ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో ఆఫీస్ వేలం

  • 15 నవంబర్ 2018
కదిరి సివిల్ కోర్టు Image copyright RAVI

భూములను వేలం వేస్తారు, ఇళ్లు, ఫ్యాక్టరీలను వేలం వేస్తారు. కానీ ఒక ఎమ్మార్వో ఆఫీసు కోసం పాడిన వేలంపాటను ఎప్పుడైనా విన్నారా? కానీ ఇది జరిగింది. అనంతపురంలో ఓ వ్యక్తి ఏకంగా ఒక ఎమ్మార్వో కార్యాలయాన్ని వేలంపాటలో కొనేశారు.

అనంతపురం జిల్లా నల్లచెరువు మండల రెవెన్యూ కార్యాలయాన్ని నవంబర్ 14వ తేదీ బుధవారం వేలం వేశారు. ఈ వేలంపాటలో ఓ వ్యక్తి 10.25లక్షల రూపాయలకు ఎమ్మార్వో ఆఫీసును దక్కించుకున్నారు.

నుదురు చిట్లించి ఆలోచిస్తున్నారా? ఆగండి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఓ 30ఏళ్లు వెనక్కు వెళ్లాలి.

సంవత్సరం: 1987.

ప్రాంతం: అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం బోడినేపల్లి గ్రామం.

బోడినేపల్లి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొందరు గ్రామస్థుల వద్ద నుంచి 1987లో అధికారులు కొంత భూమిని సేకరించారు.

భూసేకరణలో భాగంగా.. బండ్రేపు నరసింహా రెడ్డి, పల్లె వెంకట రెడ్డి అనే ఇద్దరు రైతులకు చెందిన 1.20 ఎకరాల భూమిని కూడా అధికారులు తీసుకున్నారు.

అందుకు పరిహారంగా వీరికి ఎకరాకు 3,800 రూపాయలు మాత్రమే ఇచ్చి, వీరి భూమిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, మిగిలిన 8 సెంట్ల భూమిలో ఎమ్మార్వో కార్యాలయాన్ని కూడా నిర్మించారు.

ఈ సంఘటన గురించి బాధితుల తరపు లాయర్ చంద్రశేఖర్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది. ఈ కేసుకు చెందిన వివరాలను ఆయన తెలిపారు.

తమకు పరిహారం పెంచాలంటూ అప్పటి భూసేకరణ అధికారిని రైతులు కోరారు.

ప్రభుత్వ పరిహారంలో తమకు అన్యాయం జరిగిందని, పరిహారాన్ని మరింత పెంచాలని రైతులు కోరుతున్న విషయాన్ని కదిరి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు భూసేకరణ అధికారి రెఫర్ చేసినట్లు లాయర్ చెప్పారు.

''ఈ కేసులో.. 1997లో ఎకరాకు 18వేలు ఇస్తూ, ఎకరాకు 30శాతం చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని, 1987 నుంచి 12% వడ్డీ జత చేసిమరీ రైతులకు డబ్బు ఇవ్వాలని కదిరి కోర్టు ఆదేశించింది'' అని లాయర్ చంద్రశేఖర్ అన్నారు.

Image copyright RAVI
చిత్రం శీర్షిక నరసింహా రెడ్డి, అతని సోదరుడి కుమారుడు

‘బస్సు చార్జీలకీ ఇబ్బంది పడినాం!’

కానీ కదిరి కోర్టు తీర్పును సవాలు చేస్తూ, అప్పటి అధికారులు 1999లో హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఖర్చులకోసం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డామని, బాధితుల్లో ఒకరైన నరసింహా రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘ఓపక్క కరవు, ఇంకోపక్క పిల్లల చదువులు. ఇవి రెండూ కాదని ఈ కోర్టు ఖర్చులు.. శానా ఇబ్బంది పడినాం. కొన్నిసార్లు కోర్టుకు పోవల్లంటే, బస్సు చార్జీలకీ ఇబ్బంది పడినాం’’ అని నరసింహా రెడ్డి అన్నారు.

హైకోర్టులో కూడా వీరికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. 2010లో అధికారుల అప్పీలును హైకోర్టు డిస్మిస్ చేసింది అని లాయర్ అన్నారు.

