విశిష్ట కార్యక్రమం ప్రారంభించారు.

ఆ కార్యక్రమం వెబ్‌సైట్‌లో చెప్తున్న దాని ప్రకారం.. లంగ్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పురుషుల కన్నా మహిళలకు తక్కువ ఉంటుంది.

దీనితో డాక్టర్ శ్రీనాథ్ కూడా ఏకీభవిస్తున్నారు. ఇప్పటివరకూ చూసిన దాని ప్రకారం.. లంగ్ క్యాన్సర్ కేసులు పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ.. ఇప్పుడు మహిళల్లోనూ ఈ కేసులు కనిపించటం పెరుగుతోంది.

ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో జనం చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారని.. ఇది ఆందోళనకర విషయమని డాక్టర్ శ్రీనాథ్ చెప్తున్నారు. కానీ దీనికి కారణమేమిటన్నది ఇంకా తెలియదు.

క్యాన్సర్ రోగి సగటు వయసు సుమారు 54 సంవత్సరాలుగా 'ఇండియా అగైనెస్ట్ క్యాన్సర్' వెబ్‌సైట్ చెప్తోంది.

చాలా మందికి లంగ్ క్యాన్సర్ రావటానికి.. పొగాకు తీసుకోవటం, సిగరెట్లు తాగటం, కాలుష్యం కారణాలుగా ఉన్నాయి. మీకు సిగరెట్లు తాగటం, పొగాకు అలవాటు ఉన్నట్లయితే తక్షణం మానేయండి.

ఒకవేళ మీరు పాసివ్ స్మోకర్ అయినట్లయితే.. మీ మిత్రులు, ఇతరులు ధూమపానం చేసే ప్రాంతాల్లో మీరు ఉండకుండా చూసుకోండి.

కాలుష్య కారక వాయువులు అధికంగా ఉండే ప్రాంతాల్లో పని చేయటానికి దూరంగా ఉండండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)