భారతదేశం ఇస్లామిక్ పేర్ల మీద యుద్ధం ప్రకటించిందా?

  • 14 నవంబర్ 2018
అలహాబాద్ రైల్వే స్టేషన్ Image copyright AFP

పేరులో ఏముంది? కానీ భారతదేశంలోని నగరాలు, పల్లెల పేర్లలో మాత్రం చాలానే ఉంది.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సుమారు వందకు పైగా నగరాలు, పట్టణాలు, పల్లెల పేర్లను మార్చారు. బొంబాయి ముంబై అయింది.. కలకత్తా కోల్‌కతా అయింది.. మద్రాస్ చెన్నైగా మారింది.

బ్రిటిష్ పాలకులు చిన్నాభిన్నం చేసిన పేర్లను సరిదిద్దారు. వలస పాలనను ప్రతిబింబించే కొన్నిపేర్లను నిరాకరించారు.

స్వాభిమానం, ఆత్మగౌరవం, భాషాపరమైన జాతీయవాదం, కొందరు వ్యక్తుల ఇష్టాయిష్టాలు.. పేర్లను మార్చడానికి ఇవన్నీ కూడా కారణాలే.

కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని హిందూ జాతీయవాదులను సంతృప్తిపరచడానికి ఉన్మాదం స్థాయిలో పేర్లను మారుస్తోంది.

Image copyright Getty Images

ఆగ్రా పేరుకూ..

మొదట జులైలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషన్ మొఘల్ సరాయ్ పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని మార్చడంతో ఇది మొదలైంది.

గత నెల అదే యూపీలోని హిందూ తీర్థయాత్ర కేంద్రమైన అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్ అని మార్చారు. (ఈ నగరం మూడు నదుల సంగమ ప్రదేశంలో ఉంది)

435 ఏళ్ల ఆ నగరం పేరు మార్చడానికి ముఖ్య కారణం.. ఆ పేరు పెట్టింది ముస్లిం పాలకులు కావడమే.

ఇది చాలదన్నట్లు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లాను రాముని జన్మస్థలమైన అయోధ్య పేరుగా మార్చింది.

ఇదే అయోధ్యలో కొన్ని హిందూ మూకలు1992లో ఒక పురాతన మసీదును కూలగొట్టాయి. తదనంతరం జరిగిన మతకల్లోలాలలో దేశవ్యాప్తంగా సుమారు 2 వేల మంది మరణించారు.

ఇప్పుడు బీజేపీ నేతలు ఉత్తరప్రదేశ్‌లో అద్భుత కట్టడం తాజ్ మహల్ ఉన్న ఆగ్రా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ల పేర్లను మార్చాలని యోచిస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ప్రభుత్వం 'ఇస్లామిక్‌'గా ధ్వనించే మూడు గ్రామాల పేర్లను మార్చేసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక దిల్లీలోని ఔరంగజేబు రోడ్డును ఇప్పుడు అబ్దుల్ కలామ్ రోడ్డుగా మార్చారు

రాజకీయాల్లో మొదటి బలిపశువు చరిత్రే

సాధారణ ఎన్నికలకు ఇంకా ఒక ఏడాది సమయం కూడా లేని ఈ సమయంలో ఈ పేర్ల మార్పిడి.. భిన్న విశ్వాసాలు, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

దిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు గగన్‌ప్రీత్ సింగ్.. పేర్ల మార్పిడి రాజకీయాలకు సంబంధించిన వేర్లు జాతీయవాద వారసత్వంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

2014లో మోదీ ప్రభుత్వం.. మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ పేరుతో ఉన్న రోడ్డుకు భారతదేశపు మిస్సైల్ ప్రోగ్రామ్‌కు ఆద్యుడిగా భావించే మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు పెట్టింది.

భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు తమకు సరైన ప్రాతినిధ్యం లేదని ఎందుకు భావిస్తున్నారో, లేదా బీజేపీ ఎందుకు హిందువులను బాధితులుగా భావిస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. దేశంలో ఎక్కువ గ్రామాల పేర్లలో రాముడు లేదా కృష్ణుడు ఉంది. అదే మొఘల్ పాలకుడు అక్బర్ పేరిట కనీసం 234 గ్రామాలు కూడా లేవు.

ఈ పేర్ల మార్పిడి కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అనేక కారణాలతో, ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఇది జరుగుతోంది.

పాకిస్తాన్‌లో కూడా అనేక రోడ్లు, ప్రాంతాలకు ముస్లిం పేర్లను పెడుతున్నారు.

భారతదేశ చరిత్రలో ముస్లింలకు స్థానం లేకుండా చేయడంలో భాగంగానే ఈ పేర్లను మార్చే పరంపర సాగుతోందని విమర్శకులు భావిస్తున్నారు.

ప్రముఖ చరిత్రకారుడు ఇర్భాన్ హబీబ్ అన్నట్లు, 'రాజకీయాలలో మొదటి బలిపశువు చరిత్రే' అవుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం పేరు మార్చాలన్న ప్రతిపాదన ఉంది

కీలకమైన సాధారణ ఎన్నికలు ఇంకా కేవలం ఐదు నెలల దూరంలో ఉండగా, బీజేపీ పేర్లు మార్పిడి ప్రక్రియను హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగా భావించొచ్చు.

గత మార్చిలో హోం శాఖ అధికారి ఒకరు.. దేశంలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, రైల్వే స్టేషన్ల పేర్లు మార్చాలని 27 ప్రతిపాదనలు వచ్చినట్లు పార్లమెంటుకు తెలిపారు. వాటిలో ఎక్కువ భాగం బీజేపీ పాలిత రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల నుంచే వచ్చాయి.

అయితే పేర్ల మార్పిడి వల్ల బీజేపీకి ఓట్లు పడతాయన్న దానికి ఖచ్చితమైన పూచీ లేదు.

ఇటీవలి కాలంలో పేర్ల మార్పిడి కోసం పెద్దగా ఆందోళనలేమీ జరగలేదు. అదే విధంగా పేర్ల మార్పిడి వల్ల జనమేమీ పెద్దగా సంతోషించినట్లు కూడా దాఖలాలు లేవు.

''సమాజంలో సంక్షేమరీత్యా ఎలాంటి అభివృద్ధీ లేనపుడు, ఇలా పేర్లను మార్చడం వల్ల.. పరిస్థితులు మారుతున్నాయన్న భ్రమ కలుగుతుంది'' అన్నారు సామాజికవేత్త సంజయ్ శ్రీవాస్తవ.

''అసలు దీనిని ఎవరైనా పట్టించుకుంటారో లేదో నాకు తెలీదు. కేవలం అన్ని రంగాలలో బీజేపీ ముద్ర కనిపించడం తప్ప.. దీని వల్ల ఓట్లు రాలతాయని కూడా నేననుకోను'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)