‘‘కదిరి కోర్టు నిర్ణయించిన మొత్తం పరిహారంలో తక్షణమే 35,480 రూపాయలను చెల్లించాలని, ఆ తర్వాత తక్కిన 1,34,218 రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది'' అని లాయర్ వివరించారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు చెప్పిన 35,480 రూపాయలను డిపాజిట్ చేసిన అధికారులు, తక్కిన పరిహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

తక్కిన పరిహారం కోసం ఈ రైతులు మళ్లీ కదిరి కోర్టును ఆశ్రయించారు. 2010 నవంబర్‌లో కదిరి కోర్టులో ఎక్జిక్యూటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు, పరిహారం చెల్లించకుండా ఈ రైతుల భూమిలో నిర్మించిన ఎమ్మార్వో కార్యాలయాన్ని నవంబర్ 14, 2018న వేలం వేయాలని కదిరి కోర్టు తీర్పు చెప్పిందని లాయర్ అన్నారు.

''నవంబర్ 14న వేలం వేయాలని, వచ్చిన డబ్బులో ఈ రైతులకు రావాల్సిన పరిహారం ఇవ్వాలని గత నెల అక్టోబర్‌లో కదిరి కోర్టు ఆదేశించింది''.

కోర్టు ఆదేశాల మేరకు అధికారులు బుధవారం మధ్యాహ్నం వేలంపాటను ప్రారంభించారు. ఈ వేలంపాటలో ఆరుగురు పాల్గొన్నారు. వీరిలో దశరథరామయ్య నాయుడు అనే వ్యక్తి 10,25,000 రూపాయలకు ఎమ్మార్వో కార్యాలయాన్ని పొందారు.

Image copyright RAVI
చిత్రం శీర్షిక ఎమ్మార్వో కార్యాలయాన్ని వేలంపాటలో కొనుగోలు చేసిన దశరథరామయ్య నాయుడు

‘ఇవన్నీ మామూలే!’

ఈ విషయమై కదిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కేసులు చాలా నడుస్తున్నాయని, అయితే ఇలాంటి కోర్టు కేసులకు సకాలంలో స్పందించాలని అన్నారు.

''ఈమధ్యనే బాధిత రైతులకు చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని కలెక్టరు గారు విడుదల చేశారు. ఆ మొత్తం డబ్బును కోర్టులో చెల్లించే లోపలే వేలం పాట ముగిసింది. మేం రెండుమూడు రోజుల్లో డబ్బును కట్టేస్తాం'' అన్నారు.

కలెక్టర్ ఇచ్చిన చెక్‌ను ప్రాసెస్ చేయడంలో బ్యాంకులో సాంకేతిక సమస్య ఉండటం కూడా సకాలంలో పరిహారాన్ని అందించలేకపోవడానికి ఓ కారణమని ఆర్డీఓ రామ్మోహన్ అన్నారు.

కానీ 2010లో హైకోర్టు వెలువరించిన ఆదేశాలను ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

Image copyright Getty Images

‘ఆశలు వదులుకోవల్ల.. లేదంటే ప్రాణాలనైనా ఇడిసిపెట్టల్ల’

ఆర్డీఓ రామ్మోహన్ వ్యాఖ్యలపై బాధితుడు నరసింహా రెడ్డి మాట్లాడుతూ..

‘‘బాధ్యత ఉన్న ఉద్యోగులు లేరు సార్! ఇవన్నీ మామూలేనని ఆర్డీఓ సారు అన్నాడని పేపర్లో చదివినా. ఇరవై దినాల కిందటే వేలం పాట నోటీసు ఇచ్చినారు. ఇన్నాళ్లూ ఊరికేవుండి, ఇప్పుడు లేటయ్యిందని అంటున్నారు. జడ్జి సారు కూడా ఇట్లాంటి కారణాలు చెప్పొద్దండి నాకు అని మందలించినాడు’’ అన్నారు.

భూ పరిహారాన్ని పెంచాలంటూ 1988లో నమోదైన కేసులో 2010లో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2018లో ఎమ్మార్వో కార్యాలయాన్ని వేలం వేశారు. కానీ పరిహారం అందేలోపే కేసు వేసిన రైతు సోదరుల్లో ఒకరైన పల్లె వెంకట రెడ్డి చనిపోయారు.

