ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు

మాజీ ఎంపీలు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, పొన్నం

తెలంగాణ అసెంబ్లీ బరిలో ఈసారి మాజీ ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన నేతల్లో కొందరు ఈసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 65 మంది, రెండో విడతలో 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించగా అందులో ఏడుగురు గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైనవారున్నారు.

ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో వారినే బరిలో దించేందుకు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది.

టికెట్ దక్కిన మాజీ ఎంపీలు వీరే..

కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, రమేష్ రాథోడ్, బలరాం నాయక్, మల్లు రవి, సర్వే సత్యనారాయణలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

మరోవైపు వీరంతా అంతకుముందు 2009లో జరిగిన ఎన్నికల్లో గెలిచి 15వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించినవారే.

ఫొటో క్యాప్షన్,

రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి బ్రదర్స్

గత సాధారణ ఎన్నికల్లో భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి‌గా బరిలోకి దిగిన బూర నర్సయ్యగౌడ్ .. కోమటి రెడ్డిపై విజయం సాధించారు.

గత ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేతిలో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.

2009 సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన సర్వే సత్యనారాయణ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

1999 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన మల్లు రవి ఆ తర్వాత రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన జడ్చర్ల అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు.

మహబూబాబాద్ ఎంపీగా 2009 ఎన్నికల్లో గెలిచి మన్మోహన్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేసిన బలరాం నాయక్ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మహబూబాబాద్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసేందుకు ఈసారి టికెట్ ఇచ్చింది.

మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఈసారి నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన 15వ లోక్ సభలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నారాయణఖేడ్‌ అసెంబ్లీ టికెట్ కేటాయించింది.

ఎంపీ రమేశ్ రాథోడ్‌కు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది.

ఎంపీలుగా ఉంటూ..

టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఈసారి అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. పెద్దపెల్లి ఎంపీగా వ్యవహరిస్తున్న ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం టికెట్ ఇచ్చింది. చెన్నూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదేలుకు టికెట్‌ నిరాకరించింది.

టీఆర్ఎస్ తన రెండో జాబితాలో మేడ్చల్ స్థానానికి సీహెచ్ మల్లారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)