‘‘మాకేమో పంటల్లేవు. అప్పులు చేసి సేద్యం చేయల్ల. పిల్లల చదువుల ఖర్చు బరువయ్యింది. ఇంకోపక్క ఈ కోర్టు ఖర్చులు.. ఇవన్నీ తట్టుకోలేక నా ఆస్తిలో 10 ఎకరాలు అమ్మేసినా సార్.. మా డబ్బులు మాకిచ్చేందుకు 30 సంవత్సరాలు పట్టింది. ప్రభుత్వం ఇట్ల నిర్లక్ష్యం చేస్తే, రైతులు ఏంచేయల్ల? పరిహారం మీద ఆశలన్నా వదులుకోవల్ల, లేదంటే ప్రాణాలన్నా ఇడిసిపెట్టల్ల! కానీ మా కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కోర్టు ఎండగట్టింది’’ అని నరసింహా రెడ్డి అన్నారు.

Image copyright RAVI

కోర్టులో డబ్బు కడితే, ఎమ్మార్వో ఆఫీస్ ప్రభుత్వానికి దక్కుతుందా?

ఎమ్మార్వో కార్యాలయాన్ని వేలం పాటలో కొన్న వ్యక్తి ఇప్పటికే మూడో వంతు డబ్బును కోర్టుకు చెల్లించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరి.. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేస్తే అపుడు ఎమ్మార్వో ఆఫీసు తిరిగి ప్రభుత్వానికి దక్కుతుందా అంటే.. దక్కవచ్చు అని లాయర్ చంద్రశేఖర్ అంటున్నారు.

‘‘వేలం పాట పాడిన వ్యక్తి పూర్తి డబ్బులు కట్టేశాక, సేల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇందుకు 60 రోజులు టైం ఉంటుంది. ఈలోపల రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చేసి, వేలం పాడిన వ్యక్తికి, ఆయన పాడిన మొత్తంలో 10% కాంపెన్సేషన్ కట్టి, ఎమ్మార్వో ఆఫీసును ప్రభుత్వం తీసుకోవచ్చు..’’ అని లాయర్ అన్నారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ భూసేకరణ విధానాలు, పరిహారం కోసం దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరిగే ప్రజల పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘కోర్టు వేలం జరుగుతుందని తెలిసినా, డబ్బు కట్టాలన్న స్పృహ అధికారులకు లేదు. ప్రభుత్వం నుంచి భూముల పరిహారం అందని రైతులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. కోర్టులు వేలం వేసే పరిస్థితి వస్తేతప్ప, పరిహారం అందించరా? ప్రభుత్వమే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇక ప్రైవేటు కంపెనీల నుంచి రావాల్సిన పరిహారం సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు" అని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అన్నారు.

’’ప్రభుత్వం పరిహారం సొమ్మును కోర్టులో జమచేసి ఆఫీసును తిరిగి పొందవచ్చు కానీ, ఈ పోరాటంలో రైతులదే అంతిమ విజయం. దేశవ్యాప్తంగా ప్రజలకు అందాల్సిన పరిహారం విషయంలో ఇదే పద్ధతి అనుసరించడం మంచిది. కదిరి కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం’’ అని రాంభూపాల్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్: ‘మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి’ - మొహమ్మద్ సత్తార్ ఖాన్‌కు యూఐడీఏఐ నోటీసు

ఆర్మీలో మహిళాధికారులు శాశ్వత కమిషన్‌కు అర్హులన్న సుప్రీం కోర్టు తీర్పుతో జరిగేదేంటి

టీనేజ్ అమ్మాయిల ఫొటోలు పంపించి సైనికుల ఫోన్లు హ్యాక్ చేసిన మిలిటెంట్లు

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు

ఐఫోన్లకు కరోనా వైరస్ దెబ్బ.. ఉత్పత్తి, అమ్మకాలు, ఆదాయంపై ప్రభావం పడిందన్న ఆపిల్

పంటకు నష్టం చేసిన కలుపుమందు.. బేయర్ సంస్థకు రూ. 1,890 కోట్ల జరిమానా విధించిన కోర్టు

కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది